పోయిన వస్తువు



ఒక గ్రామంలో శేషయ్య అనే రైతు వున్నాడు. అతనికి రెండు ఎకరాల భూమి, ఒక ఇల్లు వున్నాయి. అతనికి పిల్లలు లేరు. అతని భార్య పిల్లల కోసం అనేక ప్రార్థనలు చేసింది. అనేక దేవాలయాలు సందర్శించింది. పవిత్ర నదులలో స్నానాలు చేసింది. శ్రీ వెంకటేశ్వరుణ్ని అనేక రకాలుగా పూజించింది. ఆవిడ చేసిన పూజలు ఫలించాయి. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. శేషయ్య తన కొడుక్కి వెంకయ్య అని పేరు పెట్టాడు. వెంకయ్య పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్తవయస్సు వచ్చింది. వెంకయ్యకు పెళ్ళి చేసే వుద్దేశ్యంతో శేషయ్య ఆడపిల్లల్ని వెదకటం ప్రారంభించాడు. చివరికి బంధువులలోనే సంబంధం ఖాయమయింది.

పెళ్ళి నిశ్చయించారు. పెళ్ళి రోజున తన కొడుకును, కోడల్నీ గుర్రంపై వూరేగించాలని శేషయ్య భావించాడు. అందుకోసం ఆ వూళ్ళో వున్న ఇబ్రహీంఖాన్ అనే వ్యక్తి దగ్గర గుర్రం వుందని తెలుసుకుని అతన్ని కలిశాడు. ఇబ్రహీంఖాన్ వంద రూపాయలు అద్దె అడిగాడు. అందుకు అంగీకరించి అద్దె చెల్లించి గుర్రాన్ని తీసుకువచ్చాడు శేషయ్య. ఆ గుర్రాన్ని అందంగా అలంకరించి పెళ్ళి కుమారుడు, పెళ్ళి కుమార్తెను గుర్రం మీద వూరేగించారు. వీధుల్లో ప్రజలందరూ యువజంటను ఆశీర్వదించారు. యువజంట ఇంటికి తిరిగి వస్తూ వుండగా, గుర్రం హఠాత్తుగా క్రిందపడి చచ్చిపోయింది. గుర్రం చచ్చిపోవటానికి కారణం ఎవ్వరికీ తెలియడం లేదు.

గ్రామస్థులందరూ నివ్వెరపోయారు. శేషయ్య ఆందోళనకు గురయ్యాడు. ఏమి చేయాలో అతనికి పాలుపోలేదు. చివరికి ఇబ్రహీంఖాన్ దగ్గరకు వెళ్ళి జరిగిన సంఘటన వివరించాడు. “ఖాన్ ! ఈ పరిణామం నేను వూహించలేదు. నేనెవ్వరినీ తప్పు పట్టలేను. నీ గుర్రం విలువ ఎంతో చెప్పు. ఆ డబ్బు నేను చెల్లిస్తాను” అని అన్నాడు శేషయ్య. గుర్రం చచ్చిపోయిందనే విషయం అప్పటికే తెలుసుకున్న ఖాన్ శేషయ్య మాటలకు కోపోద్రిక్తుడయ్యాడు. "నీడబ్బు నాకెంత మాత్రమూ వద్దు. అసలు నా గుర్రానికి వెల కట్టటం ఎవ్వరివల్లా కాదు. అటువంటి గుర్రం ఎక్కడా దొరకదు. నా గుర్రం నాకు కావాలి,” అని కేకలేశాడు. అందుకు శేషయ్య “ఖాన్ ! నిజమే, నీ గుర్రం గొప్పదే కావచ్చు. అయితే ఇప్పుడది చచ్చిపోయింది. నువ్వు కొంచెం ఆలోచించు, చచ్చిపోయిన గుర్రాన్ని ఎలా తీసుకురాగలను" అన్నాడు.

“నువ్వు చెప్పేదేవి నేను వినను. నా గుర్రం నాకు కావాలంతే" అన్నాడు ఖాన్ ఆవేశంగా. అప్పటికే అక్కడకు చేరిన గ్రామస్థులు ఖాన్ను శాంతపర్చే ప్రయత్నం చేశారు. అయితే ఖాన్ మాత్రం వాళ్ళ మాటలు ఖాతరు చేయకుండా తన గుర్రం తనకు కావాలని పట్టుబట్టాడు. చేసేది లేక శేషయ్య తన పరిస్థితిని మర్యాదరామన్నకు వివరించాడు. కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించిన తరువాత, “శేషయ్యా, ఈ విషయం నేను రేపు పరిష్కరిస్తాను. రేపు నేను ఖాన్ కోసం సైనికుడ్ని పంపుతాను. నిన్ను తీసుకుని ఆస్థానానికి రమ్మని సైనికుడు ఖాన్తో చెపుతాడు. అప్పుడు ఖాన్ నీ ఇంటికి వస్తాడు. ఖాన్ వచ్చే సమయానికి నువ్వొక పనిచెయ్యాలి. నీ ఇంటి ప్రధాన ద్వారం మూసి వుంచు. లోపల గొళ్ళెం మాత్రం వేయవద్దు. ఇరవై, ముప్పై మట్టి కుండలు ఆ తలుపుకి ఆనించి వుంచు. ఈ పనిని నువ్వు జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా చెయ్యాలి. అంతే, మిగతా విషయం నేను చూసుకుంటాను.

