రామన్న తీర్పు



గ్రామంలో అందరూ రామన్నను పనికిరాని వెర్రిబాగులవాడుగా పరిగణిస్తారు. వాస్తవానికి రామన్న కాళికాదేవి వరము పొందినవాడు ! ఒకసారి ఒక గొప్ప పండితుణ్ని రామన్న తన తెలివితేటలతో, పరిజ్ఞానంతో వోడించటంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. తన గ్రామంలోని ప్రజలంతా రామన్నను పొగడ్తలతో ముంచెత్తారు. రామన్న తండ్రి సుబ్బన్న కొడుకు తెలివి తేటలకు సంతోషించాడు. తన కొడుకు అంతటి పండితుడు కాగలడని సుబ్బన్న కలలోకూడా వూహించలేదు. రామన్న తల్లి ముత్యాలమ్మకూడా తన కొడుకు గొప్ప పండితుడయ్యాడని అమితానందం పొందింది. అందుకు కారణం శ్రీరాముడి ఆశీర్వాదబలమని ఆమె నమ్మింది. ఏమయినప్పటికీ, ఆ సంఘటనతో రామన్న పేరు ప్రతిష్టలు ఆ చుట్టు ప్రక్కల గ్రామాలన్నింటికి విస్తరించింది. ఆయా గ్రామస్థులు తమలో తమకు గొడవలు, స్పర్ధలు వచ్చినప్పుడు రామన్న దగ్గరకు వచ్చి వాటిని పరిష్కరించుకుంటున్నారు. రామన్న ఇస్తున్న తీర్పులు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రతి వొక్కరు వాటిని ఆమోదిస్తున్నారు.

రామన్న తన తీర్పులో ఎప్పుడూ పొరపాటు చేయటం జరగలేదు. ఒకసారి రామన్న రాజుగారు వుంటున్న పట్టణం వెళ్ళాడు. ఆ పట్టణంలో అపరిచిత వ్యక్తులనందరిని ఆశ్చర్యంగా పరిశీలిస్తూ వున్నాడు. ఒకచోట నలుగురు వ్యక్తులు కలిసి ఒక పూటకూళ్లమ్మ ఇంట్లోకి ప్రవేశించటం రామన్న చూశాడు. రామన్న చూస్తూ వుండగానే ఆ నలుగురూ ఆ పూటకూళ్ళమ్మ యజమానురాలితో "అమ్మా! రెండు మూడు రోజులు మేము ఇక్కడే వుంటాం. దయచేసి ఈ పెట్లెను మీ దగ్గర వుంచండి. మేమందరం కలసి వచ్చినప్పుడు మాత్రమే ఈ సంచిని మాకు తిరిగి ఇవ్వండి. మాలో ఏ ఒక్కరు వచ్చినా ఈ పెట్టెను ఇవ్వద్దు” అన్నారు. వాళ్ళా పెట్టను ఆమెకు ఇచ్చి వెళ్ళిపోయారు. కొద్ది సమయం తరువాత వారు నలుగురూ తిరిగి పూటకూళ్లమ్మ దగ్గరకు వచ్చారు. వాళ్ళలో వాళ్ళు కొంతసేపు పూటకూళ్లమ్మ బయట కూర్చుని చర్చించుకుని తమలో ఒక వ్యక్తిని పూటకూళ్లమ్మ దగ్గరకు వెళ్ళి 'డబ్బు పెట్టె తీసుకురమ్మని పంపారు. వాళ్ళు నలుగురూ దొంగలని వారు యిచ్చిన సంచి వారు దొంగిలించిన ధనమనీ గ్రహించింది ముసలమ్మ.

అతడు ముసలమ్మ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. ఆ మాటలకు ముసలమ్మ అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. "అందరు కలిసి వచ్చి తీసుకెళతామని చెప్పారు కదా! ఇప్పుడు నువ్వు ఒక్కడివే వచ్చి అడుగుతున్నావు. నేను ఇవ్వను. మీరు అందరూ కలసి వస్తేనే విసంచిని ఇస్తాను.” అని ముసలమ్మ చెప్పింది.

