పేదరాశి పెద్దమ్మా.. మజాకా!


మణిపురం రాజ్యంలో రాఘవపురం ఉంది. దాని పొలిమేరలో పేదరాశి పెద్దమ్మ ఉండేది. వచ్చీపోయే బాటసారులకు భోజనం పెట్టేది. ప్రతిఫలంగా వారిచ్చే తృణమో, ఫణమో తీసుకునేది. గురుకులంలో సకల విద్యలూ పూర్తి చేసిన రామయ్య పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వచ్చి 'పెద్దమ్మా.. పెద్దమ్మా.. ఓ రెండు రోజులు నీ దగ్గర విశ్రాంతి తీసుకుంటాను.

మణిపురం రాజ్యంలో రాఘవపురం ఉంది. దాని పొలిమేరలో పేదరాశి పెద్దమ్మ ఉండేది. వచ్చీపోయే బాటసారులకు భోజనం పెట్టేది. ప్రతిఫలంగా వారిచ్చే తృణమో, ఫణమో తీసుకునేది. గురుకులంలో సకల విద్యలూ పూర్తి చేసిన రామయ్య పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వచ్చి 'పెద్దమ్మా.. పెద్దమ్మా.. ఓ రెండు రోజులు నీ దగ్గర విశ్రాంతి తీసుకుంటాను. తర్వాత కోటకు వెళ్లి కొలువు చూసుకుంటాను' అన్నాడు. రామయ్య మంచితనం గురించి పెద్దమ్మకు ముందే తెలుసు. అందుకే 'దానికేం భాగ్యం నాయనా.. అలాగే ఉండు' అంది పెద్దమ్మ.

పెద్దమ్మ ఇంటికి కాస్త అటు పక్కగా ఒక చెట్టు ఉంది. దాని మీద గబ్బిలాలు వచ్చి చేరేవి. చాలామంది బాటసారులు ఆ చెట్టు ఎందుకు? కొట్టించెయ్యి.. వాటి గోల ఉండదు అనేవారు. 'పాపం.. వాటికి ఏదో ఆశ్రయం దొరికింది. మనకు అవి ఎలాంటి నష్టమూ చేయడం లేదు కదా..' అనేది పెద్దమ్మ. ఒక రోజు ఆ దేశపు యువరాణి తన చెలికత్తెలతో తోటలోని జలాశయంలో ఈతకు వెళ్లింది. నీళ్లలో దిగుతూ.. వజ్రాల హారంతోపాటు ఇతర నగలు తీసి ఒడ్డునున్న చెట్టు కింద పరిచిన వస్త్రం మీద పెట్టింది. అందరూ నీళ్లలో దిగారు. చెట్టు పై నుంచి ఒక కాకి కిందకు వాలింది. ఎర్రగా మెరిసే వజ్రాలను చూసి మాంసం ముక్కలు అనుకుంది. ఆ హారాన్ని ముక్కుతో పట్టుకుని ఎగిరిపోయింది.

చెలికత్తెలు చూసి కాకి కోసం చుట్టూ గాలించారు. రాజు కూడా చుట్టుపక్కల వెతికించాడు. కానీ ఫలితం లేకపోయింది. అలా ఆ కాకి ఒక చెట్టుమీద చేరి కాళ్లతో పట్టుకుని ఆ ఎర్రని వజ్రాలను ముక్కుతో పొడిచి.. పొడిచి.. అలసిపోయి వదిలేసి ఎగిరిపోయింది. ఆ హారం జారిపోయి కిందనున్న కొమ్మపై పడి వేలాడసాగింది. అదే రోజు రాత్రి ఒక గబ్బిలం ఆ చెట్టు మీద వాలి ఎగిరిపోతుండగా అది దాని మెడకు చుట్టుకుంది. అలా గబ్బిలం ఎగిరి వచ్చి పెద్దమ్మ ఇంటి దగ్గర ఉన్న చెట్టు మీద తలకిందులుగా వేలాడినప్పుడు ఆ హారం కాస్తా కింద జారిపడింది.