ఈ పనిని నువ్వు తెలివిగా నిర్వహించాలి మరచిపోవద్దు. అన్ని పనులూ ఉదయం ఎనిమిది గంటలకల్లా జరిగి పోవాలి" అని అన్నాడు మర్యాదరామన్న. శేషయ్య ఇంటికి తిరిగివచ్చి రామన్న చెప్పినట్లుగానే అన్ని పనులూ పూర్తి చేశాడు. తలుపులు దగ్గరగా వేసి, వాటిని ఆనించి ముప్పై మట్టికుండలు పెట్టాడు. అనుకున్నట్టుగానే సైనికుడు ఖాన్ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. ఖాన్ శేషయ్యని తీసుకుపోయేందుకు అతని ఇంటికి వచ్చాడు. ఇంటి బయటనుంచి శేషయ్యను పిలిచాడు. ఎవరూ తలుపు తీయలేదు తలుపు నెట్టాడు. దాంతో తలుపుకు ఆనుకుని వున్న కుండలన్నీ ముక్కలు ముక్కలయ్యాయి. శేషయ్య బయటకు వచ్చి “కుండలు పగలగొట్టావు ! ఇవి నా బంగారు కుండలు. వీటిని నేను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాను”. అని తీవ్ర స్వరంతో అరిచాడు. ఖాన్ బిత్తరపోయి, “ప్రధాన ద్వారం వెనుక కుండలుంటాయని వూహించలేదు ! నేను మామూలుగా నిన్ను పిలవటం కోసం తలుపు నెట్టాను” అని అన్నాడు. అందుకు శేషయ్య “ఉదయాన్నే నువ్వు నా మట్టి కుండలు పగులగొట్టావు. ఈ రోజు ఇదొక అపశకునం. ఇప్పుడేం చేయాలి !" అని శేషయ్య తనని తాను తిట్టుకోవటం మొదలు పెట్టాడు. ఆ మాటలు విన్న ఖాన్, "నేను నీకు కొత్త కుండలు కొని ఇస్తాను. విచారించమాకు”, అని అన్నాడు. శేషయ్యకు అప్పుడు మర్యాదరామన్న తలుపు వెనుక కుండలు ఎందుకు వుంచమన్నాడో అర్థమయింది. “నాకు కొత్త కుండలు వద్దు. ఈ కుండల్ని మా ఇంట్లో అనేక తరాలుగా ఉపయోగిస్తున్నాము. అవి చాలా పవిత్రమయినవి. ఆ కుండలకు మా అదృష్టానికి సంబంధం వుంది. నాకు ఆ కుండలే కావాలి”. అని వాదించాడు శేషయ్య.

“సరే ! ఆ విషయం తరువాత చూద్దాం. ముందు మనం రాజు గారి ఆస్థానానికి వెళ్ళాలి. పద, ఇప్పటికే ఆలస్యమయింది” అన్నాడు ఖాన్. ఆ తరువాత ఇద్దరూ కలిసి రాజు గారి ఆస్థానానికి వెళ్ళారు. ఆస్థానంలో ఖాన్, శేషయ్య ఇద్దరూ వారి, వారి వాదనల్ని వినిపించారు. "అయ్యా ! మా సమస్యని విచారించబోయే ముందు, మీకు ఈరోజు ఉదయం జరిగిన సంఘటనొకటి చెప్పాలి", అన్నాడు శేషయ్య రామన్నతో. “ఏమిటో చెప్పు" అన్నాడు మర్యాదరామన్న. “ఈరోజు ఖాన్ నా ఇంట్లోని మట్టికుండలు పగలగొట్టాడు. అవి మాకు కలసి వచ్చిన కుండలు. ఇప్పటి వరకు వాటివల్ల మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. ఫలితంగా నాకే అపాయం జరుగుతుందోనని భయంగా వుంది. దయచేసి ఈ విషయం పరిశీలించి మీరు నాకు న్యాయం చేయండి”. అని వివరించాడు శేషయ్య.

ఇది విన్న ఇబ్రహీంఖాన్, "అయ్యా ! శేషయ్య పగులగొట్టిన కుండల్ని తిరిగి తెమ్మంటున్నాడు నేను పాతవాటికి బదులుగా కొత్తకుండలు ఇస్తానని చెపుతున్నా వినిపించుకోవటం లేదు. అవే కావాలంటున్నాడు. పగిలిన కుండల్ని యధాతధంగా నేనెలా ఇవ్వగలను. దయచేసి ఈ సమస్యను మీరే పరిష్కరించాలి” అని విన్నవించుకున్నాడు.

“సరే ! నువ్వు చెప్పింది బాగానే వుంది ఖాన్. నువ్వు చేసిందీ అదేగదా. చచ్చిన గుర్రాన్ని తిరిగి తెచ్చివ్వమని శేషయ్యను వేధించలేదా ! తను మాత్రం చచ్చిన గుర్రాన్ని ఎక్కడ నుంచి తేగలడు. నీకు నీ గుర్రం ఎంత విలువయిందో, అతనికి ఆ కుండలూ అంతే విలువయినవి. అయితే వాటిని తిరిగి తెమ్మనటం కూడ సరికాదు. ఈ విషయం గుర్తించి ఇద్దరు మంచిగా వుండండి. నువ్వు నీ గుర్రాన్ని, అతను తన కుండల్ని మర్చిపోయి, స్నేహంగా వుండండి. తప్పులు, పొరపాట్లు ఎవరయినా చేస్తారు, ఎవరి విషయంలోనయినా జరుగుతాయి”. అని మందలించాడు రామన్న. రామన్న తీర్పు విన్న ప్రజలందరూ నవ్వుకోకుండా వుండలేకపోయారు. ఖాన్ తన వాదనలోని తప్పేమిటో తెలుసుకున్నాడు. తన తప్పు గ్రహించి తల వంచుకున్నాడు. శేషయ్య రామన్నకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు.