3.తోటకూర గోమయం


సాయంత్రపు వేళ.... ఆకాశంలో అప్పటి దాక తిరిగి తిరిగి అలిసిన సూర్యుడు మెల్లగా ఇంటి బాట పట్టాడు. అప్పటిదాకా దుప్పటి కప్పుకొని పడుకున్న చంద్రుడు డ్యూటీ కి సమయం అవ్వడంతో నిదానంగా వచ్చేసాడు. పిల్లలు యదావిధిగా పేదరాశి పెద్దమ్మ ఇంటికి చేరుకున్నారు. ఈ రోజు పెద్దమ్మ ఏం కథ చెప్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో పెద్దమ్మ గుడిసె బయటకు వచ్చి అరుగు మీద కూర్చుంది... "పిల్లలు.... ఈ రోజు మనం తెనాలి రామకృష్ణుని కథ చెప్పుకుందామా ..." పిల్లలందరూ ఆ పేరు వినగానే నవ్వుతూ చెప్పుకుందాం అని ఆనందంగా అరిచారు. దానికి బామ్మ నవ్వి.....

"ఈ రోజు చెప్పే కథ పేరు తోటకూర గోమయం .. ఇక కథలోకి వెళ్తాం .." మన అందరికి శ్రీ కృష్ణ దేవరాయలు వారు తెలుసు కదా... రాయల వారు ప్రజలను కన్న బిడ్డలులాగా చూసుకునేవారు. ఆయన విజయ నగర సామ్రాజ్యాన్ని పాలించే కాలంలో ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, ఏ చీకు చింత లేకుండా బ్రతికేవారు. వజ్రాలు, బంగారం, మణులు లాంటివి వీధుల్లో రాసులుగా పోసి అమ్మేవారు.

అలాంటి రాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరైన తెనాలి రామకృష్ణ కవి ఉండేవారు. ఈయనకు వికటకవి అని మరో పేరు కూడా ఉంది. రాయలు వారు సంధిగ్ధంలో ఉన్న చాలా సార్లు తెనాలి రామకృష్ణ తన తెలివితో, యుక్తితో బయటపడేసేవాడు. అందుకే రాయల వారికి తెనాలి రామకృష్ణ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. కానీ ఆస్థానంలో ఉన్న కొంతమంది మంత్రులకు, కవులకు అది మింగుడు పడేది కాదు. వీరిలో ఆస్థాన ప్రధాన మంత్రుల్లో ఒకరైన భట్టి వీరభద్రుడు కూడా ఉన్నాడు. ఎలా అయినా రామకృష్ణ ని దెబ్బ కొట్టాలని సరైన సమయం కోసం ఎదురుచూసేవాడు .

ఇదిలా ఉండగా ఒక రోజు తెనాలి రామకృష్ణ సభ నుంచి ఏదో ఆలోచించుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చాక భార్యని మంచినీళ్లు తీసుకురమ్మని పురమాయించాడు . తను నీటిని తీసుకొని వచ్చి రామకృష్ణ చేతికి అందించబోతుండగా.... అతని చెయ్యిని చూసి గట్టిగా అరిచింది. "ఏమైందే అలా అరిచావు...." అని రామకృష్ణ కంగారుగా అడిగాడు. " మీ చేతికి ఉన్న మన పెళ్లి నాటి ఉంగరం ఎక్కడికి పోయింది.." అని ఏడుస్తూ అడిగింది. రామకృష్ణ చేతిని చూసుకున్నాడు. నిజంగానే ఆ ఉంగరం లేదు. బహుశా దారిలో ఎక్కడైనా పడిపోయిందేమో అనుకున్నాడు. "అది మా అమ్మ గారు ఎంతో ప్రేమతో మన పెళ్ళికి పెట్టారు. దాన్నెలా పోగొట్టుకున్నారు. నేనంటే మీకు ప్రేమ లేదు." అని అంటూ రామకృష్ణ భార్య ఏడవడం మొదలుపెట్టింది.

"నువ్వు ఏడవకు.. ఎక్కడో పడిపోయి ఉంటుంది. నేను వెళ్లి వెతికి వస్తా..." అని చెప్పి బయటకు నడిచాడు. అలా వచ్చిన దారిలో ఉంగరం కోసం వెతుకుతూ ముందుకు నడిచాడు. అలా వెళ్తున్న రామకృష్ణ కు కొంచెం దూరంలో మెరుస్తూ ఒకటి కనిపించింది. దూరం నుంచి చూడగానే అది తన ఉంగరమే అని గుర్తుపట్టాడు. పోయింది అనుకున్నది దొరకగానే తనకు చాలా సంతోషమేసింది. వెంటనే దాన్ని తీసుకోడానికి వేగంగా ముందుకు నడిచాడు. సరిగ్గా అదే సమయంలో ఆ దారిన ఒక గోవు వెళ్తూ వెళ్తూ ఆ ఉంగరం ఉన్న చోటే పేడ వేసింది. రామకృష్ణ కు అది చూసి చిన్నగా కోపం వచ్చింది. కానీ చేసేదేమి లేక ఆ పేడలో తన చూపుడు వేలుని పెట్టి వెతికి తన ఉంగరం తీసుకున్నాడు.

