2. దేవేంద్ర శాపంతో భూలోకానికి.



ఒకనాడు అంగరంగ వైభవంగా దేవేంద్ర సభలో రంభా, ఊర్వశుల నాట్యం సాగుతోంది. యక్ష, గంధర్వ, కిన్నెర కింపురుషాది దేవజాతులతో ఇంద్రసభ దేదీప్యమానంగా వెలుగుతోంది. ఉన్నట్టుండి పదిమంది గంధర్వులకు ఆ నాట్యం చూస్తూవుంటే చక్కిలిగిలి మొదలై కూర్చున్న ఆసనాల్లోంచి లేచి రంభా, ఊర్వశుల చెంత చేరి తాముకూడా నృత్యం చేయబోయారు. అసలే అపూర్వ శృంగారాభి నయం చేస్తూన్న ఆ దేవ వేశ్యలకు ఈ గంధర్వుల చేరికతో మతిపోయింది. క్షణాల్లో ఇంద్రసభ కకావికలం అయింది.

ఈ రసాభాసకు ఆగ్రహం వచ్చిన ఇంద్రుడు "ఆదర్శవంతమైన దివ్య జీవితం గడిపే మీరు, ఆదమరచి అతి మూర్ఖంగా ప్రవర్తించినందుగ్గాను తెలివిహీనులై భూలోకాన సంచరింతురు గాక!" అని శపించాడు.

భూలోకంలో తెలివి ఉంటేనే నెట్టుకు రావడం బహుకష్టం. అటువంటిది మతిమాలిన తనంతో మనుగడ సాగించడం ఎంత కష్టమో అంతకుముందు శాపకారణంగా రుచిచూసి వున్న రంభా, ఊర్వశులు గంధర్వుల పట్ల జాలిపడి దేవేంద్రుని శరణువేడాడు.

“స్వర్గాధిపతీ! ఆ గంధర్వులదే తప్పంతా అనుకోరాదు. శృంగారాభినయంతో రెచ్చగొట్టిన ఘనత మాది. మా నాట్యంలో భంగిమలు బ్రహ్మకైనా రిమ్మతెగులు పుట్టిస్తాయే! అట్లాంటప్పుడు ఈ గంధర్వులు తమకం పట్టక, మా దరి చేరడంలో వింత ఏముంది? కనుక వారిపట్ల జాలితో కాస్త శాపవిమోచనం అనుగ్రహించండి" అంటూ గంధర్వుల తరఫున దేవేంద్రుని ప్రాధేయపడ్డారు.

మీరన్నదీ నిజమే! ఈ శాపానికి తిరుగులేదు గనుక, వాళ్ళు భూమ్మీదకు వెళ్ళవలసిందే! అయితే దైవ సంబంధ గుణాలు అధికంగా ఉన్న పరమానందయ్య దంపతుల చెంతకు చేరి వారి శిష్యులై లోకానికి కొంతకాలం తమ మూర్ఖపు చర్యలతో అమాయకపు చేష్టలతో వినోదం కలిగించి అనంతరం శాపం తీరి తిరిగి దేవలోకానికి చేరుకోగలరు" అంటూ దేవేంద్రుడు శాప విముక్తిని అనుగ్రహించాడు.

ఆ ప్రకారం అతి మూర్ఖశిఖామణులుగా అవతరించిన గంధర్వులు భూలోకం దారిపట్టి పరమానందయ్య గారిని వెతుక్కుంటూ వచ్చి అనాధులమైన తమను శిష్యులుగా స్వీకరించి అనుగ్రహించ వలసిందిగా వేడుకున్నారు. పదిమందికి పెట్టిన చెయ్యి కావడంతో పేరిందేవి కూడా చిరకాలంగా తమకు సంతానం లేనిలోటు తీర్చుకోవడానికి ఆ పదిమందినీ శిష్యులుగా గ్రహించడానికి ప్రోత్సహించడంతో పరమానందయ్య సరేనన్నారు.

ఆ ప్రకారం పరమానందయ్యగారి వద్ద కుదురుకున్న పదిమంది శిష్యులూ అన్ని విషయాల్లోనూ గురువుగారికీ, గురుపత్నికీ చేదోడు వాదోడుగా ఉంటూ సేవించుకోసాగారు. శిష్యులు చేరాక మఠానికి కలకలం వచ్చి కొత్తకళ ఏర్పడిందని చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా బాగా ప్రచారమైంది.

గురువుగారి కుటుంబం పెద్దదైంది గనుక వారి పోషణభారం తమదే అని భావించిన ఆ అరవై గ్రామాలవారూ పోటాపోటీగా తమ గురువుగారిని తమ గ్రామాలకు ధర్మప్రవచనాల నిమిత్తం ఆహ్వానించ సాగారు.