బావ-మరదలు



కొట్టు కట్టేసి ఇంటికి వచ్చిన సుబ్బిశెట్టి , ముందు గదిలో వున్న పెట్టెను చూసి, “మళ్ళీ ఎవరు దిగారు తేరగా తిని పోవడానికి?" అని చిరాకుగా భార్యను అడిగాడు. "కాస్త చిన్నగా మాట్లాడండి. నన్ను చూడాలనిపించి, మా చెల్లెలు వచ్చింది. పెరట్లో స్నానం చేస్తున్నది." అన్నది అతడి భార్య పార్వతి. సుబ్బిశెట్టి పెద్దగా నవ్వి, "నీ అంత అనాకారిని, పని గట్టుకుని చూడవచ్చే వారు కూడా పున్నారన్న మాట!" అన్నాడు. పార్వతి మనసు చివుక్కుమన్నది. పెద్ద కట్నం తీసుకుని సుబ్బిశెట్టి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అనాకారి అని వేలెత్తి చూపుతూ, ఆమె మనసు గాయపరుస్తూనే వున్నాడు. స్వతహాగా సాధువయిన పార్వతి, ఆ బాధను ఎంతో కాలంగా తనలోనే దిగమింగుకుంటున్నది. ఆమె భర్తకు మంచినీళ్ళు అందిస్తూ, "గుర్తుంచుకుని, రేపు ఒక చీర తీసుకురండి,” అన్నది.

"కొత్త చీరా! ఎందుకూ?" అన్నాడు సుబ్బిశెట్టి ఆశ్చర్యపోతూ. "నా కోసం కాదండీ, మా చెల్లెలి కోసం. రాకరాక వచ్చింది కదా!" అన్నది పార్వతి. "ఇది మరీ బావుంది! మీ వైపు వాళ్ళక్కూడా చీరెలూ, సారెలూ పెట్టాలని ముందే చెప్పివుంటే, మీ నాన్న దగ్గర మరి కాస్త కట్నం గుంజి వుండేవాణ్ణి" అన్నాడు శెట్టి నిర్మోహమాటంగా. అంతలో స్నానం చేసి మరదలు లక్ష్మి అక్కడికి రావటం చూస్తూనే శెట్టి నవ్వుముఖం పెట్టి, “ఇంత కాలానికా రావడం? కనీసం మీ అక్కనైనా చూడాలనిపించలేదా?" అన్నాడు. "ఎక్కడ బావా, చదువుతో సరిపోతున్నది" అన్నది లక్ష్మి నవ్వుతూ. "అదీ నిజమే అనుకో. కాని, రాకరాక ఇలాంటి సమయంలో వచ్చావేమిటి? ఊరంతా ముసుగుదొంగల భయంతో అట్టుడికిపోతున్నది. దారిలో ఎవరైనా నిన్ను అటకాయించివుంటే, ఏమయేది?" అన్నాడు శెట్టి. "వాళ్ళకు నీ పేరు చెప్పి వుండేదాన్ని. కాళ్ళమీద పడి క్షమాపణ కోరివుండే వాళ్ళు," అంటూ విరగబడి నవ్వింది లక్ష్మి. పెళ్ళినాడు సుబ్బిశెట్టి తన ధైర్యసాహసాలను గురించి ఎన్నో కల్పిత కథలు చెప్పాడు. లక్ష్మి అవేవీ మరిచిపోలేదు.

