కలసి వుంటే కలదు సుఖం


యువరాజు చండుడు మహారాజుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, రాజ్యంలో బాణాసంచా కాలుస్తున్నారు. నృత్యాలు చేస్తున్నారు. గీతాలు ఆలపిస్తున్నారు. సభామండపం సంగతి చెప్పనవసరం లేదు. కిక్కిరిసి పోయి ఉంది. మంత్రి సామంతులూ, నగర ప్రముఖులూ చండుని రాకకోసం వేచి చూస్తున్నారు. మంగళవాద్యాలు మిన్ను ముట్టాయి. అత్తరు, పన్నీరు వర్షంలా కురిశాయి. చండుడు సభామండపంలోనికి ప్రవేశించాడు. ఆస్థాన పురోహితుడు మంత్రోచ్చారణ చేశాడు. శుభం పలికాడు. భగవద్గీతను చండునికి అందజేసి, పట్టుకుని ప్రమాణం చేయమన్నాడు. వల్లె వేయమన్నాడిలా.

శ్లో. అనన్యా శ్చింతయంతో మాం యేజనాః పర్యుపాసతే,
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌.

మరి ఏ ఇతర కోరికలూ లేక ఎవరైతే నన్నే శరణు వేడుతారో, నన్నే ఆరాధిస్తారో అలాంటి స్థిరచిత్తులైన వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను.పురోహితుడు చెప్పిన మాటలను చండుడు వల్లె వేయలేదు సరికదా, అతన్ని కోపంగా చూస్తూ అడిగాడిలా.‘‘ఈ మాటలు నేను నా ప్రజలకు చెబుతున్నట్టా? లేక గీతాచార్యుడు నాకు చెబుతున్నట్టా?’’‘‘తమరు ఎలా అర్థం చేసుకుంటే అలాగే మహారాజా’’ అన్నాడు పురోహితుడు.‘‘అర్థం పర్థం లేని ఇలాంటి ప్రవచనాల మీద ప్రమాణం చెయ్యడం నాకిష్టం లేదు. నేను చెయ్యను.’’ అన్నాడు చండుడు.‘‘చేయనంటే... తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ఇది. ప్రమాణం చేసిన తర్వాతనే కిరీట ధారణ చేయాలి.’’ చెప్పలేక చెప్పలేక చెప్పాడు పురోహితుడు.‘‘ఆపండి మీ ప్రేలాపనలు.’’ అన్నాడు చండుడు.

భగవద్గీతను పురోహితుని మీదికి విసిరికొట్టాడు. పురోహితుడు చేతులు జాచి అందుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే గీత నేలపాలయ్యేది.‘‘కిరీటధారణ చేయండి, అవతల వేటకు వేళ అయింది.’’ ఆదేశించాడు చండుడు. చేసేది లేక పురోహితుడు చండునికి కిరీటం పెట్టాడు. పెట్టి,‘మహారాజు చండునికీ’ అని గట్టిగా అరిచాడు. తప్పనిసరై జేజేలు పలికారు ప్రజలు. ఆనందించాడు చండుడు. గుర్రాన్ని అధిరోహించి వేటకు బయల్దేరాడు. అతన్ని అనుసరించారు భటులు.

