6.తిన్నింటి వాసాలు



రామన్న సాలి గ్రామం నుంచి వెనుదిరిగి స్వగ్రామం వస్తుంటే, దారిలో చిరిగిన దుస్తులతో- భార్యా పిల్లలతో చంద్రహాసుడు అనే అతడు ఎదురయ్యాడు. అతని దీనావస్థకు కారణం అడగగా, ఒకప్పుడు తాను అవధానాలలో పాల్గొన్న పండితుడనని, ముందు చూపులేక అన్నీ పోగొట్టుకొని ప్రస్తుతం కాలం కలిసిరాక కటిక పేదరికంలో మగ్గుతున్నానని వివరించాడు. రామన్న చంద్రహాసుడిపై జాలిదలచి, అతని కుటుంబానికి తన యింట ఆశ్రయం యిచ్చాడు.

ప్రతిరోజు రామన్న యింటికి ఎందరెందరో వచ్చి తగవులు తీర్చుకొని, అతడికి తమకు తోచిన విధంగా తృణమో, ఫణమో చెల్లిస్తూ వుండడం చంద్రహాసుడు గమనించాడు. రామన్న పండితుడు కాకపోయినా, ఏదో తనకు తోచింది చెబుతున్నట్లుగా, వెర్రిజనం అదేదో గొప్ప న్యాయంగా తలచి గొర్రెల్లా తరలివస్తున్నట్లుగా భావించాడు. అందుకే ఒకరోజు పగటిపూట మేనువాల్చి, పైకప్పు వాసాలు లెక్కిస్తూ, రామన్న యిస్తున్న తీర్పును వింటూ నిట్టూర్చాడు!

అది గమనించిన రామన్న, "చంద్రహాసా! నేను చెప్పిన తీర్పులో ఏదైనా తప్పుగాని దొర్లిందా? ఎందుకలా నిట్టూరుస్తున్నావు?" అని ప్రశ్నించాడు. "ఏదో నీకు తోచింది నీవు చెప్పడం సరే! కాని ప్రజలు వారికి తోచింది వారు యివ్వడం సరికాదు. వాళ్ల బియ్యం, పప్పులతోనే సరిపెట్టుకోక సాధ్యమైనంత సంపాదించడం నేర్చుకో! లేదంటే, నాలాగే నువ్వూ తొందరగా బికారి అయిపోయే ప్రమాదముంది” అంటూ సలహా యిచ్చాడు. అది విన్న గ్రామస్థులు రామన్న మంచితనాన్ని మార్చడానికి యత్నిస్తున్న చంద్రహాసుడిని దుయ్యబట్టారు. మరునాడు బొబ్బిలి కోట నుండి రామన్నకు ఆహ్వానం అందగా, రామన్న తన వెంట చంద్రహాసుడిని కూడా తీసుకువెళ్లాడు.