స్నేహధర్మం



భూపతికి బోలెడంత పొలమూ, పెద్ద ఇల్లూ ఉన్నాయి. అతని ఏక పుత్రుడు. గజపతి, ఒకసారి తండ్రి కొడుకు ఇద్దరూ రాజధానిలో జరిగే ఉత్సవాలు చూడడానికి వెళ్ళారు. రెండు రోజులపాటు నగర వైభవాన్ని, ఉత్సవాల సంరంభాన్ని చూసి, మూడోరోజు ఒక పెద్ద భవంతి ముందుకు వచ్చి, నగరంలో అలాంటి భవంతి మరొకటి లేదనుకున్నారు. అది ఎవరిదని దారినపోయేవాణ్ణి అడిగితే, మాణిక్యవర్మ అనే ధనవంతుడిదని తెలిసింది. నాతో బంగారం పంచుకున్న మాణిక్యవర్మ కాడుగద! అని భూపతి గొణిగాడు. గజపతికి ఆ మాట వినపడనే వినపడింది. "ఎవరు నీతో బంగారం పంచుకున్న మాణిక్యవర్మ?" అని అతను తండ్రిని అడిగాడు. భూపతి ఇలా చెప్పాడు. చిన్నతనంలో భూపతి బొత్తిగా దిక్కులేనివాడు. ఎవరికి పడితే వారికి చిల్లరపనులు చేసి పెట్టి, వాళ్ళిచ్చే డబ్బులతో పొట్టపోసుకునేవాడు. మాణిక్యవర్మ భూపతికి మంచి స్నేహితుడు. ఊరి చివర పాడుపడిన భవనం ఒకటి ఉండేది. అది ఒక జమీందారుది. పిడుగుపడి కూలిపోయింది. జమీందారు కుటుంబం అందరూ చచ్చిపోయారు. ఒక్క జమీందారు తండ్రి మాత్రం బతికాడు. అతను ఆ సమయానికి ఊళ్ళో లేడు. తిరిగివచ్చి జరిగినది చూడగానే అతనికి మతిపోయింది.

ఆ వృద్ధుడు తరవాత కొంతకాలం బతికాడు. ఎప్పుడైనా ఊళ్ళోకి వచ్చి, కుర్రవాళ్ళతో, "మీకు బంగారం కావాలిరా?" అని గట్టిగా కేకలు పెట్టేవాడు. అతన్ని చూసి కుర్రవాళ్ళు భయపడేవాళ్ళు. ఒక్కోసారి దూరంనుంచి అతనిమీద రాళ్లు వేసేవాళ్లు. భూపతి, మాణిక్యవర్మ మాత్రం ఆ పిచ్చివాడి పట్ల స్నేహంగా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడూ ఆ కూలిపోయిన భవనానికి పోయి, ముసలివాడితో కబుర్లు చెప్పేవాళ్ళు. ఒకరోజు వాళ్లు వెళ్లేసరికి, ముసలివాడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇద్దరూ ఇంత నీరు తెచ్చి అతని గొంతులో పోశారు. ముసలివాడు గుటకలు వేసి, “పిల్లలూ, పెరట్లో వేపచెట్టు మొదట్లో బంగారం ఉంది, తవ్వి తీసుకోండి" అని ప్రాణం వదిలాడు. కొద్ది రోజులు గడవనిచ్చి, భూపతి, మాణిక్యవర్మ చెట్టు మొదట్లో కాస్త కాస్తగా తవ్వసాగారు. పదిరోజులు తవ్వినాక, పాతకాలపు పెట్టె కనబడింది. దాని నిండా బంగారు నగలున్నాయి. వాటిని స్నేహితులిద్దరూ సమంగా పంచుకున్నారు. తనవంతు బంగారంతో మాణిక్యవర్మ నగరంలో వ్యాపారం చేయ నిశ్చయించాడు. భూపతి పల్లెప్రాంతానికి పోయి భూములు కొని, భూస్వామిగా బతకాలని నిశ్చయించాడు. స్నేహితులిద్దరు విడిపోయి, తిరిగి కలుసుకోలేదు. తాము చూసిన ఇల్లు ఆ మాణిక్యవర్మదేనని త్వరగానే తెలిసిపోయింది. మాణిక్యవర్మ భూపతిని చూసి గుర్తుపట్టి, నౌకరును వంపి లోపలికి పిలిపించాడు. తండ్రి కొడుకులిద్దరూ ఇల్లంతా తిరిగి చూసి, అమిత ఆశ్చర్యపడ్డారు. గజపతికి ఆ ఇంటి వైభవం చూసినాక తండ్రిమీద చాలా కోపం వచ్చింది. "నాన్నా, నువు నాకు తీరని అన్యాయం చేశావు. నువు కూడా వ్యాపారం చేసి ఉంటే మనం కూడా ఇంత హాయిగానూ ఉందుము. మన జీవితం తలుచుకుంటే రోత పుడుతున్నది," అంటూ బయటికి వెళ్ళిపోయాడు. కొడుకు చేత అంత మాటనిపించుకున్నందుకు భూపతి బాధపడ్డాడు. మాణిక్యవర్మ అతన్ని చూసి, "అలా ఉన్నావేం?" అని అడిగితే భూపతి తన కొడుకు అన్నమాట చెప్పాడు.

తెలియనితనం! నువ్వేమీ బాధపడకు,” అని మాణిక్యవర్మ భూపతికి భోజనం పెట్టించి, విశ్రాంతి సదుపాయం చేశాడు. కొద్ది సేపటికి గజపతి ఎర్రబడిన కళ్ళతో, చెరిగిన జుట్టుతో, ఇంటికి తిరిగి వచ్చాడు. మాణిక్యవర్మ అతన్ని కూడా భోజనానికి కూర్చోబెట్టి, అలా ఉన్నావేమని అడిగాడు. "మా నాన్న నాకు తీరని అన్యాయం చేశాడు. మీతోపాటే ఆయన కూడా నగరంలో వ్యాపారం చేసి ఉంటే, మేం కూడా మీలాగే హాయిగా ఉండేవాళ్ళం.” అన్నాడు గజపతి. మాణిక్యవర్మ నవ్వి, “అలా ఎన్నటికీ అనుకోకు. మీ నాన్న చేసిన నిర్ణయం ముందు చూపుతో కూడినది. వ్యాపార మంటే జూదం. ఓడలు బళ్లు కావచ్చు, బళ్లు ఓడలు కావచ్చు. నావంతు బంగారంతో మా అన్నను కూడా వ్యాపారం చెయ్యమన్నాను, కాని అతనికి ఇష్టం లేకపోయింది. నా దగ్గర ఉన్న బంగారంలో సగం తీసుకుని, ఓడ వ్యాపారం సాగించాడు. నడిసముద్రంలో ఓడ మునిగి, సరుకంతా పోయింది. నా దగ్గర మరికొంత బంగారం తీసుకుని కలప వ్యాపారం సాగించాడు. అగ్ని ప్రమాదంలో అతని కలప అంతా కాలి బూడిద అయిపోయింది. నేను చేసిన వ్యాపారం బాగా కలిసి వచ్చింది. వ్యవసాయం అలాగా కాదు, వ్యాపారానికి స్వయం కృషికన్న అదృష్టం కలిసిరావటం ముఖ్యం. ఇవాళ కుబేరుడుగా ఉన్నవాడు రేపు బికారి కావచ్చు. వ్యాపారం చేసేవాడికి చింత తప్ప సంసార సుఖం కూడా ఉండదు. నీ జీవితంలో ఎలాంటి సమస్యలూ లేవంటే అది మీ నాన్న చలవే!" అన్నాడు.

గజపతికి కను విప్పు కలిగింది. అతను తన అజ్ఞానానికి ఎంతగానో సిగ్గు పడ్డాడు. మర్నాడు భూపతి మాణిక్యవర్మతో, “నువ్వు మావాడికి మీ అన్న గురించి చెప్పావుటగదా? ఎవరా అన్నయ్య? నే నెన్నడూ ఎరగనే?" అన్నాడు. “నీ పట్ల స్నేహధర్మాన్ని బట్టి ఒక చిన్న కట్టుకథ అల్లి చెప్పాను. మీవాడి మనసు మారినట్టే ఉంది" అన్నాడు మాణిక్యవర్మ.