"నువ్వన్నమాటా, నిజమేలే!" అంటూ శెట్టి ఒక వెర్రినవ్వు నవ్వాడు. ఆ సమయంలో రంగన్న అనే అతను వచ్చి, సుబ్బిశెట్టికి వందరూపాయల మూట ఇచ్చి వెళ్ళాడు. అతను రెండు సంవత్సరాల క్రితం శెట్టి దగ్గర అప్పచేసి, అది తీర్చకుండానే ఊరువదలి పారిపోయాడు. అయితే, తరవాత రంగన్న పట్నంలో ఉద్యోగం సంపాయించి అనుకోకుండా ఆ రోజున వచ్చి పాత బాకీ తీర్చాడు. సుబ్బిశెట్టి భార్యను పిలిచి, డబ్బుసంచీ ఆమె చేతికిచ్చి, ఇనప్పెట్టెలో దాయమన్నాడు. పార్వతి అతణ్ణి లోపలికి పిలిచి, “రాదనుకున్న డబ్బు వచ్చింది కదా? ఒక చీర కొనుక్కురండి" అంటూ భర్తను బతిమాలింది. "ఇంకా నయం! ఇనప్పెట్టె తలుపు మూసెయ్యి" అంటూ శెట్టి, భార్యను కసిరాడు. పార్వతి మరి మాట్లాడలేదు. తరవాత ముగ్గురూ భోజనాలు చేశారు. పార్వతి కంచాలు ఎత్తుతూ, "దొంగల భయం కదా. ఎంగిలి కంచాలు కూడా వంటగదిలోనే వుంచుకోవాల్సి వస్తున్నది." అన్నది చెల్లెలితో. "అదేమిటి అక్కా! బావ బయట కాపలా పడుకోవడం లేదూ? ఆయన పెరట్లో పడుకుంటే, ఏ దొంగకు మాత్రం గోడదూకి లోపలికి రావడానికి గుండె వుంటుంది, అవునా బావా?" అన్నది లక్ష్మి. “మరే, మరే!" అంటూ నీళ్ళు నమిలాడు శెట్టి. ఆరుబయట పడుకోవడం అన్న ఊహ రాగానే అతడికి కాళ్ళు వణకడం ప్రారంభమయింది. లక్ష్మి స్వయంగా ఎంగిలి కంచాలు బావి పళ్ళెంలో పెట్టి వచ్చి, "భయం లేదులే, అక్కా! బావ పెరట్లో పడుకుంటాడు" అన్నది. పార్వతికి భర్త పిరికితనం తెలుసు. ఆమె, "ఆయన ఎలా పడుకుంటారే, ఆయనకి..." అంటూ ఏమో చెప్పబోయింది. సుబ్బిశెట్టి చప్పున కల్పించుకుని, “నాకేం భయమనుకుంటున్నారా? దుడ్డుకర్ర మంచం కింద పెట్టుకుని పడుకుంటాను. ఏ దొంగ వెధవయినా వచ్చాడో, బుర్ర బద్దలు కొట్టేస్తాను, నా మంచం పెరట్లో వేసెయ్యి.” అన్నాడు బింకంగా.

పార్వతి భర్తకు పెరట్లో మంచం వేసింది. శెట్టి మంచం కింద లావుపాటి దుడ్డుకర్ర పెట్టుకున్నాడు. అక్కా చెల్లెళ్ళు తలుపులు మూసుకుని లోపల పడుకున్నారు. సుబ్బిశెట్టి భయంతో వణికి పోతూ, అర్థరాత్రి వరకూ కన్ను మూయలేదు. తరువాత చిన్న కునుకుపట్టింది. అంతలో ఎవరో వీపు తట్టినట్లయి మెలుకువ వచ్చింది. ఎదురుగా ముసుగుదొంగ! అతడి చేతిలో మెరుస్తున్న కత్తి. శెట్టి గుడ్లు తేలవేసి, నోటమాట రాక, చేతితో మంచం కిందికి సౌంజ్ఞ చేశాడు. దొంగ మంచం కింద వున్న దుడ్డుకర్ర పైకి తీసి, "నన్ను కొట్టాలనే, ఈ దుడ్డుకర్ర ఇక్కడ దాచావన్నమాట?" అంటూ కత్తి పైకెత్తాడు. శెట్టి ఎలాగో గొంతు పెగుల్చుకుని, "ఆ కత్తి చూస్తే, నాకు నోటమాట రావడం లేదు. దాన్ని మొలలో దాచి, దుడ్డుకర్ర చేతిలో వుంచుకోండి," అన్నాడు నీరసంగా, "మాటలతో కాలయాపన చెయ్యకు, జాగ్రత్త! ముందు తలుపులు తెరిపించు. నాకు డబ్బు కావాలి." అంటూ దొంగ కత్తి ఝుళిపించాడు. "లోపల ఆడవాళ్ళున్నారు నా పరువు పోతుంది, బావి పళ్ళెంలో కంచాలున్నాయి. అవి పట్టుకుపోండి" అన్నాడు. శెట్టి. దొంగ గట్టిగా పళ్ళుకొరికి, "మీ ఎంగిలి కంచాలు నన్ను మోసుకుపొమ్మంటావా? మళ్ళీ నోరెత్తావంటే, నిలువుగా చీల్చెయ్యగలను!" అన్నాడు.

