ఎత్తుకి పైఎత్తు


శృంగారపురాన్ని పాలించే శంఖచూడుడు, అనేక రాజ్యాల మీదికి దండెత్తి, లెక్కకు మిక్కిలిగా వజ్ర వైడూర్యాలనూ, మరకత మాణిక్యాలనూ, బంగారాన్నీ సంపాదించాడు. వాటిని భద్రపరిచేందుకు ధనగృహాన్ని నిర్మించ తలపెట్టాడు. పేరుమోసిన తాపీమేస్త్రీ బంధుడును పిలిచాడు. ఊరికి దూరంగా అభేద్యమైన ధనగృహాన్ని నిర్మించమని ఆదేశించాడతనికి. సరేనని, కుమారుడు మధుడుసహా ధనగృహాన్ని నిర్మించాడు బంధుడు. ఎవరికీ తెలియని విధంగా, ఎవరూ గుర్తుపట్టలేని విధంగా ధనగృహంలో ప్రవేశించేందుకు, తిరిగి వచ్చేందుకు ఓ బండను గోడలో ఏర్పరిచి మరీ నిర్మాణాన్ని పూర్తి చేశాడతను. పూర్తి అయిన ధనగృహాన్ని అన్ని వైపులా, అనేక రకాలుగా పరిశీలించి, పరిశోధించి, బాగున్నదని తృప్తి చెందాడు శంఖచూడుడు. బంధుడికీ, అతని కొడుక్కీ రెండింతలుగా కూలీ చెల్లించి, వారిని పంపించి వేశాడు. తర్వాత సంపాదించిన ఆస్తినంతటినీ బండ్ల ద్వారా ధనగృహానికి చేరవేసి, తాళాలు బిగించాడు. కాపలాగా పాతిక మంది భటులను నియమించాడు.కొద్దిరోజులు గడిచాయి.

ధనగృహాన్ని ఎవరూ కన్నెత్తి చూడడం లేదని, దోచుకునే అవకాశం అంతకన్నా లేదని తెలిశాక, అక్కడి నుంచి భటులను వెనక్కి పిలిపించాడు శంఖచూడుడు. అదంతా గమనించాడు బంధుడు. ఎప్పుడైతే భటులు వెనక్కి వెళ్ళిపోయారో ఆ రాత్రి కొడుకు మధుడుసహా ధనగృహానికి బయల్దేరాడు బంధుడు. కూడా గోనెసంచిని తీసుకుని వెళ్ళాడు. ధనగృహాన్ని సమీపించాడు. దాని గోడకి గల బండను తొలగించి, కొడుకుసహా లోనికి ప్రవేశించాడు బంధుడు. బంగారు వరహాలు కుప్పబోసి ఉన్నాయి అక్కడ. గోనెసంచి నిండుగా నింపుకున్నాడు వాటిని. వెను తిరిగి వచ్చాడు. కన్నం ఎలా వేసిందీ ఎవరూ గుర్తించలేని విధంగా బండను యథాప్రకారం గోడకి ఏర్పరిచి, కొడుకు సహా ఇంటిదారి పట్టాడు బంధుడు.మర్నాడు శంఖచూడుడు భటులతో ధనగృహానికి చేరుకున్నాడు. దాచిన ధనం అంతా ఉన్నదీ లేనిదీ పరిశీలించసాగాడు. ఆ పరిశీలనలో బంగారువరహాల రాశి తరిగి ఉండడాన్ని గమనించాడు.‘‘దొంగతనం జరిగింది. ఎలా జరిగింది?’’ ఆందోళన చెందాడు.‘‘లేదు మహారాజా! ఇంత గట్టి కట్టడాన్ని ఛేదించుకుని లోపలికి దొంగ ప్రవేశించడం అసాధ్యం. దొంగతనం జరగలేదిక్కడ.’’ చెప్పారు భటులు.దొంగతనం జరగలేదా? జరిగినట్టు తనకి అనిపిస్తోందే? తర్జనభర్జన పడ్డాడు శంఖచూడుడు. ఊరుకున్నాడు అప్పటికి.

