కానుక



ఒక ఊళ్ళో ఒక వేటగాడు ఉండేవాడు. అతను మామూలు వేటగాడు కాదు. అరణ్యంలో ఉండే క్రూరమృగాలను ప్రాణాలతో పట్టి, బోనులలో పెట్టి తెచ్చి, వాటిని కొనే రాజులకూ, మృగశాలలకూ అమ్మి చాలా డబ్బు సంపాదించేవాడు. ఒకనాడు ఆ వేటగాడి దగ్గరికి ఒక పదిహేనేళ్ళ కుర్రవాడు, వచ్చి, “ఈ ఊళ్ళో ఒకావిడ ఉన్నది. ప్రతి శుక్రవారమూ ఆవిడకు పూనకం వస్తుంది. అప్పుడావిడ మీదకు కాళీమాత వచ్చి పలుకుతుంది. ఆ రోజు ఆవిడ వద్దకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి, కానుకలు ఇచ్చుకుంటారు. ఇదంతా ఒక పెద్ద మోసం. దీన్ని బయట పెట్టడానికి నువు ఒక పనిచెయ్యాలి." అన్నాడు.

"ఏం చెయ్యమన్నావు?" అని వేటగాడు అడిగాడు. కుర్రవాడు తన ఆలోచన వేటగాడికి చెప్పాడు. మరుసటి శుక్రవారం వేటగాడు అలివేలు అనే ఆవిడ ఇంటికి వెళ్ళాడు. అలివేలు పూనకం మీద ఉన్నది. ఆమె చుట్టూ అనేకమంది భక్తులున్నారు. వాళ్లు తెచ్చిన కానుకలు కళ్ళు చెదిరేలా ఒక పక్క పెట్టి ఉన్నాయి. వేటగాడు అలివేలు కాళ్ళ మీద పడి “మన్నించు, తల్లీ, ఇంతకాలమూ నిను నమ్మకుండా ఎంతో పాపం చేసుకున్నాను. నిన్ను ప్రత్యక్షంగా చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి. వచ్చే శుక్రవారం నీకు తగిన గొప్పకానుక - ఏ భక్తుడూ ఇచ్చుకోలేనిది - తెచ్చి ఇస్తాను. స్వీకరించి నన్ను అనుగ్రహించాలి, మాతా!" అన్నాడు. కాళీమాత పూని ఉన్న అలివేలు ఆ కొత్త భక్తుణ్ణి ఆశీర్వదించింది. వేటగాడు వెళ్ళిపోయాక భక్తులలో కుతూహలం బయలుదేరింది. ఈ కొత్త భక్తుడు ఎవరు? ఎవరూ ఇయ్యని కానుక వాడు ఏమిటి ఇస్తాడు? కుతూహలం కొద్దీ మరుసటి శుక్రవారం నాటికి అలివేలు ఇంటికి భక్తులు మామూలు కన్న కూడా చాలా హెచ్చు సంఖ్యలో వచ్చారు.

కొత్త భక్తుడు ఎంతకీ రాలేదు. వేళ మించిపోతున్నది. భక్తులకు ప్రసాదం పెట్టి పంపించే సమయం దాటిపోయింది. అలివేలు మీద కాళీమాత మరింత బలంగా పూని, మోసం చేసిన ఆ భక్తుణ్ణి శాపనార్థాలు పెట్టసాగింది. అంతలో వేటగాడు వచ్చాడు. అతని చేతిలో కానుక ఏదీలేదు. "కానుక ఏదిరా, భక్తా? నా తోనే పరాచికాలాడతావురా, మూడుడా?" అని అలివేలు గర్జించింది. "కానుక బయట ఉన్నది. చూతువు రా, తల్లీ!" అన్నాడు వేటగాడు. అలివేలుతో బాటు భక్తులంతా బయటికి వచ్చారు. బయట ఒక బోనూ, అందులో అటూ, ఇటూ తిరుగుతూ ఒక పెద్దపులి కనిపించాయి. "తల్లీ, ఇదుగో నీ వాహనం! ఈ భక్తుడి ఈ చిన్నకానుక స్వీకరిచి, ఇక నువు నీ వాహనం మీద తిరుగు! " అంటూ వేటగాడు బోను తలుపు తీయబోయాడు. భక్తులు వణికిపోయారు. పులి గాండ్రుమన్నది. అలివేలు కెవ్వున అరిచి, "వద్దు, వద్దు! తలుపు తీయకు!" అంటూ కంపించిపోయింది.