మరుసటి రోజు పెద్దమ్మ కట్టెల కోసం చెట్టు కింద ఉన్న మోపు దగ్గరకు వెళ్లగా పక్కన పడి ఉన్న వజ్రాలహారం కనిపించింది. దాని మీద మణిపురం రాజ్యం పేరు రాసి ఉది. పెద్దమ్మ దాన్ని జాగ్రత్త చేసింది. అదే సమయానికి పక్క గ్రామంలో ఉండే రంగడు వచ్చాడు. రంగడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతుండేవాడు. ఈ విషయం పెద్దమ్మకూ తెలుసు. 'పెద్దమ్మా! భోజనం చేశాక కోటకు బయలు దేరతాను' అన్నాడు రామయ్య 'నాకు కూడా అక్కడ పని ఉంది. నేను కూడా భోజనం తిని కోటకు బయలుదేరతాను' అన్నాడు రంగడు. భోజనం చేశాక పెద్దమ్మకు కొంత ధనం ఇచ్చి వెళ్లివస్తామన్నారు రామయ్య, రంగడు. 'అలాగే వెళ్లిరండి'.. అని రెండు ఒకే రంగు ఉన్న చిన్న చిన్న సంచులు తెచ్చి చెరొకటి ఇచ్చింది. 'వీటిని రాజుగారికి ఇవ్వండి. మీకు మంచి జరుగుతుంది' అంది. తర్వాత మరో రెండు ఒకే రంగున్న పెద్ద సంచులు ఇచ్చింది. 'మీకు దారిలో ఆకలి అయితే తినడానికి వీటిలో కొన్ని రొట్టెలు పెట్టాను. ఆ చిన్న సంచులను కూడా ఇందులో పెట్టుకోండి' అని వారికిచ్చింది.

రంగడి మదిలో ఆలోచన మొదలైంది. తన గురించి పెద్దమ్మకు ఎలాగూ తెలుసు కాబట్టి.. రామయ్యకు ఏదో విలువైన వస్తువు ఇచ్చి.. తనకు మాత్రం మామూలు వస్తువు ఇచ్చి ఉంటుంది అనుకున్నాడు. దారిలో ఒక బావి దగ్గర ఆగి 'రామయ్యా! ముందుగా నువ్వు దాహం తీర్చుకుని రా! తర్వాత నేను తీర్చుకుంటాను. నీ సంచిని ఇలా ఇవ్వు' అని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. రామయ్య వచ్చేలోగా చిన్న సంచులను మార్చేశాడు రంగడు.

కాస్త దూరం వెళ్లాక 'రామయ్యా.. నేను ఈ పూట కోటకు రాలేను' అని చెప్పి తన దారిన తాను పోయాడు రంగడు. కోటకు చేరుకున్న రామయ్య మంత్రి సమక్షంలో మహారాజును కలిసి పెద్దమ్మ ఇచ్చిన చిన్న సంచిని ఇచ్చాడు. అందులో యువరాణి వజ్రాల హారం ఉంది. దాంతో పాటు 'ఈ రామయ్య చాలా నిజాయతీపరుడు. అతని అర్హతను బట్టి కొలువు ఇవ్వగలరు' అని రాసిన పత్రమూ ఉంది. పెద్దమ్మ కోరినట్లుగానే రామయ్యకు తన ఆస్థానంలో మంచి కొలువు ఇచ్చాడు. అక్కడ రంగయ్య ఆ చిన్న సంచిని విప్పి చూశాడు. అందులో చిన్న చిన్న గులకరాళ్లు ఉన్నాయి. ఇంకా.. 'నువ్వు సంచులను మారుస్తావని నాకు తెలుసు' అనే పత్రమూ ఉంది. రంగడు తేలు కుట్టిన దొంగలా ఊరకుండి పోయాడు.