37. ఎలుకల బాధ



శిష్యులు వెళ్ళి తలుపులు తెరిచేసరికి ఇల్లంతా బూజుపట్టివుంది. ఎలుకలు, పందికొక్కులు ఇంట్లో తిరుగుతున్నాయి. వాటిని చూసి అదిరిపడ్డారు. ఆ వెంటనే పన్నెండు మంది శిష్యులూ పట్టిన బూజును దులిపారు! ఇంటిని శుభ్రంగా వూడిచారు. తర్వాత అందరూ ఒకచోట కూర్చుని ఎలుకల బాధతీరే విధానం గురించి ఆలోచిస్తున్నారు. “కన్నాల్లో నుండి బయటకి రాకుండా అన్ని కన్నాలూ పూడ్చివేద్దాం. అవి లోపలనే చచ్చిపోతాయి” అని అన్నాడు ఒకడు. ఆ శిష్యుని ఆలోచన బాగుందని అందరూ కలిసి కన్నాలన్నిటిలోనూ రాళ్ళముక్కలు కుక్కి మట్టితో గట్టిగా మూశేశారు. అమర్నాటికి రాళ్ళుపోయినాయి, కూరిన మట్టిముద్దలూ పోయినాయి, కన్నాలు యథావిధంగా వున్నాయి.

"ఒరే ! యీ ఎలుకలు సామాన్యమైనవి కాదు. మనం పూడ్చిన కన్నాలు అవి తెరిచాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి" అని ఆలోచించారు. వాళ్ళకు ఒక ఉపాయం తట్టింది చీకటయితే ఎలుకలు వస్తాయికానీ, దీపాలు వుంటే రావని తలచి కిరసనాయిలు బుడ్లు వెలిగించారు. ఇంటి మధ్యలో చాపలువేసుకొని పడుకున్నారు. ఎలుకలు అర్థరాత్రి సమయంలో మళ్ళీ బయల్దేరాయి అవి ఈసారి వాళ్ళమీదనే ఎక్కి పరిగెడుతున్నాయి. వాళ్ళకాళ్ళను కొరికాయి. ఇంకా లాభం లేదని మరో ఉపాయం కోసం ఆలోచించారు. వాళ్ళకు మరో మంచి ఆలోచన వచ్చింది. వరిగడ్డి తెచ్చి కన్నాల్లో దోపి అగ్గి వెలిగిస్తే కన్నాలలోని ఎలుకలు కన్నాల్లోనే చస్తాయి అనుకున్నారు. ఆ వెంటనే వరిగడ్డి తెచ్చి ఎలుక కన్నాలు అన్నిటిలోనూ కుక్కారు. ఇంట్లో వున్న కిరసనాయిలు ఆకన్నాల్లోని గడ్డిమీద పోసి నిప్పుపెట్టారు. "ఇంక ఎలుకలు చచ్చిపోతాయి అని చప్పట్లు చరుస్తూ గంతులు వేస్తున్నారు. వాళ్ళు ఆ సమయంలో ఇంటిని గురించి పట్టించుకోలేదు.

పరమానందయ్యగారి ఇల్లే అగ్నిమయం అయింది. అదిచూసి ఇరుగుపొరుగువారు పరిగెత్తుకువచ్చి ఆ ఇంటిముందు గుమిగూడారు. కొందరు మంటను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించుచున్నారు. ప్రక్క ఇళ్ళు అంటుకుంటాయని ఇరుగు పొరుగువాళ్ళకి చెప్పారు. అదిచూసి శిష్యులు హడలిపోయారు. ఆ వెధవలు ఎక్కడున్నారో వెతకండి! కాళ్ళూ చేతులూ కట్టేసి మంటలో పడేద్దాం" అన్నారు ఊళ్ళోవాళ్ళు. ఆ మాటలు అక్కడే నక్కిన శిష్యులు విన్నారు. నిజంగా వాళ్ళు అంతపనీచేస్తారని భయపడ్డారు! వాళ్ళకు కనబడకుండా వుడాయించారు. ఆ మర్నాటి ఉదయానికి శిష్యులంతా గురువుగారువున్న గ్రామంచేరారు. వాళ్ళుచేసిన పనిని వివరించగా పరమానందయ్య ఆయన భార్య తలబాదుకుని బాధపడ్డారు.