అంతా నగర పొలిమేరలు దాటారు. అడవిలోనికి ప్రవేశించారు. ఎక్కడా ఒక్క మృగం కూడా కనిపించలేదు చండునికి. వేటాడితేనేగాని, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకూడదనుకుని, వేయి కళ్ళతో వెదకసాగాడు. బంగారులేడి కనిపించిందతనికి. ఆశ్చర్యపోయాడు. బంగారులేడి ప్రస్తావన పురాణాల్లో ఉన్నట్టుగా విన్నాడు. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనుకున్నాడు దానిని. లేడిని వేటాడి తీరాల్సిందే అనుకున్నాడు. వెంట పడ్డాడు. లేడి అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి, చండుణ్ణి ముప్పు తిప్పలు పెట్టింది. లేడిని అనుసరిస్తూ పరుగుదీయడంలో భటులకు దూరమయ్యాడు చండుడు. వారికి కనిపించకుండాపోయాడు. పరిగెత్తి పరిగెత్తి నదీతీరానికి చేరుకున్నది లేడి. చండుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. అతన్ని చూసి, లేడి నదిలోనికి ప్రవేశించి, అవతలి గట్టుకు చేరుకుంది. అక్కణ్ణుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ, తీగల్లో చిక్కుకుని, బిక్కు బిక్కుమంటూ అటు ఇటు చూడసాగింది.

‘‘చిక్కింది లేడి’’ అనుకున్నాడు చండుడు. గుర్రాన్ని దిగాడు. నది దాటి అవతలి ఒడ్డుకు చేరుకోవాలి. ధరించిన రాచదుస్తులతో ఈదడం అసాధ్యం. కాబట్టి, దుస్తులు విడిచి, ఏదేని పీలిక కట్టుకుని అవతలి ఒడ్డుకు చేరుకోవాలనుకున్నాడు. చుట్టూ చూశాడు. గుడ్డపీలిక ఒకటి, ఒడ్డున ఉన్న చెట్టుకి వేలాడుతూ కనిపించింది. తీసుకున్నాడు దాన్ని. ధరించిన దుస్తులు విడిచి, పీలిక ధరించాడు. విడిచిన దుస్తుల్ని జాగ్రత్తగా చెట్టుకొమ్మకు తగిలించి, కత్తిని నోట కరిచి, నదిలోనికి దిగాడు. లేడిని గమనిస్తూ నీటిలో ఈద సాగాడు. గట్టుకి చేరుకున్నాడు. కారుతున్న నీటిని తుడుచుకుని, నోటిలోని కత్తిని చేతిలోకి తీసుకునే ప్రయత్నంలో చూపు మరల్చాడు. అంతే! మళ్ళీ చూసేసరికి, అంత వరకూ కనిపించిన చోట లేడి కనిపించలేదు. పరుగుదీశాడు చండుడు. ఆ పొదా, ఈ పొదా గాలించాడు. ఎక్కడా లేదు లేడి. ఏమై పోయింది? ఎక్కడ ఉంది? అనుకుంటూ అడ్డు తగిలిన తీగలనూ, చెట్లకొమ్మలనూ నరుక్కుంటూ వస్తున్న చండునికి, ఓ చెట్టు దగ్గర బంగారులేడి కనిపించింది. అయితే లేడికి లేడి ముఖం లేదిప్పుడు, మనిషి ముఖం ఉంది.

మహా తేజోవంతంగా ఉంది ఆ ముఖం. కాళ్ళూ చేతులూ ఆడలేదు చండునికి. చూస్తూ నిల్చున్నాడు. కాస్సేపటికి తేరుకుని అడిగాడు.‘‘ఎవరు నువ్వు?’’‘‘నన్ను గీతాచార్యుడు అంటారు.’’‘‘నువ్వా? ఈ రూపంలో ఎందుకు ప్రత్యక్షమయ్యావు?’’‘‘నీకు బుద్ధి చెబుదామని.’’‘‘బుద్ధా? నాకా?’’‘‘అవును, నీకే! రాజుకి బుద్ధి చెబితే ప్రజలకు చెప్పినట్టవుతుంది. అందుకని, నీకు బుద్ధి చెప్పేందుకే ఈ అవతారం ఎత్తాను’’ అన్నాడు గీతాచార్యుడు. ‘‘లేడి శరీరం, మనిషి తల, నువ్వేం నాకు బుద్ధి చెబుతావుగాని, ఇక నా నుంచి తప్పించుకోలేవు, కాచుకో’’ అని కత్తి ఎత్తాడు చండుడు. ఎత్తిన కత్తి ఎత్తినట్టుగానే ఉండిపోయింది. కిందకి దిగలేదు. ఈలోపు లేడి పరుగు పరుగున వెళ్ళి నదిలోనికి దిగింది. ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంది.

