13.గుర్రపుశాల యోగం లేని గుర్రం



ఆశ్రమంలోని శిష్యులంతా అడవికెళ్ళిన శిష్యుని రాకకోసం ఎదురు చూస్తున్నారు. అతడు కొమ్మలు తెస్తే, అవి రాటలుగా ఉపయోగించి గుర్రానికి సాల నిర్మించాలని వారి యోచన. శిష్యుడు వచ్చీరావడంతోనే, గురువుగారి పాదాలు పట్టుకొని "గురుదేవులు మన్నించాలి, ఈ రోజు చాలా దుర్దినం. నేను నిజానికి మరణించాల్సింది" అంటూ జరిగిన సంగతంతా చెప్పి, "ఆ ప్రకారం ఆ మహానుభావుడు గొప్ప జ్యోతిష్యుడని నా బుద్ధి కుశలత వల్ల తెల్సుకోబట్టి మీ గురించి కూడా ఆయన్ను అడిగాను. వారు ఇలా చెప్పారు" అంటూ "కాళ్ళూ చేతులూ చల్లబడిపోతే మీరు మాకు దక్కరు గురువుగారో” అంటూ శోకాలు తీయసాగాడు. ఆ మాటలు వింటూనే ఆయన స్పృహతప్పి పడిపోయారు. శిష్యులంతా గురువుగారి ముఖంమీద నీళ్ళుకొట్టి లేవదీశారు. కాస్త తెప్పరిల్లాక గురువుగారు “నాయనలారా! ఆ మహానుభావు డెవరో నిజమే చెప్పి ఉండొచ్చు! ఎంతటి వారికైనా మరణాన్ని తప్పించుకో శక్యమా? అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా! 'శిరః పాద శీతలం' అని ఆయన చెప్పినందు చేత ఈరోజు నుంచీ తలకు స్నానం మానేస్తాను. తలమీద ఎటూ వెంట్రుకలు లేవు. గోష్పాద మంత పిలకమీద ఇన్ని పసుపునీళ్ళు చిలకరించి శుద్ధి చేసుకోవచ్చు! అలాగే పాదాలకు తడి తగలనీయకుండా చూడండి" అన్నారు. గురువుగారి మాటని వేదవాక్యంలా పాటించే శిష్యుడొకడు "కాళ్ళు కడుక్కుంటే తడి అవుతుంది కనుక కాళ్ళకు పసుపునీళ్ళు జల్లుకోండి అన్నాడు.

"అదికాదురా అర్ధం! గురువుగారు కాళ్ళు కడుక్కోగానే తక్షణం ఏదైనా పొడి వస్త్రంతో ఆయన కాళ్ళు ఒత్తి తుడిచేయాలి" అని గురువమ్మగారు సెలవిచ్చారు. అనంతరం... అంతా కలసి గుర్రపుసాల ఏర్పాట్లలో మునిగారు. రాటలు పాతారు. పైకప్పుకి తాటాకులు ఎక్కడ నుంచి తేవాలి? ఊరి శివార్లలో తాటితోపు ఉంది. అక్కడికెళ్ళి అడిగితే, “చెట్టు ఎక్కగలిగే వారికి ఎన్ని తాటాకులైనా దొరక్కపోవడం అనేది ఉండదు" అని చెప్పారు పనిపాట్లు చేసుకొనే రైతు వర్గం వారు. ఇంతకు ముందు కొమ్మ మీదనుంచి పడి, చావు తప్పిన శిష్య పరమాణువుని చెట్టెక్కమన్నారు. "నాకు అడ్డమైన చెట్లూ ఎక్కడమైతే వచ్చు! తాడివలె నిట్టనిలువు చెట్లు కష్టపడి ఎక్కినా దిగడం రాదు" అన్నాడు. వాళ్ళ మాటలు విని అక్కడే వున్న ఓ శూద్ర యువకుడు జాలిపడి "సర్లెండి అయ్యవార్లూ! నాకేదో ఉల్లిపరక, ఊరగాయ బద్ద ఖర్చు ఇచ్చుకుంటే మీక్కావలసినన్ని తాటాకులు కోసిస్తా" అన్నాడు. "ఆ పని చెయ్యి బాబ్బాబు! నీకు పుణ్యం ఉంటుంది". అంటూ పరమానందయ్య శిష్యులు ఆ యువకునికి పాదాబి వందనం చెయ్య బోయారు. అతడు కాళ్ళు వెనక్కి లాగేసుకుంటూ "తప్పు అయ్యవార్లూ! కులానికి శూద్రుడినైనా, గుణానికి మాత్రం కాను. తమర్ని భూసురులంటారు. అంటే భూలోకాన దేవతల వంటివారు అన్నమాట! మీరు మాకు నమస్కరిస్తే, అది మాకు మన్నన కాదు. ఆయుక్షీణమని ధర్మశాస్త్రం. అంతేకాదు! మీబోటి వారిచేత పాద నమస్కారాలు చేయించుకుంటే స్త్రీ మూలకంగా ఆకస్మిక మరణం కూడా” అని సమాధానం చెప్పేసరికి "ఔరా! మనకే తెలీని విషయాలెన్ని తెలుసో ఈ కుర్రవాడికి. అందుకే జ్ఞానం ఒకరి సొత్తు కాదన్న నిజాన్ని బ్రాహ్మణులమైన మనం ఒప్పుకుని తీరాలి" అంటూ తీర్మానించుకున్నారు. "సరే అబ్బీ! నీకు గురువుగారితో చెప్పి, అంతో ఇంతో ఇప్పిస్తాం గానీ, తాటాకులు కొట్టిపెట్టు" అన్నారు. అన్నీ అనుకూలించి, అచిరకాలంలోనే పాక తయారైంది. కాని అందులోకి గుర్రాన్ని తోలగా, దాని దేహం అందులో ఇమిడింది కాదు! ఇరుగ్గా ఉండడంతో, వేసిన పాక వేసినట్టే కూలిపోయింది. దానికి సాలలో నివశించే యోగం లేదని సరిపుచ్చుకున్నారు గురుశిష్య సమూహం.