7.గురువు గారి కాలికి ముల్లు గుచ్చుకోవడం



గురువుగారు తరచు గ్రామాలకు తిరుగుతూ, తన కుటుంబానికీ, తన కుటుంబ సభ్యులుగా మెలుగుతున్న శిష్యబృందానికీ సరిపడా సంభారాలు సమకూర్చడంలో నిమగ్నమయ్యారు. దానిక్కారణం రానున్నది అసలే వర్షాకాలం. వాగులూ- వంకలూ పొంగిపొర్లి ప్రవహిస్తుంటాయి. చినుకు పడితే చాలు రహదార్లన్నీ చిత్తడినేలలుగా మారిపోతాయి. అడుగు తీసి అడుగేస్తే మోకాల్లోతు బురదలో దిగిపోవాల్సిందే! అందుకని ఆషాఢ మాసమంతా పరమానందయ్యగారీ సేకరణల పనిలోనే నిమగ్నమయ్యారు. పొరుగున ఉన్న కమలాపురాన్నుంచి ఓరోజు సాయంత్రం శిష్యులతో కలసి కనుచీకటి పడేవేళ ఇంటికి తిరిగొస్తుండగా ఆయన కాల్లో ముల్లు విరిగింది.

గురువుగారు అక్కడే చతికిలబడి "అబ్బా!... దీని సిగగొయ్య! ఈ ముల్లు ఇప్పుడే దిగాలా? ఓ పక్క పొద్దుపోతోంది. ఇంటికి చేరేవరకైనా ఆగొద్దా?" అంటూ ఆపసోపాలూ పడసాగారు. "అయితే గురువుగారూ! ఇంటికి చేరేవరకూ ఆగితే ముల్లు దిగినా ఫర్వాలేదంటారా?" అని ప్రశ్నించాడో శిష్యుడు.

"ఉష్! గురువుగారొక పక్క కాల్లో ముల్లుదిగి బాధపడుతుంటే, ఆయన్ని ఇప్పుడే సందేహాలడిగి చంపుతావా చవటా! ముందు ముల్లు తీసే మార్గం చూడవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది" అని గురువుగారి ప్రియ శిష్యుడు దేవభూతి అతడ్ని మందలించాడు. పరమానందయ్యగారు అలా చెప్పిన శిష్యుడివైపు ప్రశంసగా చూసేసరికి ప్రతి శిష్యుడూ గురువుగారి మెప్పు పొందాలని నేను ముల్లు తీస్తానంటే నేను ముల్లు తీస్తా.... అంటూ వాదులాడుకో సాగారు. సూదికోసం దుకాణానికి వెళ్ళారు. కోమటి సూదిని ఇచ్చాడు. ఏది చేసినా అంతా ఐకమత్యంగా చెయ్యాలని కదా గురువుగారు చెప్పారు. కనుక సూదిని అందరం కలహించు కోకుండా, కలసి పట్టుకు వెళ్ళాలి.

ఎలా? అంటే ఎలా? అని తలా ఓ ఉపాయం ఆలోచించారు. అందరిలోనికీ దివ్యభూతి ఉపాయమే బాగా ఉన్నదనిపించింది. దాని ప్రకారం దగ్గర్లో ఉన్న కర్రల దుకాణానికి వెళ్ళగా, అతడు పరమానందయ్య శిష్యులను గుర్తుపట్టి "అయ్యలూ! ఏం కావాలి?" అంటూ ఆప్యాయంగా పలకరించాడు. తీరా విషయం విన్నాక వాళ్ళ అతి తెలివి తేటలకి నిర్ఘాంతపోయి గురువుగారి పట్ల గౌరవం కొద్దీ అంతగా విలువ చెయ్యని తాటి దూలాన్ని ఒకదాన్ని తీసుకుపొమ్మన్నాడు.

అత్యంత జాగ్రత్తతో శిష్యులు ఆ దూలానికి సూది గుచ్చి, దాన్ని పదిమందీ మోసుకుంటూ తెచ్చి గురువు సన్నిధిన నిలబడ్డారు. పేరిందేవి కూడా వారి ఐకమత్యానికి మెచ్చి, రెండ్రోజులపాటు నీళ్ళు కాచుకోడానికి సరిపడ వంట చెరకు, తాటిదూలం రూపంలో మోసుకొచ్చిన శిష్యుల్ని ప్రశంసించింది. "ఐకమత్యం అంటే మీదేనర్రా" అంటూ ఇటు పరమానందయ్య కూడా ప్రశంసించే సరికి, ఇక వారి ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. అందరూ గురువుగారికి కాల్లో విరిగిన ముల్లు తీద్దామని పోటీ పడేవారే! చివరికి పరమానందయ్య గారి సలహా ప్రకారం వంతులు వేసుకుని ఒకరి తర్వాత ఒకరు సూది పుచ్చుకు గుచ్చడంతో, ముల్లు ఎప్పుడు బైటకు జారిపోయిందో తెలియదు గాని, గురువు గారికి ముల్లు గుచ్చుకున్న చోట అంగుళం మేర రంధ్రం పడి రక్తం కారసాగింది. దాంతో ఆయనకి ప్రత్యక్ష నరకం కనిపించిన. శిష్యులను కసురుకొని వారించారు. అప్పటికీ చివరి ఇద్దరికీ గురువుగారి పాదం కెలికే అవకాశం చేజారిపోయింది. "ఈసారి గురువు గారికి ముల్లు గుచ్చుకోదా? అప్పుడు మేమే ' ముందుగా ఆయన పాదం పని పట్టకపోతామా?" అని ప్రమాణం చేసి మరీ అక్కడ్నుంచి కదిలారు వాళ్ళు.