చెట్టునున్న చండుని దుస్తులు తీసుకుని ధరించింది. అచ్చు చండునిలాగే తయారయ్యింది. గుర్రాన్ని ఎక్కి వెళ్ళిపోయిందక్కణ్ణుంచి. ఇవతలి గట్టు మీద నుంచి అంతా ఆశ్చర్యంగా ఆందోళనగా చూడసాగాడు చండుడు. పరుగుతీద్దామంటే పరిగెత్తలేకపోయాడు. ఉండిపోయాడక్కడే! చండుడు రూపంలో ఉన్న గీతాచార్యుణ్ణి, చండుడు అనుకున్నారు భటులు. అతన్ని అనుసరించారు. అంతా వెను తిరిగారు. రాజధానికి చేరుకున్నారు.సూర్యాస్తమయం అయింది. ఏం చెయ్యాలో పాలుపోక నది ఒడ్డున చిన్న గుడ్డపీలికతో, చేతిలో కత్తితో కూర్చున్నాడు చండుడు. బాధగా ఉంది అతనికి. ఏడుపు వస్తోంది. అదే సమయంలో కట్టెలమోపును శక్తి కొలదీ లాగుతూ అటుగా రాసాగాడు ఓ రైతు. మోపు చాలా పెద్దది. మోసేందుకు బలం చాలదతనికి. అందుకని లాక్కొస్తున్నాడు.

చేతిలో కత్తితో కన్నీరుపెట్టుకుంటున్న చండుణ్ణి చూశాడతను. బలంగా ఉన్నాడు. మోపు మోయగలడనుకున్నాడు.‘‘ఇదిగో’’ కేకేశాడు.‘‘ఏంటి’’ అడిగాడు చండుడు.‘‘ఊరకనే అలా కూర్చునే బదులు ఈ కట్టెలమోపు మోయ్యకూడదూ, నీకు కాణో పరకో ఇస్తాను. పాతబట్టలు కూడా ఇంట్లో ఉన్నాయి. ఒకటో రెండో అవి కూడా ఇప్పిస్తాను’’ అన్నాడు రైతు.‘‘నేనెవరో తెలుసా?’’‘‘తెలీదు’’ ‘‘చండుణ్ణి! మహారాజుని.’’‘‘పిచ్చెక్కిందా? ఏంటా మాటలు? ఎవరైనా వింటే తొక్క తీస్తారు.’’ అన్నాడు రైతు.‘‘నేను చెబుతున్నది నిజం, నా పేరు చండుడు, నేను మహారాజుని.’’ఆ మాటలకు బలే కోపం వచ్చింది రైతుకి. వెళ్ళి చాచిపెట్టి చండుణ్ణి కొట్టాడు. కత్తి దూయబోయాడు చండుడు.‘‘సిగ్గు లేదూ, తిన్న దెబ్బ చాలదా? హత్యానేరం కూడా పైన వేసుకుంటావా?’’ అడిగాడు రైతు.‘‘ఈ గుడ్డపీలికా, నువ్వూ...చూస్తోంటే జాలేస్తోంది, పద’’ అన్నాడు రైతు. చండుడి భుజం మీద కట్టెలమోపు ఉంచి, బయల్దేరదీశాడతన్ని. ఆకలీ, అంతుచిక్కని పరిస్థితీ, దానాదీనా ఎదురు చెప్పలేదు చండుడు. రైతుసహా ముందుకు నడిచాడు.రాత్రి అయింది. రైతు పెట్టిన కూడు తిన్నాడు చండుడు.

ఇచ్చిన బట్టలు కట్టుకున్నాడు. వస్తున్న నిద్రను ఆపుకుని, రాజధానికి పరుగుదీశాడు. అంతః పురానికి చేరుకున్నాడు. కాపలాగా ఉన్న భటులను పట్టించుకోక, అంతఃపుర ప్రవేశం చేయబోయాడు. భటులు వెనక్కి లాగి, రాదారి మీదికి తోసేశారతన్ని.‘‘ఏంటా సాహసం, ఛస్తావు, పో ఇక్కణ్ణుంచి.’’ అన్నారు.‘‘నేను మహారాజు చండుణ్ణి.’’ గట్టిగా అరిచాడు. ఆ మాట కోటలోని రాజుగారికి ఎక్కడ వినవచ్చిందేమోనని, అటుగాచూసి, ఏ అలికిడీ కనిపించకపోవ డంతో బతికామనుకున్నారు భటులు. చండుణ్ణి చావబాదారు తర్వాత.‘‘పో ఇక్కణ్ణుంచి.’’ అన్నారు. జాలిపడి పంపేశారక్కణ్ణుంచి. ఏడుస్తూ నడచి నడచి, అలసిపోయాడు చండుడు. నిద్ర ముంచుకొస్తోంటే ఆ రాత్రి ఓ ఇంటి అరుగు మీద పడుకున్నాడు. తెల్లారింది. అరుగు మీద పడుకున్న అనామకుణ్ణి చూసి, ఆ ఇంటి ఇల్లాలు భయపడింది. చేతిలో ఉన్న పేడనీళ్ళు ముఖం మీద కొడదామనుకున్నది. అంతలో మేల్కొని చేతులు జోడించాడు చండుడు. జాలి చెంది, ఆ ప్రయత్నాన్ని మానుకున్నదామె. ఇంత చద్దిబువ్వ పెట్టింది. తిని కూర్చున్నాడక్కడే! పిల్లలు ఆడు కుంటూ, తమనే నవ్వుతూ చూస్తున్న చండుణ్ణి పిచ్చివాడనుకున్నారు. అతని మీద రాళ్ళు రువ్వారు. వచ్చి పడుతున్న రాళ్ళను తప్పించుకుని, ఓ మూలగా నక్కి కూర్చున్నాడు చండుడు. అంతలో రాచఠీవిలో చండుడి రూపంలో మహారాజుగా ఉన్న గీతాచార్యుడు గుర్రం మీద అటుగా ఊరేగింపుగా వచ్చాడు. రాజుని చూసి పిల్లలుసహా చేతులు జోడించి నమస్కరించారతనికి. అసలు చండుడు అది తట్టుకోలేకపోయాడు. బోరుమన్నాడు. ఎంతకాలం ఇలా ఏడుస్తూ కూర్చుంటాను? ఏడుస్తూ కూర్చుంటే తిండి ఎవరు పెడతారు? అయి పోయిందేదో అయిపోయింది. పోయిన రాచరికం తిరిగి రాదు. ఏదో ఒకటి పని చూసుకోవాలనుకున్నాడు చండుడు. అనేక పనులు చేయసాగాడు. అలవాటు లేని పని, కాయకష్టం చేసుకుని బతకసాగాడు. తప్పు చేసిన రోజు, తన్నులు తిన్నప్పుడు, ఈ కష్టాలకి మూలం పొగరు.

పట్టాభిషేకం రోజున అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అనుకునేవాడు. నిజమే! మరే ఇతర కోరికలూ లేక ఎవరైతే భగవంతుణ్ణే శరణు వేడుతారో, అతన్నే ఆరాధిస్తారో అలాంటి స్థిరచిత్తులైన వారి యోగక్షేమాలను భగవంతుడే చూసుకుంటాడనుకున్నాడు.రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి.చండుణ్ణి గుడ్డి బిచ్చగాళ్ళు చేరదీశారు. భిక్షాటనలో బిచ్చగాళ్ళకు సహకరించడం, వారికి రాత్రీపగలూ ఇంత తిండి వండి పెట్టడం చండుని పని అయింది. తన పేరు చండుడనీ, తాను మహారాజుననీ మరచిపోయాడతను.ఒకనాడు దండోరా వినవచ్చింది. వారం రోజులపాటు రాజమందిరంలో బిచ్చగాళ్ళకు మాత్రమే విందు ఏర్పాటు చేస్తున్నారు.

విందు అనంతరం రాజుని ఏకాంతంలో కలసి, కష్టసుఖాలు వెళ్ళబోసుకోవచ్చు. బిచ్చగాళ్ళతో పాటు చండుడు కూడా అంతఃపురంలో వరసలో నిల్చున్నాడు. అంతఃపురాన్ని వింతగా చూస్తున్న అందరితోపాటు అతనూ చూడసాగాడు. అందులో అణువణువూ అతనికి తెలుసు. తెలియనిది లేదు. అయితే అంతఃపురానికే తానెవరో తెలియదనుకున్నాడు చండుడు. కళ్ళు చెమర్చుకున్నాడు. విందు అయిపోయింది. రాజుని ఏకాం తంలో కలిసే అవకాశం వచ్చింది. చండుని వంతు వచ్చింది. కలుద్దామా? వద్దా? మీమాంసలో పడ్డా డతను. ఆ మీమాంసలో ఉంటూండగానే భటులు అతన్ని రాజు ముందు ప్రవేశపెట్టి, వెళ్ళిపోయారు.‘‘నువ్వు నిజంగా బిచ్చగాడివేనా?’’ అడిగాడు రాజు. (చండుడి రూపంలో ఉన్న గీతాచార్యుడు)‘‘కాదు మహారాజా! గర్వంతో భగవంతుణ్ణి ఎదిరించి, బీదరికాన్ని కొని తెచ్చుకున్నవాణ్ణి. గుడ్డి బిచ్చగాళ్ళకు వండిపెడుతూ ఇలా బతుకుతున్న వాణ్ణి.’’‘‘నీలో చాలా మార్పు వచ్చింది.

పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు. నీ సింహాసనం నీకిచ్చేస్తాను, తీసుకో.’’‘‘వద్దు మహారాజా! గర్విష్ఠులూ, పొగరుబోతులూ రాజులు కాకూడదు. సర్యాంతర్యామి, సర్వేశ్వరుడే అందరికీ రాజు. ఈ సంగతి తెలుసుకున్న వివేకులే రాజులు కావాలి. ఈ ప్రపంచానికి ఆ జగద్రక్షకుడే మహారాజు. అతన్నే నేను నమ్ముకున్నాను, నా యోగక్షేమాలు అతనే చూసుకుంటున్నాడు. అంధులను జాగ్రత్తగా చూసుకోమని ఆదేశించాడు. చూసుకుంటున్నాను, ఇప్పుడు రాజునైతే వారినెవరు చూసుకుంటారు? వారికి ఎవరు దిక్కు?’’ ‘‘నేను! నా మీది నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యను.’’ అన్నాడు గీతాచార్యుడు.‘‘మహారాజా’’ ఆశ్చర్యపోయాడు చండుడు. చేతులు జోడించి, అతని పాదాలను ఆశ్రయించాడు. భుజాలు పట్టుకుని, నవ్వుతూ చండుణ్ణి పైకి లేపాడు గీతాచార్యుడు. తన శిరసు మీది కిరీటాన్ని తొలగించి, చండుడి తలపై దాన్ని అలంకరించాడు. అతని దుస్తులు కూడా మార్చి వేశాడు. శుభం అన్నాడు. అదృశ్యమైపోయాడు. భటులు వచ్చారు. ఎటువంటి మార్పునూ వారక్కడ గమనించలేకపోయారు. చండుడు మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంతా దైవలీల అనుకున్నాడు.