అదే సమయంలో అటు వెళ్తున్న భట్టి వీరభద్రుడు అది చూసాడు. అది తెలియని రామకృష్ణ పక్కనే ఉన్న నీళ్లలో ఉంగరం కడుక్కొని ఇంటికి వెళ్ళాడు. ఉంగరం దొరికింది అనగానే ఆయన భార్య తెగ సంతోషపడింది. మరుసటి రోజు..... తెనాలి రామకృష్ణ రోజు లాగే ఆస్థానానికి వెళ్ళాడు. కానీ సభంతా గంబీరంగా ఉంది. అందరూ మౌనంగా ఉన్నారు. రాయలు వారి మోహంలో దేని గురించో సతమతమవుతున్నారు అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. "ఏమైంది మహారాజా.. దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు..." అని రామకృష్ణ అడిగాడు. ఇంతలో భట్టి వీరభద్రుడు లేచాడు... "దేని గురించో కాదు.. నీ గురించే..." అని కోపంగా అరిచాడు.

తెనాలి రామకృష్ణ వారి వంక ఆశ్చర్యంగా చూసాడు. "అవును రామకృష్ణ... బ్రాహ్మణులం అయిన మనం గోవు పేడ ముట్టుకోవడం మలినం అని తెలీదా.. అయినా సరే నిన్న నువ్వు ఆ పేడలో పడిన ఉంగరాన్ని తీసుకున్నావు. దాన్ని నీ వేలుకు పెట్టుకున్నావు... నువ్వు ఇప్పుడు అపవిత్రం అయిపోయావు..." "క్షమించండి.. అది నేను కావాలని చేసింది కాదు..." అని రామకృష్ణ అన్నాడు. "కావాలని చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే..." "దీనికి పరిహారం ఏంటో చెప్పండి మంత్రి వర్యా..." అని రాయల వారు అడిగారు.

భట్టి వీరభద్రుడు ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నాడు. ఎన్నాళ్ళ నుంచో తెనాలి రామకృష్ణ మీద ఉన్న తన కోపం తీర్చుకునే సమయం వచ్చింది అని మనసులోనే సంబరపడ్డాడు. అందరి వైపు తిరిగి ఇలా అన్నాడు. "ఏ వేలి తో అయితే పేడ ముట్టుకున్నాడో ఆ వేలిని అందరి ముందు కోసేయాలి..." ఆ మాట వినగానే సభలోని అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇలాంటి శిక్ష ఇదివరకు ఎప్పుడూ ఎవరు వినలేదు... రాయల వారికి కోపం తన్నుకొచ్చింది కానీ భట్టి వీరభద్రుడు మంత్రుల అందరిలోనూ చాలా పెద్దవాడు. అందుకే ఆయన వయసుకు గౌరవం ఇస్తూ... "మంత్రి వర్యా... ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్షా...." అని ప్రశ్నించాడు.

"తప్పు చిన్నదైనా పాపం పెద్దది మహారాజా... తెనాలి రామకృష్ణ వేలుని కత్తిరించాల్సిందే...." అని పట్టుబట్టాడు. దానికి తెనాలి రామకృష్ణ ఇలా అన్నాడు....

"సరే మహారాజా.. వీరభద్రులు వారు చెప్పిన్నట్టే నాకు శిక్ష వేయండి. కానీ నాకు రోజు రాత్రి చూపుడు వేలుకు తమలపాకు చిలకలు చుట్టుకొని తినడం అలవాటు. ఈ రోజు రాత్రి చివరిసారిగా నా చూపుడు వేలుతో వాటిని తినాలని ఉంది. రేపు ఉదయం ఇదే సమయానికి భట్టి వీరభద్రుడు చెప్పినట్టుగానే నా వేలుని నరికేయండి " అని అన్నాడు.