కొద్ది రోజలకి మళ్ళీ బంధుడు ధనగృహానికి బయల్దేరాడు. కూడా కొడుకు మధుణ్ణీ, గోనెసంచినీ వెంటబెట్టుకున్నాడు. ధనగృహాన్ని సమీపించాడు. బండను తొలగించాడు, లోనికి ప్రవేశించి, బంగారు వరహాలతో సంచిని నింపి, బయట ఉన్న కొడుక్కి అందజేశాడు.‘‘తీసుకెళ్ళి, ఈ డబ్బును ఇంట్లో దాచిపెట్టి, మళ్ళీ సంచితో రా.’’ చెప్పాడు. అలాగే చేశాడు మధుడు. అప్పుడు మళ్ళీ సంచి నిండుగా బంగారువరహాలు నింపుకుని బయటపడ్డాడు బంధుడు. యథాప్రకారం బండను అమర్చి వెను తిరిగాడు.తెల్లారుతూనే శంఖచూడుడు ధనగృహానికి చేరుకున్నాడు. బంగారు వరహాలు మాయమైనట్టు గమనించాడు.‘‘అనుమానం లేదు, ఎవరో వరహాలను దొంగిలిస్తున్నారు.’’ అన్నాడు. తరిగిన వరహాల రాశిని చూసి, ఒకరిని ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటున్న మంత్రులనూ, భటులనూ చీదరించుకున్నాడు.‘‘దొంగను పట్టుకోవాలి మహారాజా! పట్టుకుని తగిన శిక్ష విధించాలి.’’ అన్నారు మంత్రులు.‘‘పట్టుకోవడం ఎలా?’’ అడిగాడు శంఖచూడుడు.‘‘చిన్న ఆలోచన మహారాజా! కరిగించిన తారును వేడివేడిగా గోడలనంటి ఈ గృహం అంతా పోద్దాం. అప్పుడు కన్నం వేసిన దొంగ తారులో పడి, దొరికిపోతాడు.’’ అన్నాడు రక్షణమంత్రి.

‘‘ఆ ప్రయత్నంలో ఉండండి మరి.’’ చెప్పాడు శంఖచూడుడు.చెప్పినట్టుగానే తారును పోసి, కాపలాగా నలుగురైదుగురు భటులను నియమించాడు రక్షణమంత్రి. వారం రోజులు గడిచాయి. దొంగలెవరూ రాలేదు. అవసరమై భటులను వెనక్కి పిలిపించాడు మంత్రి.ఒకరోజు కొడుకుసహా బంధుడు మళ్ళీ ధనగృహానికి బయల్దేరాడు. సమీపించాడు దాన్ని. గోడకి గల బండను తొలగించాడు. లోపలికి ప్రవేశించాడు. లోపలికి కాళ్ళు పెట్టాడో లేదో తారులో ఇరుక్కున్నాయవి. కాళ్ళని వెనక్కి లాగే ప్రయత్నంలో చేతులు కూడా తారుకి అంటుకుపోయాయి. కదలలేకపోయాడు బంధుడు. దొరికిపోయాననుకున్నాడు. ఆలోచనలో పడ్డాడు. తలని బయటకు పెట్టి, మధుణ్ణి దగ్గరగా పిలిచాడు. లోపల తారులో తాను ఇరికిన సంగతి వివరించి, చెప్పాడిలా.‘‘దొంగను నేనని రాజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. అందుకని నువ్వు ఓ పని చెయ్‌! కత్తితో నా తలను నరికెయ్‌. మొండెం నుంచి నా తలను వేరు చేసి, దానిని నదిలోకి విసిరేయ్‌. అలాగే నేను వేసుకున్న దుస్తులు కూడా కత్తితో చీల్చి, పీలికలు చేసి, దూరంగా పారేయ్‌. తర్వాత యథాప్రకారం బండను అమర్చి ఇక్కణ్ణుంచి వెళ్ళిపో.’’ తండ్రి చెప్పినట్టుగానే చేశాడు మధుడు. వెళ్ళిపోయాడక్కణ్ణుంచి. ఇంటికి చేరుకున్నాడు. జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె నెత్తికొట్టుకుని బాధపడ్డది.‘‘జరిగిందేదో జరిగిపోయింది. నాన్న పోయాడు. దొంగ తానని తెలియకూడదు. ఎక్కడా ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ రహస్యం బయట పడకూడదు.

నాన్నను బయట పెట్టకూడదు.’’ తల్లిని హెచ్చరించాడు మధుడు.కొద్దిరోజులు గడిచాయి.ఎప్పట్లాగే తన పనిలో, తాపీపనిలో పడ్డాడు మధుడు. ఏదీ జరగనట్టుగానే వ్యవహరించసాగాడు.ఒకరోజు శంఖచూడుడు ధనగృహానికి చేరుకున్నాడు. కూడా మంత్రులు ఉన్నారు. లోపలికి ప్రవేశించి, తల లేకుండా, నగ్నంగా ఉన్న మొండాన్ని గమనించాడు.‘‘దొంగ దొరికాడు కాని, తాను ఎవరన్నది తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా మనం తెలుసుకోవాలి, ఎలా?’’ ప్రశ్నించాడు.‘‘తెలుసుకోవచ్చు మహారాజా! ఈ మొండాన్ని నగరంలో మూడు రోజులపాటు ఊరేగిద్దాం. దీన్ని చూసి భయపడేవారేకాని, ఏడ్చేవారు ఉండరు. ఒకవేళ ఎవరైనా ఏడిస్తే, ఆ ఏడ్చేవారే ఈ దొంగ ఎవరో చెబుతారు. తెలిసిపోతుంది.’’ అన్నాడు రక్షణమంత్రి.

‘‘ఆలోచన బాగుంది, ఆలస్యం ఎందుకు? అమలుపరచండి.’’ అన్నాడు శంఖచూడుడు.బంధుడి మొండాన్ని ఇద్దరు భటులు ఊరేగించసాగారు. ఇంటి దగ్గరగా వచ్చిన భర్త మొండాన్ని చూసి గోలగోలగా ఏడ్చింది అతని భార్య. మధుడు దగ్గరగానే ఉన్నాడు. గోడ నిర్మిస్తున్నాడు. తల్లి ఏడవడాన్ని గమనించాడతను. ఏడుస్తున్న బంధుడి భార్యను చూశారు భటులు. దొంగ ఎవరో తెలిసిందనుకున్నారు. ఆమెను బంధించేందుకు ముందుకు పరుగుదీశారు. వాళ్ళు తల్లిని బంధించబోతున్నారని తెలుసుకున్నాడు మధుడు. వెంటనే అక్కడ ఉన్న ఇటుకను అందుకుని, దానితో ఎడమచేతి వేళ్ళపై గట్టిగా కొట్టుకున్నాడు. రక్తం కారుతున్న చేతితో, తల్లిని సమీపించిన భటుల దగ్గరకు ఒక్క అంగలో చేరుకున్నాడు.‘‘మా అమ్మను ఎందుకు బంధిస్తున్నారు?’’ అడిగాడు. చెప్పారు భటులు.‘‘మా అమ్మ అందుకు ఏడవడం లేదు. ఇదిగో! నా చేయి మీద ఇటుక పడి, వేళ్ళునుజ్జునుజ్జు అయిపోయాయి. చూసిందది. చూసి, రేపటి నుంచి పని ఎలా చేస్తాడు. బతుకులెలా వెళ్ళదీస్తాడని ఏడుస్తోంది.’’ అన్నాడు మధుడు. ఆ మాటలు సబబు అనిపించాయి భటులకు. ఆమెను వదలి వెళ్ళిపోయారు.బంధుడి మొండాన్ని ఊరి అవతల గల ఉరికంబం దగ్గరకు చేర్చారు. రాత్రి అయింది అసరికి. కాపలాగా పదిమంది భటులు ఉన్నా రక్కడ. శీతకాలం. బాగా చలిగా ఉంది. ఈ చలిలో ఇంకా రెండు రోజులు ఈ మొండాన్ని ఊరేగించాలి. పడరాని పాట్లు పడాలనుకున్నారు భటులు. చలికి ముడుచుకుని కూర్చున్నారు. అదే అవకాశంగా మధుడు, రెండు కల్లు కుండల్ని గాడిదకు అటూ ఇటూ అమర్చి, దారినపోయే దానయ్యగా అటుగా నడవసాగాడు. కల్లువాసన రావడంతో ఆనందించి, భటులంతా మధుణ్ణి చుట్టుముట్టారు.

‘‘ఈ చలికి తట్టుకోలేకపోతున్నాం. కొంచెం కల్లు పొయ్యవయ్యా, చచ్చి నీ కడుపున పుడతాం.’’ అన్నారు.‘‘కొంచెం ఏం ఖర్మ! కడుపు నిండా తాగండి.’’ అన్నాడు మధుడు. కల్లు పోసి, రెండు కుండలూ ఖాళీ చేశాడు. మత్తుగా, వెచ్చగా పడుకున్నారు భటులు. కావాల్సింది అదే! ఊపిరి పీల్చుకున్నాడు మధుడు. తండ్రి మొండాన్ని తరలించుకుపోయాడు. ఊరికి మరింత దూరంగా మొండాన్ని పాతిపెట్టి, ఇంటిదారిపట్టాడు.తెల్లారింది. మత్తు వదిలింది. భటులు లేచి కూర్చున్నారు. ఉరికంబం వైపు చూశారు. మొండెం లేదక్కడ. ఏం చెయ్యాలో అంతు చిక్కలేదు. మొండెం పోయిన సంగతి రాజుకి చెప్పి, తప్పు ఒప్పుకున్నారు భటులు.ఇంకా రెండు రోజులు మొండాన్ని ఊరేగించాలి.

ఊరేగిస్తేనేకాని దొంగ ఎవరో తెలుసుకునే అవకాశం లేదు. ఇప్పుడు మొండెం కూడా లేదు. దొంగ ఎవరో ఎలా తెలుసుకోవడం? ఆలోచించాడు శంఖచూడుడు. కాసేపటికి ప్రకటించాడిలా.‘‘పోయిన మొండాన్ని వెతికి తెచ్చి ఇచ్చిన వారికి వెయ్యి బంగారు వరహాలు బహుమానంగా ఇస్తాం.’’మొండెం కోసం వెదకని ప్రదేశం లేదు. వెదకని వ్యక్తి లేడు. ఆఖరికి దొరికింది. దొరికిన మొండాన్ని మళ్ళీ ఊరేగించసాగారు. ఊరే గిస్తున్న మొండాన్ని చూసి అంతా భయపడ్డారేగాని, ఎవరూ ఏడవలేదు. ఆ రాత్రి కూడా మొండాన్ని ఉరికంబం దగ్గర ఉంచి, కాపలాగా కూర్చున్నారు భటులు. గతరాత్రి అలోచననే మళ్ళీ అమలు చేశాడు మధుడు. కల్లు తాగి ఈ కొత్తభటులు కూడా తూలి సోలిపోయారు. మొండాన్ని మళ్ళీ తస్కరించాడు మధుడు. ఈసారి ఇంకో చోట పాతిపెట్టి ఇంటికి చేరుకున్నాడు.జరిగింది తెలుసుకుని, మళ్ళీ వెయ్యి బంగారు వరహాలు బహుమానం ప్రకటించాడు శంఖచూడుడు. మొండెం దొరికింది. ఊరేగించారు. మూడో రోజు కూడా ఎవరూ దానిని చూసి ఏడవలేదు.ఇవాళ అటో ఇటో తేలిపోవాలనుకున్నాడు మధుడు. పాతిపెట్టడం కాదు, ఈసారి మొండాన్ని సముద్రంలోకి విసిరేస్తేనే శ్రేయస్కరం అనుకున్నాడు.

కల్లుమంత్రం మరి పని చెయ్యదనుకున్నాడు. ఆలోచించి, మేకలకాపరిని కలిశాడు. తనకో నాలుగు మేకలు రాత్రికి కావాలన్నాడు. తెల్లారి మళ్ళీ ఇచ్చేస్తానన్నాడు. ఆ ఒక్క రాత్రికీ నాలుగు మేకలను ఇచ్చినందుగ్గాను, కొంత మొత్తం ముట్టచెబుతానన్నాడు. అనడమే కాదు, ముట్టజెప్పాడు. నాలుగు మేకలను వెంటబెట్టుకున్నాడు. మేకలసహా, ఓ మట్టికుండను కూడా అడిగి తీసుకున్నాడు మధుడు. రాత్రి కాగానే కుండకి జాగ్రత్తగా నలువైపులా నాలుగు రంధ్రాలు ఏర్పరిచాడు. అందులో ఓ కొవ్వొత్తిని వెలిగించి ఉంచాడు. అలాగే మేకల రెండు కొమ్ములకీ చెరో కొవ్వొత్తి చొప్పున వెలిగించి ఉంచాడు. కుండను నెత్తి మీద ఉంచుకుని, నాలుగు మేకల మధ్యలో నిల్చుని, నడవసాగాడు మధుడు.

దూరం నుంచి చూస్తే గాలిలో దీపాలు కదలి వస్తున్నట్టనిపించి, భయం కలుగుతుంది. అలాగే భయపడ్డారు ఉరికంబం దగ్గరి భటులు. దెయ్యాలు వస్తున్నాయని పరుగు అందుకున్నారు అక్కణ్ణుంచి. భటులు పారిపోవడంతో మొండాన్ని చేజిక్కించుకుని, దానిని సముద్రంలోకి విసిరేశాడు మధుడు. తెరిపిన పడ్డాడు.దొంగ ఎవరో తెలుసుకోగలిగే ఆధారం మొండెం ఒకటే! ఆ ఒక్కటీ అదృశ్యం అయింది. ఇప్పుడెలా? మొండెం వెతికి తెచ్చిన వారికి బహుమానాన్ని మళ్ళీ మళ్ళీ ప్రకటించడం తెలివి తక్కువతనం. మరోలా ఆలోచించాలనుకున్నాడు శంఖచూడుడు. ఆలోచించాడు.ఆ రోజు ఆదివారం. రాజ్యంలో ఆదివారం నాడు మాంసాన్ని బాగా తింటారు. బంగారు వరహాలను దొంగిలించిన దొంగ, మాంసం ఎంత ఖరీదైనా కొంటాడు. తింటాడు. వీలైతే దానం కూడా చేస్తాడు. అందుకని మాంసం ధరను పెంచి అమ్మజూపాలి. అలాగే బిచ్చగత్తెలను కూడా ఇంటింటికీ పంపించి, వండిన మాంసాన్ని బిచ్చమడిగించాలి.

అప్పుడు బయటపడుతుంది అనుకున్నాడు శంఖచూడుడు. అనుకున్నట్టుగానే అమలు చేశాడు. దోసెడు మాంసం ఖరీదు వంద బంగారు వరహాలుఅన్నాడు. అలాగే వందమంది బిచ్చగత్తెలను రప్పించి, ఇంటింటికీ వెళ్ళి కేవలం మాంసాన్నే బిచ్చమడగమని పంపించాడు.శంఖచూడుడు ఆలోచించినట్టుగానే దోసెడు మాంసం వంద బంగారు వరహాలైనా, ఆది వారం కాబట్టి, ఆ రోజు తినడం అలవాటు కాబట్టి, మధుడు కొన్నాడు. తల్లికి ఇచ్చి వండమన్నాడు. వండింది తల్లి. వండి, బైటికి వెళ్ళిన మధుడు కోసం చూస్తూ కూర్చుంది. అంతలో ఓ బిచ్చగత్తె వచ్చిందక్కడికి. మాంసాన్ని బిచ్చం అడిగింది.‘‘మాంసమే కావాలా? ఇంకేమీ అక్కర్లేదా?’’ అడిగింది మధుడి తల్లి.‘‘వేవిళ్ళు తల్లీ! అందుకే అడుగుతున్నాను.’’ అన్నది బిచ్చగత్తె.