అందుకు అతడు “నా మిత్రులందరూ బయట వున్నారు. వాళ్ళే సంచి తీసుకురమ్మని నన్ను పంపారు. నా మాటలపైన నమ్మకం లేనట్లయితే నువ్వే బయటకు వచ్చి చూడు” అన్నాడు. ఆమె బయటకు వచ్చి మిగతా వ్యక్తులను చూసి 'ఆ సంచి ఇవ్వమంటారా' అని అడిగింది. అందుకు వాళ్ళందరూ తలలు వూపారు. దాంతో ఆమె లోపలికి వచ్చి ఆ వ్యక్తికి సంచి అందజేసింది. అయితే సంచి తీసుకున్న వ్యక్తి వెనుక తలుపుగుండా సంచితో సహా పారిపోయాడు. చాలా సేపు ఎదురుచూసి తమ మిత్రుడు ఎంతకీ రాకపోవటంతో వాళ్ళే పూటకూళ్లమ్మ లోపలికి వెళ్ళారు. అయితే అక్కడ తమ మిత్రుడు కనపడకపోవటంతో ముసలమ్మని తమ డబ్బు సంచి ఇమ్మని అడిగారు. ఆమె మీరు చెప్పినట్లుగా మీరు పంపిన వ్యక్తికి ఆసంచిని ఇచ్చానని చెప్పింది. ముసలమ్మ చెప్పిన సమాధానంతో వాళ్ళకు విపరీతమైన కోపం వచ్చింది. వాళ్ళు ఆమెను తిట్టటం మొదలుపెట్టారు. ముసలమ్మ మాత్రం మౌనంగా వుండిపోయింది. చివరికి వాళ్ళు, “నువ్వు చెప్పే మాటలన్నీ మాకనవసరం. మేం నీతో స్పష్టంగా చెప్పాం. మేం నలుగురం కలసి వచ్చినప్పుడు మాత్రమే మా సంచి తిరిగి ఇమ్మన్నాం. అలా కాకుండా మాలో ఒకరికి నువ్వు ఆ సంచి ఇచ్చావు. కాబట్టి తప్పు నీదే. ఆ సంచిలో చాల రూపాయలు వున్నాయి. మా డబ్బు మాకు నువ్వే ఇవ్వాలి. అలా కాకపోతే మేం అధికారులకు ఫిర్యాదు చేస్తాం” అని గద్దించారు.

అందుకు ఆ ముసలమ్మ “నాకేమీ తెలియదు. ఆ సంచి అతనికి ఇవ్వబోయే ముందే మీకు చెప్పాను. మీ అనుమతి తీసుకుని మాత్రమే మీలో ఒకడయిన ఆవ్యక్తికి నేను సంచి ఇవ్వటం జరిగింది. నేనసలే పేదదాన్ని. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండని” అర్థించింది వారు ఆమె మాటలు పట్టించుకోలేదు. తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వమని వొత్తిడి చేయటం మొదలు పెట్టారు.

ఆమెను రెక్క పట్టుకుని బలవంతంగా వీధిలోకి లాగి న్యాయస్థానానికి రమ్మని బలవంతం చేశారు. ఆమెను న్యాయమూర్తి ముందుకు తీసుకువెళ్ళారు. న్యాయమూర్తి ఇరువర్గాలు చెప్పిన విషయాలు విని తీర్పు చెప్పాడు. “ఈ ముసలామె రెండు వేల రూపాయలూ, సంచీ తన దగ్గర దాచుకున్న వ్యక్తులకు చెల్లించాలి” అని ఆదేశించాడు. తన తప్పేమీ లేకపోయినా రెండు వేల రూపాయలు చెల్లించమని ఆదేశించిన న్యాయమూర్తి మీద ముసలమ్మకు విపరీతమయిన కోపమొచ్చింది. తను ఎక్కడ నుంచి తెచ్చి అంత డబ్బు కట్టగలదు ? "తప్పుడు తీర్పు చెప్పిన ఈ న్యాయమూర్తి నాశనమయిపోతాడు" అని తిట్టింది ముసలమ్మ. ఆ సందర్భంలో ఇదంతా గమనిస్తూ వున్న రామన్న ఆమె దగ్గరకు చేరి యిలా అన్నాడు. “ఈ రాజు త్వరలో తన అధికారాన్ని కోల్పోబోతున్నాడు. ఇతనికి ప్రజల సమస్యలు ఏమాత్రం అవగతం కావటం లేదు. వొట్టి మూర్ఖుడులాగా వున్నాడు. ప్రజలందరికీ న్యాయం అందుబాటులో వుండేటట్టు చూడటంలో ఈ రాజు పూర్తిగా విఫలమయ్యాడు”.

రామన్న అలా రాజుని నిందిస్తూ వుండటం ఆ మార్గంలో వెళుతున్న రాజుగారి సైనికులు విన్నారు. రామన్నను పట్టుకొని రాజుగారి దగ్గరకు తీసుకెళ్ళారు. “మహారాజా ! ఈ వ్యక్తి మిమ్ములను దూషిస్తూ వుండగా విని తీసుకొచ్చాం” అని రాజుగారితో చెప్పారు. "సరే ! అతన్ని ఇక్కడ వదిలి వెళ్ళండి. నేను తెలుసుకుంటాను” అన్నాడు రాజు. ఆ తరువాత రాజు కొంతసేపు రామన్నను తీక్షణంగా పరిశీలించి చూసి, “నువ్వెవరు ? ఏ ప్రాంతం నుంచి వచ్చావు ?" అని అడిగాడు. "మహారాజా ! నేను ఇక్కడకు కేవలం అయిదు మైళ్ళ దూరంలో వున్న ఒక చిన్న పల్లెటూరిలో వుంటాను. నా పేరు రామన్న. అందరూ నన్ను 'మర్యాద రామన్న' అంటారు”.