ఆ మాటకు సభలో అందరూ భట్టి వీరభద్రుడు కోరిన దుష్ట శిక్ష ను రామకృష్ణ ఇంత సులభంగా ఎందుకు ఒప్పుకున్నాడా అని ఆశ్చర్యపోయారు. రామకృష్ణ శిక్షను అంగీకరించిన తరువాత చేసేదేమి లేక రాయల వారు మౌనంగా తన కోరికకు సరే అన్నాడు. శిక్షని రేపటికి వాయిదా వేశారు. వీరభద్రుడు తాను కోరుకున్నట్టు జరగడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. కొందరు రామకృష్ణ ని ఈర్ష్య పరులు సంతోషపడగా, చాలా మంది ఇదెక్కడి చోద్యం అని ముక్కున వేలేసుకున్నారు. రామకృష్ణ ని భార్య మాత్రం నా కారణంగానే ఇదంతా జరిగింది అని బాధపడసాగింది.. రామకృష్ణ తనని ఓదార్చాడు.రాత్రి గడిచింది..

తరువాతి రోజు అందరూ సభకు ముందుగానే వచ్చారు. రామకృష్ణ వేలుని నిజంగానే నరికేస్తారేమో అని ప్రజలంతా ఆసక్తిగా చూడటానికి వచ్చారు. మంత్రులు ఒక్కొక్కరిగా వస్తున్నారు. భట్టి వీరభద్రుడు కూడా కోటలోకి అడుగుపెట్టాడు. సభకు వెళ్తుండగా అతనికి కొంచెం దూరంలో ఆస్థానంకు వెళ్లే దారిలో ఉన్న పెరట్లో తోటకూర మొక్క కనిపించింది. వీరభద్రుడికి చిన్నప్పటి నుంచి తోటకూర అంటే ప్రాణం. రెండు రోజులకు ఒకసారి అయినా దాన్ని తిననిదే రోజు గడిచేది కాదు. గత వారం రోజుల నుంచి సంతలో ఎందుకనో వాడిపోయిన తోటకూరే దొరుతుంది. అలాంటిది పచ్చని తాజా తోటకూర ఎదురుగా కనపడటంతో తన మనసు ఆగలేదు. పరుగున అటు వెళ్ళాడు... అలా వెళ్తుండగా అకస్మాతుగా పేడతో నిండిన గొయ్యిలో సగం దాక కూరుకుపోయాడు.. రక్షించండి అని కేకలు వేయడంతో రాజ భటులు వచ్చి తనని బయటకు లాగారు..

అసలు ఎం జరిగింది ఏంటంటే.... వీరభద్రుడి తోటకూర పిచ్చి తెలిసిన రామకృష్ణడు రాత్రి పూట కావాలనే ఆస్థాన పెరుడులో ఒక గొయ్యి తవ్వి దాని నిండా పేడను వేయించి... అది కనపడకుండా పైన కొంచెం మట్టిని, ఆకులను కప్పాడు. దాని మధ్యలో కొన్ని తోటకూర మొక్కలను పెట్టించాడు. అది తీసుకుందామని వచ్చిన వీరభద్రుడు చూసుకోకుండా పేడ గొయ్యిలో పడ్డాడు... తరువాత సభలో..... "మహారాజా... పేడను తాకిన నా వేలుని ఇప్పుడే నరికేయండి.. మరి పేడలో సగం మునిగిన వీరభద్రుడికి ఏం శిక్ష వేస్తారు..." అని తెనాలి రామకృష్ణ కొంటెగా అడిగాడు. ఆ మాటకు భట్టి వీరభద్రుడు తల వంచుకొని... "నన్ను క్షమించు రామకృష్ణ.. నీ మీద అసూయతో నిన్న కావాలనే అలా మాట్లాడాను. ఇప్పుడు తీసుకున్న గొయ్యిలో నేనే పడ్డాను. దయచేసి నన్ను వదిలేయండి..." అని వేడుకున్నాడు..

ఆ మాటకు రాయల వారు మనసారా నవ్వాడు. ఇలాంటి పని ఇంకెప్పుడు చేయకు అని వీరభద్రుడిని దండించి యుక్తితో ప్రమాదం నుంచి బయటపడిన రామకృష్ణ ని తెలివిని మెచ్చుకుంటూ వంద బంగారు నాణాలు బహుమతి గా ఇచ్చారు. అక్కడికి వచ్చిన ప్రజలంతా తెనాలి రామకృష్ణ ని వికటకవి అని ఎందుకంటారో ప్రత్యక్షంగా చూసి జయ జయ ద్వానాలు చేసారు... "ఇది పిల్లలు.. ఈరోజు కథ... ఇందులో నీతి ఏంటో తెలుసా.. ఒకరికి చెడు చేయాలని చూస్తే ఆ గోతిలో మనమే పడతాం... మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం..." అని పేదరాశి పెద్దమ్మ లేచింది..