గుణపాఠం


పాతపట్నం రాజు పురంజనుడికి ఉన్నట్టుండి, ఒక ఆలోచన తట్టింది. సభలో మంత్రి సామంతులు. పౌర ప్రముఖుల ముందు దానిని ఇలా ప్రకటించాడు.‘‘రాజ్యంలో ఎవరైనా సరే మంచి అబద్ధం చెప్పగలిగితే ఆ అబద్ధానికి కూర్చున్న వ్యక్తి వెంటనే లేచి నిల్చోగలగాలి. అలాగే నిద్రిస్తున్న వ్యక్తి మేల్కొనగలగాలి. అలా చేయగలిగితే నా సింహాసనం వారిదే! అంటే ఈ రాజ్యం వారి సొంతం అవుతుంది.’’ అన్నాడు.‘‘ఆట ఎలా ఉంది?’’ అడిగాడు.‘‘బాగు బాగు’’ అన్నారు సభలోని వారంతా. రాజుగారి ఆలోచనకూ, ఆట తీరుకూ కరతాళ ధ్వనులు చేశారు.‘‘ఈ విషయాన్ని వెంటనే దండోరా వేయించండి. అబద్ధాలు చెప్పగలిగే మహామహులకు ఇదే మా ఆహ్వానం అని ప్రకటించండి.’’ అన్నాడు పురంజనుడు.

రాజుగారి ఆదేశాన్ని పాలించారు సేవకులు. పాతపట్నంలోనే కాదు, పక్క పట్నంలోనూ రాజుగారు చెప్పినట్టుగానే దండోరా వేశారు.మర్నాడు నుంచీ అబద్ధాలు చెప్పేందుకు తండోపతండాలుగా జనం రాసాగారు. వారు చెప్పిన ఏ ఒక్క అబద్దానికీ కూర్చున్న వ్యక్తులు నిల్చోలేదు. సమీపంలో నిద్రిస్తున్న వ్యక్తులు మేల్కొన లేదు. నవ్వుల పాలయి వెళ్ళిపోయారంతా. తెల్లారితే చాలు, వచ్చే జనం, పోయే జనం. ఏ ఒక్కరి అబద్ధమూ అతికినట్టుగా ఉండడం లేదు. పైగా సభ అంతా గందరగోళంగా తయారయింది. వచ్చే జనాన్ని నిలువరించాలనుకున్నారు రాజోద్యోగులు. రాజుగారి అంగీకారం మేరకు ప్రకటన మార్చి ఇలా దండోరా వేశారు.

‘‘రాజ్యంలో ఎవరైనా సరే మంచి అబద్ధం చెప్పగలిగితే ఆ అబద్ధానికి కూర్చున్న వ్యక్తి వెంటనే లేచి నిల్చోగలగాలి. అలాగే నిద్రిస్తున్న వ్యక్తి మేల్కొనగలగాలి. అలా చేయగలిగితే రాజుగారి సింహాసనం వారిదే! అంటే ఈ రాజ్యం వారి సొంతం అవుతుంది. లేని పక్షంలో అబద్ధం చెప్పిన వ్యక్తి తల తెగి నేల రాలుతుంది.’’జనం భయపడ్డారు. సభకు రావడం మానుకున్నారు. ప్రాణాలతో చెలగాటం దేనికని ఊరు కున్నారు. పొద్దున నుంచి రాత్రి వరకూ వేచి చూసినా ప్రాణాలకు తెగించి ఏ ఒక్కరూ రాకపోవడంతో పురంజనుడికి పిచ్చెక్కినట్టయింది.‘‘సభంతా ఖాళీగా ఉంటోంది. ఊసుపోవట్లేదు. మార్చిన ప్రకటన మనసుకి ఊరట కలిగించట్లేదు సరికదా, బాధపెడుతోంది.’’ అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. అంతలో ఎవరో వచ్చినట్టయింది. కళ్ళు తెరిచి చూశాడు. దర్జీ కనిపించాడతనికి.

ఆస్థానంలో పని చేస్తున్న దర్జీనే! అందుకే వెంటనే గుర్తుపట్టాడు రాజు. ‘‘అబద్ధం చెప్పడానికి వచ్చావా?’’ అడిగాడు పురంజనుడు.‘‘అవును మహారాజా’’ అన్నాడు దర్జీ.‘‘ఏదీ చెప్పు’’‘‘మొన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి స్వర్గం చిరిగి, వేలాడుతోంటే నేను వెళ్ళి, నా తలలోని పేను కండరాలతో, దానిని కుట్టి సరి చేశాను మహారాజా.’’ అన్నాడు దర్జీ. ఆత్రంగా చుట్టూ చూశాడు. అతని అబద్ధానికి లేచి ఏ ఒక్కరూ నిల్చోలేదు.

మేల్కొనలేదు.‘‘సరిగ్గా నువ్వు కుట్టలేదేమో! నిన్న పొద్దున కురిసిన వర్షానికీ మళ్ళీ స్వర్గం చిరిగి వేలాడడం నేను చూశాను.’’ అన్నాడు పురంజనుడు. పగలబడి నవ్వాడు.అయిపోయింది. తల తెగిపోయిందనుకున్నాడు దర్జీ. భటులు వచ్చి పట్టుకుంటే భయంతో వణికిపోయాడు.‘‘అబద్ధం బాగుంది. నేను ఆనందించాను. అందుకు ప్రతిఫలంగా దర్జీ తల తీయకండి. వదిలి వేయండి.’’ అన్నాడు పురంజనుడు. వదిలేశారు భటులు. బతికాననుకుని పరుగుదీశాడు దర్జీ. అతని పరుగు చూసి మరింతగా నవ్వాడు రాజు.మర్నాడు ఓ పశువుల కాపరి వచ్చాడు. పురంజనుడి ముందు నిల్చున్నాడు.‘‘ప్రాణాలకు తెగించి, అబద్ధం చెప్పడానికి వచ్చావు, అవునా?’’ ‘‘అవును మహారాజా’’‘‘అబద్ధం మంచిదై, మేము ప్రకటించినట్టుగా జరిగితే ఈ రాజ్యం నీదవుతుంది. కనీసం అబద్ధం బాగుంటే బతికి బట్టకడతావు. అటు మంచిదీగాక, ఇటూ బాగోలేని పక్షంలో నీ తల తెగి నేల రాలుతుంది. ఆలోచించుకో.’’ అన్నాడు పురంజనుడు.‘‘దేనికైనా సిద్ధం మహారాజా’’ అన్నాడు పశువుల కాపరి.

అతని తెగింపు నచ్చింది రాజుకి. బళి అన్నట్టుగా చూశాడతన్ని.‘‘చెప్పు మరి’’ అన్నాడు.‘‘మా నాన్న రోగిష్టి. గట్టిగా ఊదితే పడిపోతాడనిపిస్తుంది. అలాంటి వ్యక్తి మొన్న నా చేతిలోని కొరడా తీసుకుని, ఆకాశంలో ఝళిపించేసరికి గుప్పెడు నక్షత్రాలు కిందపడిపోయాయి.’’ అన్నాడు. సమీపంలో నిద్రిస్తున్న వాళ్ళని ఆశగా చూశాడు. మేల్కొనలేదెవరూ. అలాగే ఎవరైనా లేచి నిల్చున్నారేమోనని అటూ ఇటూ చూశాడు. లేదు.‘‘సెలవు మహారాజా’’ అని అక్కడ నిలువెత్తు శూలాలతో నిల్చున్న భటుల దగ్గరగా నడవసాగాడు. ఆగు అన్నాడు పురంజనుడు. ఆగాడు పశువుల కాపరి. అతనితో అన్నాడిలా రాజు.‘‘మొన్నటి సంగతి నువ్వు చెప్పావు. నిన్న ఝళిపించి చూడాల్సింది. ఒక్కనక్షత్రం కూడా పడేది కాదు. ఎందుకంటే...మా నాన్న కూడా మీ నాన్నలాగే రోగిష్టి. అయినా పొగతాగడాన్ని మానుకోలేకపోతున్నాడు. మొన్న నక్షత్రాలు పడిపోవడాన్ని చూశాడేమో! నిన్న ఆకాశంలోకి పొగను గట్టిగా ఊదాడు. ఆ పొగ జిగురులా మారిపోయింది. నక్షత్రాలను పడిపోకుండా పట్టి ఉంచింది. ఇక ఇప్పుడు పడవు.’’ అన్నాడు రాజు. దెబ్బకు దెబ్బ ఎలా ఉంది అన్నట్టుగా కళ్ళెగరేశాడు. సమాధానంగా తల వంచుకున్నాడు పశువుల కాపరి.

‘అబద్ధం బాగుంది. నచ్చింది నాకు. బతికావు పో.’’ అన్నాడు పురంజనుడు. చేతులు జోడించి, రాజుకి నమస్కరించి వెళ్ళిపోయాడు పశువుల కాపరి.రాజ్యంలో ఎక్కడ చూసినా అబద్ధాల గోలే! ఏ నోట విన్నా అబద్ధాలే! పౌరులకి పనీపాటా లేకుండా పోయాయి. అన్ని రంగాల్లోనూ ఉత్పత్తి ఆగిపోయింది. రాజ్యం సంక్షోభంలో పడిపోతోంది. గమనించాడది రాజగురువు వదాన్యుడు. పురంజనుడికి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు. భార్యను నీళ్ళబిందె అడిగాడు.‘‘అది ఎందుకండీ మీకు?’’ అడిగిందామె.‘‘రాజును అడిగి దాని నిండా బంగారు వరహాలు తీసుకొస్తాను.’’ అన్నాడు వదాన్యుడు.

‘‘బంగారు వరహాలేం ఖర్మ? మంచి అబద్ధం చెప్పి, రాజ్యాన్నే కైవసం చేసుకోండి. ఆ పురంజనుడి పీడ విరగడవుతుంది. లేకపోతే ఈ అబ ద్ధాల ఆటలేంటి? ప్రజలతో రాజు ఆడాల్సిన ఆట లేనా ఇవి? రాజ్యం సర్వనాశనం చేస్తున్నాడు.’’ అన్నది భార్య.మధ్యతరగతి స్త్రీల ప్రతినిథిగా తన భార్య మాట్లాడుతున్నదని గ్రహించాడు వదాన్యుడు. ఆమె అంతరాత్మను అర్థం చేసుకున్నాడతను. ఇక ఆలస్యం కూడదనుకున్నాడు. బిందె కావాలన్నాడు మళ్ళీ. తీసుకుని వచ్చి, ఇచ్చిందామె. అందుకుని, రాజాస్థానానికి బయల్దేరాడు వదాన్యుడు.ఆస్థానం కళకళలాడుతోంది. అబద్ధాలు చెప్పేందుకు ఎవరు వస్తారా? అని ఎదురు చూస్తున్నారంతా. ఆ సమయంలో బిందె పట్టుకుని ప్రవేశించాడక్కడికి వదాన్యుడు.

‘‘రాజగురువు! రాజగురువు’’ అంటూ లేచి నిలబడబోయారంతా. వారించాడు వారిని వదాన్యుడు. కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. కూర్చున్నారు.తననీ కూర్చోమన్నట్టుగానే భావించి, కాస్తంత ముందుకు జరిగి సింహాసనంలో కూర్చున్నాడు పురంజనుడు.‘‘గురుదేవులు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా?’’ అడిగాడు.‘‘నా బాకీ తీర్చమని అడగడానికి వచ్చాను.’’ అన్నాడు వదాన్యుడు.‘‘బాకీనా’’‘‘అవును మహారాజా! గతవారం మీరు నా దగ్గర ఈ బిందెతో బంగారు వరహాలు తీసుకున్నారు. మర్నాడు ఇస్తానన్నారు. ఇవ్వలేదు. వారం గడిచినా ఇవ్వకపోవడంతో తప్పనిసరై సభలో అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది.’’‘‘ఏం మాట్లాడుతున్నారు గురుదేవా?’’ గట్టిగా అరుస్తూ దిగ్గున సింహాసనం మీద నుంచి లేచి నిల్చున్నాడు పురంజనుడు. అతనితో పాటుగా సభలోని వారంతా ఆందోళనగా లేచి నిల్చున్నారు. రాజు అరుపునకు సమీపంలో నిద్రపోతున్న మహారాణి మేల్కొంది. గాబరాగా పరుగుదీసి, సభామండపానికి వచ్చింది.

‘ఏమైంది స్వామీ? ఎందుకు అంత గట్టిగా అరిచారు?’’ రాజుని అడిగిందామె.‘‘గురుదేవులకి నేను ఆ బిందెడు బంగారు వరహాలు బాకీ పడ్డానట! అబద్ధం ఆడుతున్నారు.’’ అన్నాడు పురంజనుడు.‘‘లేదు మహారాజా! నేను నిజమే చెబుతున్నాను.’’‘‘కాదు, పచ్చి అబద్ధం ఆడుతున్నారు.’’‘‘సరే! నాది పచ్చి అబద్ధం అయిన పక్షంలో మీరు ప్రకటించినట్టుగానే నా అబద్ధానికి మీరే కాదు, సభలోని వారంతా లేచి నిల్చున్నారు. నిద్రిస్తున్న మహారాణి మేల్కొనడమే కాదు, సభామండపానికి పరిగెత్తుకుని వచ్చారు. అంటే నేను గెలిచినట్టే! ఇక ఆలస్యం అనవసరం. సింహాసనాన్ని నాకు అప్పగించి, రాజ్యాన్ని వదలి వెళ్ళండి.’’ అన్నాడు వదాన్యుడు.పురంజనుడి తల గిర్రున తిరిగింది. తూళిపడబోయాడు. సింహాసనాన్ని పట్టుకుని నిల్చున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? సింహాసనం కావాలంటే, గురుదేవులకు బిందెడు బంగారు వరహాలు ఇచ్చుకోవాలి. బాకీపడ్డానని ఒప్పుకోవాలి. కాదంటే...సింహాసనాన్ని వదులుకోవాలి. తనకి గుణపాఠం చెప్పేందుకే గురుదేవులు ఇలా ఆలో చన చేశారనుకున్నాడు పురంజనుడు. తననే అబద్ధాలకోరుని చేశారనుకున్నాడు.

తప్పు తెలుసు కున్నాడు. చేతులు జోడించి, వదాన్యుడికి నమ స్కరించాడు. ‘‘బంగారు వరహాలు మీకు బాకీ పడ్డ మాట వాస్తవం. మీరు బిందెడు బంగారు వరహాలు స్వీకరించండి.’’ అన్నాడు. వదాన్యుడికి బిందెడు బంగారు వరహాలు సమర్పించాడు.‘‘ఈ బంగారాన్ని మీ దగ్గరే ఉంచండి మహారాజా! రాజ్యాభివృద్ధికి వినియోగించండి. అయితే ఇంత బంగారాన్ని రాజ్యానికి సమర్పించిన వదాన్యునిగా నాదో చిన్న కోరిక.’’‘‘చెప్పండి గురుదేవా?’’‘‘పౌరులను అబద్ధాలు చెప్పమనడం, వారికి రాజ్యాన్ని ఇస్తాననడం... ఇలాంటి ఆటలు కట్టి పెట్టండి. అల్లకల్లోలమవుతున్న రాజ్యాన్ని ఓ గాడిలో పెట్టండి.’’ అన్నాడు వదాన్యుడు.‘‘మీ ఆదేశాన్ని మన్నిస్తున్నాం.’’ అన్నాడు పురంజనుడు. ఆనాటితో అబద్ధాల ఆటకి మంగళం పలికాడు.