"అలా బెదురుతావేం, మాతా? నీ వాహనాన్ని ఎక్కి మా భక్తుల కళ్ళు పావనం చెయ్యి," అంటూ వేటగాడు పులి బోను తలుపు మరొకసారి తెరవబోయాడు. అలివేలు లోపలికి పారిపోబోయింది. వేటగాడు ఆమె దారికి అడ్డం నిలబడి, “ఇంక ఈ నాటకం ఆపు. నువు కాళీ మాతవైతే పులి మీద ఎక్కు. కాకపోతే, ఇన్నాళ్ళూ ఇంతమందినీ మోసం చేశానని ఒప్పుకో. అప్పుడు నిన్ను పులి మింగినా పాపంలేదు," అన్నాడు. అలివేలు జవాబు చెప్పక, బెదురు కళ్ళతో దిక్కులు చూస్తుంటే భక్తులు నిజం తెలుసుకున్నారు. అలివేలు భర్త ఏదో సర్దిచెప్పబోతే వాళ్లు అతన్ని అవతలికి ఈడ్చేశారు. “నన్ను ఆ పులివాత వెయ్యకు! నేను లోకాన్ని ఇంతకాలమూ మోసగించినమాట నిజమే!" అంటూ అలివేలు ఏడ్చింది. భక్తులందరూ కసికొద్దీ అలివేలును నానా మాటలూ అన్నారు. ఆమె భర్త భక్తుల కానుకలు భక్తులకు తిరిగి ఇచ్చేశాడు. వేటగాడు పులిబోనును తోసుకుంటూ వెళ్ళిపోయాడు. అతను ఇంటికి చేరేసరికి ఆ పదిహేనేళ్ళ కుర్రవాడు అక్కడే ఉండి, ఏం జరిగిందని అడిగాడు. "నువు చెప్పినట్టే జరిగింది. ఆ మనిషి మోసం ఒప్పుకున్నది. కాని, లోకంలో ఎంతోమంది బతుకు తెరువు కోసం ఎన్నో మోసాలు చేస్తారు. నువు పనిపెట్టుకుని ఆ మనిషి నోటిముందు కూడు ఎందుకు చెడగొట్టావు? ఆమె మీద నీ కెందుకు పగ? అని వేటగాడు కుర్రాణ్ణి అడిగాడు.

"ఆమె మీద నాకు పగలేదు. ఆమె మా అమ్మ. ఆవిడను ఈ మోసంలోకి దింపినది మా నాన్న. ఆయన వట్టి సోమరి. చేస్తున్న ఉద్యోగం మానటానికి మా అమ్మను అడ్డం పెట్టుకున్నాడు. నాకు ప్రపంచజ్ఞానం తెలుస్తున్నది. మా అమ్మా, నాన్నా ఆడే నాటకం ఎప్పటికైనా బయట పడకపోదు. నేను ఎలా తల ఎత్తుకు తిరగాలి? నీ దయ వల్ల అది వెంటనే జరిగింది. నేను నా కాళ్ళ మీద నిలబడే నాటికి ఈ కథ ఎవరికీ గుర్తుండదు. నీ శ్రమకు ప్రతిఫలంగా ఈ డబ్బు పుచ్చుకో," అంటూ అలివేలు కొడుకు వేటగాడికి డబ్బు ఇయ్యబోయాడు. "మంచి పుణ్యకార్యం నా చేత చేయించావు. డబ్బు పుచ్చుకోకూడదు." అంటూ వేటగాడు ఆ కుర్రవాణ్ణి వీధి చివర దాకా సాగనంపాడు.