5.శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం



ఇంతలో ఒక శిష్యునికి సందేహం వచ్చింది. "అందరం ఏరుదాటి వచ్చామా! లేదా! లేక చురకపెట్టిన ఆగ్రహం కొద్దీ ఏరు ఎవర్నయినా మింగేసిందా?" అని అనుమానం కొద్దీ తమ పదిమందినీ లెక్కబెట్టాడు. లెక్కకు తొమ్మిది మందే వస్తున్నారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా ఇదేవరస. దాంతో "గురువుగారూ! కొంప మునిగిందండీ! మాలో ఒకర్ని ఏరు పొట్టన పెట్టేసుకుంది" అంటూ ఏడుపు లంకించుకున్నాడు.

"ఆఁ! నిజంగానా?" అంటూ ఆయన ఆశ్చర్యపోయి, “సరిగ్గా లెక్కపెట్టావా నాయనా! ముందాశోకాలు మాని, ఇంకోసారి లెక్కపెట్టు ధైర్యంగా అన్నారు పరమానందయ్య. "నిజమేనండీ గురువుగారూ! మేం మీశిష్యులం పదిమందిమి ఉండాలికదా! మీతో కలిపి 11మందిమి... 'ఏకాదశరుద్రుల్లా భాసిస్తున్నాం' అని మీరు అంటుంటారు. ఇప్పుడు లెక్కబెడితే దశావతారాలే-మీతో కలిపి" అన్నాడు ఆ శిష్యుడు.

ఆ శిష్యుడు ఎంతో చురుకైన వాడని పరమానందయ్యగారి నమ్మకం. అటువంటి వాడి మాటల్లో శంకించడానికేముంటుంది? అయినా, శిష్యులందర్నీ వరుసగా నిలబెట్టి "మనం ఏకాదశరుద్రుల్లాంటి వారం" అంటూ తనను మినహాయించుకొని లెక్కబెట్టాడాయన కూడా. పదిమందే లెక్క తేల్తున్నారు. దాంతో శిష్యులకు తగ్గ గురువైన పరమానందయ్య కూడా ఏరు నిజంగానే ఒకర్ని మింగేసిందని భోరుమన్నాడు.

లెక్క తప్పు వేసుకొంటూ భోరుమంటున్న శిష్యులు ఇక్కడ గురుశిష్యులిద్దరూ చేస్తున్న పొరపాటేమిటీ అంటే... ముందుగా తమను తాము లెక్కించుకొని, ఇతరుల్ని లెక్కించుకుంటూ రావాలన్న కనీసజ్ఞానం విస్మరించడం. అందుకే ఎవరు లెక్కించినా ఒకరు తక్కువ వస్తున్నారు. తీరా, వికల మనస్కులై ఇంటికి వెళ్ళి గురుపత్ని పేరిందేవి దగ్గర శోకాలు తీయగా, ఆమె లోకజ్ఞానం ఉపయోగించి గురువు గారితో పాటు అందర్నీ వరసగా నిలబెట్టి, ఒక్కక్కరినే చేత్తోతట్టి లెక్కబెట్టే సరికి 11మందీ లెక్కతేలే సరికి అంతా స్థిమిత పడ్డారు.