కళాభిమానం



భూపతి, పెదరెడ్డి గారింటి పాలేరు. రెడ్డిగారి ఇంటి వెనక ఉన్న పాకలో ఉండేవాడు. వాడిది చక్కని కంఠం. పదాలు పాడుకుంటూ పనిచేసేవాడు. రెడ్డిగారి భార్య ఒకసారి వాడికి అన్నం పెట్టుతూ, "ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావురా? ఎక్కడన్నా మంచి పిల్లను చూసి పెళ్ళి చేసుకో,” అని సలహా ఇచ్చింది. భూపతికి చాలా కాలంగా పెళ్లి ఆలోచన ఉన్నది, కాని పెళ్ళి ప్రయత్నాలు చేసే తీరిక లేదు. అందుచేత వాడు ఆమెతో, "అయ్యగారితో చెప్పి, ఒకవారంపాటు సెలవు ఇప్పించండి. రెడ్డిగారు వాడికి సెలవు ఇచ్చాడు. భూపతి నాలుగు గ్రామాలు తిరిగి, చక్కని పిల్లను చూసి పెళ్ళాడి, తనవెంట తెచ్చాడు. ఆ పిల్ల పేరు చంద్రకళ. అంతా ఆమెను కళ అని పిలిచేవాళ్ళు. కళకు పెద్ద పాండిత్యం లేకపోయినా, జానపద ధోరణిలో గేయాలు రాసే నేర్పు పుట్టుకతోనే వచ్చింది. ఎండలు కాసినా, వానలు కురిసినా, మేఘాలు ఉరిమినా, మెరిసినా, పెళ్ళిళ్ళు అయినా, పండగలు వచ్చినా కళ పాటలు రాసేది. ఆ పాటలు వినసొంపుగానూ, సున్నితమైన భావాలు కలిగి ఉండేవి.

రెడ్డిగారి భార్యకు కళ అంటే చాలా అభిమానం. పై పెచ్చు కళ రాసే పాటలు వినటం ఆమెకు గొప్ప సరదా. కళ కూడా తాను ఏ పాట రాసినా ముందు రెడ్డిగారి భార్యకు వినిపించేది. కళ చాలా చక్కగా పాటలు రాస్తుందని ఆవిడే ప్రచారం చేసింది. కళకు అభిమానులు చుట్టుపక్కల చాలామంది ఏర్పడ్డారు. ఇది చూసి భూపతి స్నేహితుడొకడు అసూయతో కుమిలిపోయాడు. వాడి భార్యను గురించి చెప్పుకునేవాళ్ళు ఒక్కళ్ళయినా లేరు. అది ఒక అడవి జంతువు లాంటిది. వాడు ఒకరోజు భూపతితో, "నీ పెళ్ళాం పాటలూ, పద్యాలూ రాస్తుందటగా? నువు డొక్క పొడిస్తే అక్షరం ముక్క లేని వాడివి కదా, నీ పెళ్ళాన్ని అలా గాలికి వదిలేస్తే నిన్ను మనిషి కింద చూస్తుందా? పాచిపని చేసుకుని బతకవలసిన మనిషి పాటలు వ్రాయటమూ, పదిమందికీ వినిపించటమూ - ఇదంతా పరువుమాలిన పని కాదుట్రా? కాస్త అదుపులో ఉంచి, పాటలూ పాడూ తగ్గించక పోయావో, త్వరలోనే నీ పెళ్ళాం నీ నెత్తికెక్కి కూర్చుంటుంది. తరవాత నీ ఇష్టం!" అని హెచ్చరించాడు. తన స్నేహితుడు తన మంచి కోరే ఆ మాట చెప్పాడనీ, అందులో చాలా నిజం ఉన్నదని భూపతికి తోచింది. వాడు ఇంటికి చేరేసరికి, కాకతాళీయంగా కళ ఏదో పాట రాస్తున్నది.

"ఎప్పుడూ ఆ పనికిమాలిన పిచ్చి రాతలు రాయకపోతే, నేను బయటిపని చూసి వచ్చేలోగా రెడ్డిగారి గేదెల పాలు పితకరాదా? పిడకలు చెయ్యరాదా? మనమేమన్నా పనీ పాటా లేకుండా కుడిచి కూర్చునేవాళ్ళమా? రెక్కాడితే గాని డొక్కాడదు మనకు!" అన్నాడు భూపతి, తన భార్యతో. కళ వెంటనే లేచి వెళ్ళి, పాలు పితికి రెడ్డిగారి భార్య కిచ్చి, మర్నాడు పిడకలు కూడా తానే చేసింది. అది మొదలు కళ పాటలు రాయటం మాని, రోజల్లా ఏదో పనిచేస్తూ గడపసాగింది. ఇలా చాలారోజులు గడిచింది. తన జీవితంలో పాటలు రాసుకునే అవకాశం పోయినందుకు ఆమె లోలోపల చాలా బాధపడింది, కాని ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేదు. ఒకరోజు భూపతి, రెడ్డిగారి తోటలో నీటిని మొక్కలకు మళ్ళిస్తూ గట్టిగా పాడుకుంటున్నాడు. సమీపంలోనే ఇద్దరు మనుషుల చేత కొబ్బరికాయలు దింపిస్తున్న రెడ్డిగారు భూపతితో, “నీ నోరు క్షణం ఊరుకోదుట్రా? ఎందుకు అస్తమానమూ పిచ్చిపాటలు అంత గట్టిగా పాడతావు? నోరు మూసుకుని పని చేసుకోరాదు?" అని విసుక్కున్నాడు. భూపతి మనస్సు చివుక్కుమన్నది. ఇంతవరకూ వాడి పాటను మెచ్చుకున్నవాళ్ళే గాని, దానికి వంక పెట్టినవాళ్ళు లేరు. వాడు నోరు మూసుకుని పని కొనసాగించాడు. కాని అంత దాకా ఉల్లాసంగా సాగిన పని ఇప్పుడు చాలా కష్టమనిపించసాగింది.

తరవాత రెండు మూడుసార్లు భూపతి పనిచేస్తూ తనకే తెలియకుండా పాడటమూ, రెడ్డిగారి చేత తిట్లు తినటమూ జరిగింది. వాడు పాడటమైతే మానాడు గాని, పనిచేసే శక్తి బాగా తగ్గిపోయింది. రెడ్డిగారు వాడితో ఒకనాడు, “ఏం నువు వెనకటిలాగా పని చెయ్యటం లేదు, ఉద్యోగం మానుకుంటావా ఏం?" అని అడిగాడు. "నన్ను పాడుకోవద్దంటిరిగా? పాడకుండా నాకు పని సాగదు. నన్ను పంపెయ్యండి. పాడుకుంటూ పని చేసేచోట కుదురుకుంటాను," అన్నాడు భూపతి. రెడ్డిగారు నవ్వి, “మరి నీ పెళ్ళాం నీలాంటి మనిషి కాదుట్రా? అది పని చెయ్యనన్నదా? దానిచేత పాటలు రాయటం ఎందుకు మాన్పించావు? కళాభిమానాన్ని అలా అణచి పెట్టితే నీలాగా బాధపడదూ? దాని బాధ నా భార్య గ్రహించి, నీకు కాస్త బుద్ధి చెప్పమన్నది అంతకన్న ఏమీలేదు. సంగతేమిటో అర్థమయ్యింది కదా? ఇక వెళ్ళి పనిచూసుకో, పాడుకో. నీ భార్యను పనిచేసుకోవటంతో బాటు పాటలు కూడా రాసుకోనీ అన్నాడు.