"కాస్త చిన్నగా మాట్టాడండి. లోపల నా భార్యే కాక, గుండెజబ్బు మనిషి నా మరదలు కూడా వున్నది." అంటూ శెట్టి పోయి కిటికీలోంచి "పార్వతీ! పార్వతీ!" అని మెల్లిగా పిలిచాడు. పార్వతి కళ్ళు నులుముకుంటూ వచ్చి, "భయం వేస్తున్నదా? లోపలికి వస్తారా?" అని అడిగింది. "నీ మొహం, ఇవతల పెద్దమనిషి నిలబడి వున్నాడు. ఆయనకు అవసరంగా డబ్బు కావాలిట. సాయంత్రం రంగన్న ఇచ్చిపోయిన డబ్బేగా మన దగ్గరున్నది! పోయి, త్వరగా ఇలా పట్టుకురా," అన్నాడు శెట్టి. పార్వతి ఆశ్చర్యంగా భర్త ముఖం కేసి చూసి, డబ్బు సంచి తెచ్చి ఇచ్చింది. సుబ్బిశెట్టి దాన్ని దొంగ చేతిలో పెట్టాడు. దొంగ మరి మాట్లాడకుండా చీకట్లోకి జారుకున్నాడు. సుబ్బిశెట్టికి ఇక నిద్రపట్టలేదు. డబ్బు పోయినందుకు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ, తెల్లవారే దాకా జాగరణ చేశాడు.

మర్నాడు లక్ష్మి, "బావా నేను సాయంత్రం వెళ్ళిపోతున్నాను. వచ్చేటప్పుడు అక్క కోసం చీర తెద్దామనుకున్నాను గాని. వీలుకాలేదు. డబ్బిస్తాను, ఒక చీర కొనుక్కురా," అంటూ డబ్బు సంచీ శెట్టికి ఇచ్చింది. ఆ సంచీ చూసి శెట్టి ఉలిక్కిపడ్డాడు. దాన్ని రాత్రి అతను స్వయంగా దొంగ చేతికిచ్చాడు. లక్ష్మి చిన్నగా నవ్వి, "అలా చూస్తావేం, బావా? దొంగకిచ్చిన సంచీ నా చేతిలోకి ఎలా వచ్చిందనా? ఆ దొంగను నేనేగా! దుప్పటి చుట్టబెట్టుకుని, పళ్ళు కోసుకునే కత్తి తీసుకుని, గొంతు మార్చి బెదిరించాను. నువ్వు పిరికివాడివే కాదు, లోభివి కూడా. స్నానం చేసివచ్చి, పక్కగదిలో వుండి, నీకూ, అక్కకూ జరిగిన సంభాషణ అంతా విన్నాను. అక్క అనాకారే! అది ఆవిడ తప్పు కాదు. బాహ్యంగా మారడం ఎవరికీ సాధ్యం కాదు. కాని, మానసికంగా మారేందుకు ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఇప్పటికైనా, నీ కుళ్ళు బుద్ధి నుంచి బయటపడి, తాళికట్టిన భార్యను సూటీపోటీ మాటలతో హింసపెట్టడం మానుకుంటావని నమ్ముతున్నాను,” అన్నది. సుబ్బిశెట్టి వెలవెల పోయి, డబ్బు సంచీని విసురుగా లక్ష్మి మీదికి గిరవాటు వేసి, వీధిలోకి పోయాడు.

"మీ బావకు కోపం వచ్చింది. ఇంత నాటకం ఎందుకాడావు?” భయపడిపోయింది. అంటూ పార్వతి అయితే కొద్ది సేపట్లోనే సుబ్బిశెట్టి రెండు ఖరీదైన చీరలు తీసుకుని, నవ్వు ముఖంతో తిరిగివచ్చాడు. పార్వతి పట్టరాని సంతోషంతో చెల్లెలి భుజం తట్టి, "మీ బావ మారిపోయాడు. ఏడాది కాలంలో ఏమాత్రం మార్చలేని మనిషిని మరదలు ఒక్క రోజులో మార్చేసింది! అన్నది".