జాలి పడిందామె. బిచ్చగత్తె బొచ్చెలో మాంసాన్ని వేసింది. మాంసాన్ని చీరకొంగులో దాచి, పరుగుదీస్తున్న బిచ్చగత్తెను ఇంటికి వస్తూ గమనించాడు మధుడు.‘‘కొంగులో ఏం దాస్తున్నావు, చూపించు.’’ అడిగాడు. చూపించిందామె. మాంసం. దొరికిపోయాననుకున్నాడు మధుడు. హఠాత్తుగా మాంసం ధర పెరిగినప్పుడే అనుమానం కలిగింది అతనికి. ఇప్పుడు ఈ బిచ్చగత్తెతో ఆ అనుమానం రెట్టింపు అయ్యింది. రాజు తక్కువవాడు కాదు, ఎలాగైనా దొంగను పట్టుకోవాలనుకుంటున్నాడని నిర్ధారణ చేసుకున్నాడు. బిచ్చగత్తె నోరు నొక్కి, ఆమెను ఎత్తుకెళ్ళి నూతిలో పడేశాడు. ఊపిరాడక మరణించిందామె. వందమంది బిచ్చగత్తెల్లో తొంబైతొమ్మిది రాజు సముఖానికి చేరుకున్నారు.

రానిది ఒక్కరే! ఎంత సమయం వేచి చూసినా రాలేదామె. పైగా నూతిలో పడి మరణించిందని తెలియవచ్చింది. అంతేగాక, నగరంలో మాంసాన్ని ఒకే ఒక్కరు కొనుగోలు చేశారు. ఆ ఒక్కరు ఎవరన్నదీ అంతు చిక్కలేదు. కళ్ళకు గంతలు కట్టుకుని మరీ ఆ వ్యక్తి మాంసాన్ని కొనుగోలు చేసినట్టుగా తెలిసింది.దొంగ ఎవరన్నదీ తెలియనీయక ఇంత తెలివిగా ప్రవర్తిస్తున్నది ఎవరు? తనని మించిన తెలివితేటలతో తనతో ఆటలాడుతున్నది ఎవరు? ఎవరైనాసరే, వారిని మెచ్చుకోక తప్పదనుకున్నాడు శంఖచూడుడు. అభినందించి తీరాలనుకున్నాడు. ప్రకటించాడిలా.మహారాజుకి దీటుగా ఆటలాడుతున్న వ్యక్తి ఎవరో తనంత తానుగా వచ్చి బయటపడితే, అతనికి పెళ్ళి కాకుంటే రాకుమారిని ఇచ్చి పెళ్ళి చేస్తాను.

ఒకవేళ పెళ్ళి అయితే లక్షలాది బంగారు వరహాలను బహుమతిగా ఇస్తాను.ప్రకటన వెలువడిన కాసేపటికే మధుడు, శంఖచూడుని ముందు నిలిచాడు.‘‘మీతో ఆటలాడిన వ్యక్తిని నేనే మహారాజా’’ అన్నాడు, చేతులు కట్టుకుని.‘‘నువ్వా’’ ఆశ్చర్యపోయాడు రాజు. మెచ్చుకోలుగా చూశాడతన్ని.‘‘నీకు పెళ్ళి అయిందా?’’ అడిగాడు.‘‘లేదు మహారాజా’’ అన్నాడు మధుడు.‘‘రాకుమారిని పెళ్ళి చేసుకుంటావా? బంగారు వరహాలు కావాలా?’’‘‘దొంగిలించిన వరహాలు ఇంట్లో ఉన్నాయి. రాకుమారే కావాలి.’’ అన్నాడు మధుడు.చేసిన ప్రకటన ప్రకారం, మధుడికి రాకుమారిని ఇచ్చి పెళ్ళి చేశాడు శంఖచూడుడు. రాజ్యం అంతటా పెద్ద ఎత్తున సంబరాలు జరిపాడు.