“మర్యాద రామన్న అంటే నువ్వేనా ? ఇంతకీ నేను చేసిన తప్పేమిటి ? నువ్వు నన్ను నిందించావట. కారణమేమిటి ?" అని అడిగాడు రాజు. "మహారాజా ! ఒక న్యాయమూర్తి తప్పు చేస్తే ఆ తప్పు పరిపాలించే రాజుకే చెందుతుంది. అలాగే ప్రజలు చేసే తప్పులకు కూడా రాజే బాధ్యులు", అన్నాడు రామన్న. రాజు నవ్వి “నువ్వు సరిగానే చెప్పావు. మా న్యాయమూర్తి చేసిన తప్పేమిటో చెప్పు, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాను" అని అన్నాడు రాజు చిరునవ్వుతో. “మహారాజా ! దయచేసి జరిగిన సంఘటనకు సంబంధించి మరోసారి విచారణ జరిపించండి. మీ న్యాయమూర్తి ఆ ముసలమ్మకు అన్యాయం చేశాడు. పది మంది నేరస్తులు తప్పించుకు పోయినా పరవాలేదు. ఒక అమాయకుడికి కూడా శిక్షపడకూడదని కదా ! పెద్దలంటారు”. రామన్న మాటలకు రాజు ఆనందించాడు. రామన్న తెలివయినవాడని నిర్ధారించుకోవటంతో పాటు అతని ధైర్యం చూసి రాజు ముగ్ధుడయ్యాడు.

"రామన్నా! నేను ఇంతకు ముందే నీ గురించి విని వున్నాను. ఈ తగాదాకు సంబంధించి నువ్వయితే ఎలాంటి తీర్పు ఇస్తావో చూడాలనుకుంటున్నాను ?” అని రామన్నను అడిగాడు. “మీరు అనుమతిస్తే తప్పకుండా చెపుతాను మహారాజా !" అని అన్నాడు రామన్న. రాజు తన ప్రక్క ఆసనాన్ని చూపించి రామన్నను దానిపై కూర్చోమని చెప్పాడు. రామన్న ముసలమ్మతో పాటు, ఆ ముగ్గురు దొంగల్ని కూడా పిలిపించాడు. రామన్న తీర్పు వినాలని అనేక మంది జనం కూడా అక్కడకు చేరుకున్నారు. రామన్న ఇరువర్గాల వాదనలు సావధానంగా విన్నాడు. ఆ తరువాత కొంతసేపు దీర్ఘంగా ఆలోచించాడు. ప్రజలందరు రామన్న తీర్పు కోసం వుత్కంఠభరితంగా ఎదురు చూస్తూ వున్నారు. అప్పుడు రామన్న దొంగల వైపు తిరిగి, “మీరు చెప్పినట్టుగా ముసలమ్మ దగ్గర మీరు డబ్బుదాచిన మాట నిజం. ఆ విషయం ముసలమ్మ కూడా అంగీకరిస్తోంది. ఆ విషయంలో ఎటువంటి గందరగోళమూ లేదు. ఇక రెండవ విషయానికి వద్దాం. మీరు పెట్టిన షరతుల ప్రకారం మీరు నలుగురూ తిరిగివచ్చి అడిగినపుడు మాత్రమే మీకు ముసలమ్మ ఆ సంచిని ఇవ్వాలి. మరి ఇప్పుడు మీరు ముగ్గురు మాత్రమే వున్నారు. అందువల్ల మీరు ఆ డబ్బు సంచిని అడగటం సరి కాదు. మీరు నలుగురూ కలిసి వచ్చినప్పుడు మాత్రమే ఆ సంచిని ఇవ్వటం జరుగుతుంది.

అందువల్ల వెళ్ళి వెంటనే మీ మిత్రుడ్ని తీసుకువచ్చి డబ్బు సంచి తీసుకువెళ్ళండి" అని అన్నాడు రామన్న. రామన్న మాటలు విన్న ప్రజలు అతని తెలివికి ముగ్ధులయి చప్పట్లు కొట్టారు. రామన్న ఇచ్చిన తీర్పు రాజును ఆశ్చర్యపర్చింది. రాజు సంతోషించి, “ఇందుకే ప్రజలు నిన్ను 'మర్యాద రామన్న' అంటున్నది" అని అన్నాడు. రాజు రామన్నను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ముసలమ్మ ఆనందంతో రామన్నను దీవించింది. ఆ తర్వాత రాజు రామన్ననుద్దేశించి యిలా అన్నాడు. “రామన్నా, నీ తీర్పు అద్భుతం. నాకెంతగానో నచ్చింది. నిజంగా నువ్వు గొప్ప మేధావివి. నీ తీర్పులు కేవలం ఒక్క గ్రామానికే పరిమితం కాకూడదు. నువ్వు మా ఆస్థానంలో న్యాయాధిపతిగా వుండాలి. ఆస్థానానికి వచ్చే సమస్యలు, తగాదాలు అన్నీ నువ్వే పరిష్కరించాలి. నీ విలువయిన తీర్పులు మాకు కావాలి! నువ్వు మా అభ్యర్థనను అంగీకరించాలి”.

రామన్న రాజుగారి అభ్యర్థనను కాదనలేకపోయాడు. ఆ తరువాత రామన్న కుటుంబం అంతఃపురానికి మారింది. రాజు రామన్నకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు.