16.చిన్నదీ - చిరునవ్వు



పరమానందయ్యగారు శిష్యులతో మఠానికి చేరుకున్నారన్న మాటే గాని, ఆయనకు జ్యోతిష్యుడి "శిరః పాదశీతలం, ప్రాప్తి జీవనాశం" అనే రెండు ముక్కలూ బాగా గుర్తిండి పోయి, దిగులు ఆవహించసాగింది. అందుకు కారణం చెరువులో దిగినందువల్ల పాదాలు తడిసిపోవడమే గాదు! ఊబిలో దిగబడడంతో మొత్తం దేహామే చల్లబడి పోయింది. ఓరోజు శిష్యులందర్నీ కూర్చుండబెట్టి, తన దిగులును వారితో పంచుకొనే సరికి వారికీ భోరున ఏడుపు తన్నుకొచ్చింది. పరమానందయ్య వారినందర్నీ ఓదార్చి "నాయనలారా! విచారించకండి! ఈ భూప్రపంచం మీద ఎన్నిరోజులు బ్రహ్మదేవుడు రాసిపెట్టి ఉంటే, అన్ని రోజులూ జీవించాల్సిందే! దీనికి చింతించి ప్రయోజనం లేదు. కనుక అశాశ్వతమైన నా ప్రాణం గురించి మీరు విచారించవద్దు. మిగిలిపోయిన కొద్దో గొప్పో విద్యల్ని నేను పోయే లోపుగా మీకు బోధిస్తాను" అన్నారు.

పిడుగులాంటి గురువుగారి నీరసపు పలుకులు వినేసరికి శిష్యబృందానికీ నీరసంతో పాటు, జీవితమంటే విరక్తి కలిగిపోయింది. అందరూ కలసి ఓ చెట్టు క్రింద కూర్చున్నారు. గురువుగారి గుణగణాలు, వారి తెలివితేటలు గురించే మాట్లాడుకుంటూ, “మన దురదృష్టం కొద్దీ మన గురువుగారు ఏమన్నా అయిపోతే, మనకు ఇలాంటి గురువుగారు మరిక దొరకరు! మన అదృష్టం ఎలా రాసిపెట్టి ఉందో కదా!" అంటూ ఆవేదన చెందసాగారు. ఇంతలో ఓ అందమైన చిన్నది. ఆ చుట్టుప్రక్కల పూలుకోయాలని పూలసజ్జ చేబూని అటువైపు వచ్చింది. శిష్యులంతా ఆ అమ్మాయి వైపు చూసి, ఎవరికి తోచిన వికారపు చేష్టలు వారు చేయసాగారు.

పళ్ళు ఇకిలించే వాడొకడు, గుర్రంలా సకిలించే వాడొకడు, కళ్ళు చిట్లించే వాడొకడు. తల కాస్సేపు అడ్డంగా, అంతలోనే నిలువుగా ఊపే వాడొకడు..... ఇలా ఉన్న శిష్యుల అవస్థ చూసేసరికి, ఆ పిల్లకి ఫక్కున నవ్వొచ్చింది. గలగలా నవ్వేసి వెళ్ళిపోయిందా పిల్ల. అప్పుడు మొదలైంది శిష్యుల మధ్య గలాటా. ఆపిల్ల నన్నే చూసి నవ్విందంటే, నన్నే చూసి నవ్విందని ఎవరికివారే అనుకుంటే ఫర్వాలేదు గాని... అది తగాదాగా మారి సిగపట్లదాకా వెళ్ళింది. పరమానందయ్య గారికి విషయం బోధపడక, శిష్యులిలా ఒకరి పిలక పుచ్చుకొని ఒకరు ఎందుకు తన్నుకుంటున్నదీ అర్ధంకాక, ఆరాతీస్తే 'పిల్లనవ్వు' అని తేలింది. 'ఓహో! ఇదా సంగతి. ఇప్పుడే ఆ సంగతి తేల్చేస్తా' నంటూ, గురువుగారు ఆ పిల్ల దగ్గరికెళ్ళి "ఎవర్ని చూసి నవ్వేవు చిట్టితల్లీ? చెప్పమ్మా! వాళ్ళు తన్నుకు ఛస్తున్నారు" అంటూ అమాయకంగా అడిగే సరికి ఆ పిల్లకి ఇంకా నవ్వు వచ్చింది. "మీ శిష్యుల పేర్లు నాకు తెలీదు. అంతా కలిసి రకరకాల కోతి చేష్టలు చేస్తుంటే, అందులో ఒకాయన అచ్చం కోతిలాగానే తోచాడు నాకు. దాంతో నాకు నవ్వాగింది కాదు" అని జవాబు చెప్పి అక్కడ్నించి నవ్వుకుంటూ వెళ్ళింది.

ఆమాటనే గురువుగారు తన శిష్యులతో అనేసరికి, ఈసారి వాళ్ళమధ్య ఇంకో తగువు ప్రారంభమైంది. "నేనే కోతిని అంటే నేనే కోతిని" అంటూ వాళ్ళిలా కొత్త పల్లవి అందుకొని కొట్టుకునే సరికి “ఓరి వానరాధములారా! అంతా కోతులే! మీ అందర్నీ చూసి నవ్వింది. మీలో తక్కువ వాళ్ళెవరూ లేరూ" అని సర్ది చెప్పాక గాని, పరమానందయ్య శిష్యులు శాంతించలేదు.