ఇద్దరు మిత్రులు



ఒక ఊళ్ళో రత్తయ్యా, రమణయ్యా అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు, ఇద్దరికీ నా అనే వాళ్ళు ఎవరూ లేరు. ఇద్దరూ చిన్నతనం నుంచీ కలిసి కట్టుగా ఒకే కొండలో ఉండేవారు. వాళ్ళకు ఒక పని అంటూ లేదు. బుద్ధి పుట్టినప్పుడు అడవికి వెళ్ళి, కట్టెలు కొట్టితెచ్చి అమ్మి, దానితో కాలక్షేపం చేసేవారు. బద్ధకం పుట్టినప్పుడు ఎవరి దొడ్డి నుంచి అయినా, ఏ అరటి గెలో దొంగిలించుకుపోయి అమ్ముకునేవాళ్ళు. రత్తయ్య అనే వాడి దగ్గర వాడి తాతలనాటి సొట్టలుపడిన వెండి కంచం ఒకటి ఉన్నది. రమణయ్య దగ్గర ఒక పాతకాలపు నులకమంచం ఉన్నది. ఇద్దరూ ఆ వెండి కంచంలో తిని, ఆ నులక మంచం మీద పడుకునేవాళ్ళు. ఒక వానాకాలం రాత్రి జోరున వర్షం కురుస్తుండగా మిత్రులిద్దరూ వెండి కంచంలో భోజనం చేసి, మంచం మీద కూర్చున్నారు. రత్తయ్య వాటాలో కొంత అన్నం మిగిలిపోయింది. రమణయ్య వాటాలో కొద్దిగా కూర మిగిలింది. రేపు పొద్దున తినవచ్చునని దానిమీద ఆకు కప్పారు.

రత్తయ్య తమ దుస్థితికి చింతిస్తూ, "ఎంతకాలం మనం ఇలా జీవితం గడుపుతాం? రేపు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళాలను ఎలా పోషిస్తాం?" అన్నాడు. దానికి రమణయ్య “ఇలాంటి వర్షపు రాత్రి ఏ మహానుభావుడో తలుపు తట్టి, రాత్రికి తలదాచుకుని, ఆశ్రయం ఇచ్చిన వారికి ఎంతో మేలుచేసి పోయినట్టుగా ఎన్నో కథలు విన్నాం. కాని ఏ కారణం వల్లనో తెలియదు. మన దరిద్రకొంపకు మాత్రం ఏ మహానుభావుడూ రాడు,” అన్నాడు విచారంగా. “విచారించి ఏం లాభం? అర్ధరాత్రి కావస్తున్నది. పడుకుందాం,” అన్నాడు రత్తయ్య. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. రత్తయ్య లేచి వెళ్ళి తలుపు తీశాడు. బయట కాషాయవస్త్రాలు ధరించిన ఒక ముసలివాడు చలికి వణుకుతూ అతడికి కనిపించాడు. రత్తయ్య వాడితో కోపంగా, “ఎవడి వయ్యా నువూ? ఇంత రాత్రివేళ మీ తాత కట్టించిన ఇల్లు అన్నట్టు తలుపు బాదావు!" అన్నాడు. "ముసలి సాధవును! ఆకలి దహించుకు పోతున్నది. ఈ పూట ఇక్కడ ఉండనియ్యండి," అన్నాడు సాధువు దీనంగా.

ఈ మాట వింటూనే రమణయ్య లేచి వచ్చి, "రండి, స్వామీ, మీ రాకతో మా ఇల్లు పావనమయింది. కాని ఈ పూట అన్నంలోకి కూర మాత్రమే ఉన్నది," అంటూ ముసలివాణ్ణి లోనికి ఆహ్వానించాడు. సాధువు వాత్సల్యపూర్వకంగా నవ్వి, “కాలే కడుపుకు మండే బూడిద చాలు, బిడ్డా! నీ మనసు దొడ్డది," అంటూ లోపలికి వచ్చి, రమణయ్య పెట్టిన అన్నమూ, కూరా తృప్తిగా తిన్నాడు. తరవాత సాధువు రమణయ్యతో, "నా ప్రాణం నిలబెట్టావు, బిడ్డా, నీ వస్తువు ఏదైనా చూపించు, దానికి అద్భుతమైన శక్తిని ఇచ్చి నాదారిన నేను పోతాను,” అన్నాడు. "ఈ నులకమంచం నాదే, స్వామీ,” అన్నాడు రమణయ్య, సాధువు తన చేతుల తడి మంచం మీద విదిలించి, "ఫో, బిడ్డా! ఇక నీకు బెంగలేదు. నువు ఈనులక మంచం మీద పడుకుని, కాస్సేపు గట్టిగా కళ్ళు మూసుకున్నావంటే, ఎక్కడెక్కడి నిధి నిక్షేపాలు నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. సుఖపడు!" అన్నాడు రమణయ్యతో. ఈ మాటలు వినగానే రత్తయ్యకు రమణయ్య మీద ఎక్కడలేని అసూయా పుట్టుకువచ్చింది.

వెంటనే వాడు "అన్యాయం, స్వామీ! మీరు తిన్నది నేను మిగిల్చిన అన్నం. వాడిది కూర మాత్రమే. అందుచేత మీరు అనుగ్రహించిన దాంట్లో మూడువంతులు నాకే రావాలి. అదీగాక, నులక మంచం నాది. వీడు దురాశతో అది తనది అంటున్నాడు,” అని అబద్ధమాడాడు. ఈ మాటకు రమణయ్యకు మండిపోయింది. ఇద్దరూ ఆ మంచం తనదంటే తనదని రెట్టించుకుని, చివరకు కలియబడ్డారు. సాధువు వాళ్ళిద్దరినీ విడదీసి, “మీరు ఇలా పోట్లాడుకోవడం బాగులేదు, బిడ్డలారా! ఆ మంచం మీద ఇద్దరూ పడుకుని చూడండి. ఎవరి కళ్ళకు నే చెప్పిన నిధి నిక్షేపాలు కనిపిస్తే వారిదే ఆ మంచం," అన్నాడు. మిత్రులిద్దరూ మంచం మీద పడుకుని, కళ్లు గట్టిగా మూసుకున్నారు. ఎంత సేపటికి వాళ్ళకు ఏ నిధి నిక్షేపమూ కనబడలేదు. చివరికి ప్రాణం విసిగి వాళ్ళు, కూడబలుక్కున్నట్టుగా ఒకేసారి కళ్ళు తెరిచి చూసేసరికి సాధువు లేడు, వెండి కంచం కూడా లేదు!