అర్థనారీశ్వర రూపం



శివుడి అర్థనారీశ్వర రూపంపై చాలా మందికి సందేహం కలుగుతుంది. అయితే దీని గురించి వేదాల్లో స్పష్టంగా వివరించారు. సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మ చేసిన మానసిక సృష్టి విస్తరించకపోవడంతో ఆయనకు తీవ్ర నిరాశకు గురయ్యాడు. అప్పుడు మైథునీ సృష్టి చేయమని ఆకాశవాణి బ్రహ్మను ఆఙ్ఞాపించింది. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు మైథునీ సృష్టికి ప్రయత్నించినా ఎంతకు స్త్రీ జనోత్పత్తి కాకపోవడంతో మళ్లీ విఫలమయ్యాడు.

శివుడి అనుగ్రహం లేకపోతే స్త్రీ సృష్టి జరగదు కాబట్టి మహాదేవుని ప్రసన్నం చేసుకోడానికి బ్రహ్మ కఠోర తపస్సు చేశాడు. అలా చాలా ఏళ్లు తీవ్ర తపస్సు చేయడంతో ప్రసన్నుడైన ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. ఆది దేవుని దివ్య స్వరూపాన్ని సందర్శించిన బ్రహ్మ పరమానందభరితుడై సాష్టాంగ ప్రణామం చేశాడు.

వత్సా! నీ మనోరథం నాకు అవగతమైంది. సృష్టి వర్థిల్లాలన్న సంకల్పంతో నీవు చేసిన కఠోర తపస్సుకు మెచ్చాను...నీ కోరిక నెరవేరుతుందని చెప్పి శివుడు తన శరీరం నుంచి ఉమాదేవిని వేరు చేశాడు. ఆ తర్వాత శంకరుడి అర్ధాంగం నుంచి వేరుపడిన ఆది పరాశక్తి అమ్మకు బ్రహ్మదేవుడు సాష్టాంగప్రణామం చేస్తూ ఇలా అన్నాడు.సృష్టి ఆరంభంలో నీ ప్రాణనాథుడైన ఆది దేవుడు నన్ను సృజించాడు...ఆయన ఆదేశానుసారమే సమస్త దేవతాది మానసిక సృష్టి చేశాను.

అనేక ప్రయాసల తర్వాత కూడా ఆ సృష్టిని వర్థిల్లింపజేయడంలో నేను విఫలమయ్యాను. కాబట్టి ఇప్పుడు స్త్రీ పురుష సమాగమం ద్వారా నేను ప్రజోత్పత్తి చేసి సృష్టిని మరింత విస్తరింపజేస్తాను. కానీ ఇంత వరకూ స్త్రీని సృష్టించడం కుదరలేదు. నారీ లోకాన్ని సృష్టించడం నా శక్తికి అతీతంగా ఉంది.తల్లీ! నీవు సంపూర్ణ సృష్టికీ, శక్తులకూ ఉద్గమస్థానానివి.హే మాతా! నాకు నారీకుల సృష్టిని చేసే శక్తిని ప్రసాదించమని మరోసారి నిన్ను ప్రార్థిస్తున్నాను. చరాచర సృష్టి వర్థనార్థం, నా పుత్రుడైన దక్షునికి కుమార్తెగా అవతరించి నాపై దయ చూపుమని బ్రహ్మ అర్ధించాడు. బ్రహ్మ ప్రార్థన ఆలకించిన శివాని తథాస్తు అంటూ అతడికి స్త్రీని సృష్టించే శక్తిని ప్రసాదించింది.

లక్ష్య సాధనకు తన భృకుటి మధ్యభాగం నుంచి తనతో సమానమైన ఓ శక్తిని ప్రసరించింది. ఆ దివ్య తేజోరూపాన్ని తిలకించి శివుడు చిరునవ్వుతో దేవీ! బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు. నీవు అతనిని అనుగ్రహించి మనోభీష్టాన్ని నెరవేర్చు అని పలికాడు.పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించిన జగన్మాత బ్రహ్మ కోరిక ప్రకారం దక్షపుత్రిక అయింది. అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అనుగ్రహించి శివాని మహాదేవుని శరీరంలో ప్రవేశించింది. తర్వాత మహాదేవుడు కూడా అంతర్థానమయ్యాడు. ఆ నాటి నుంచే ఈ లోకంలో స్త్రీ సృష్టి కొనసాగింది.

తన మనోరథంలోని కొర్కె నెరవేరడంతో బ్రహ్మ ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా సృష్టిని విస్తరింపజేశాడు.అలా శివ- శక్తి పరస్పరాభిన్నులై సృష్టికి మూల కారణమయ్యారు. పుష్పంలో గంధం, చంద్రునిలో వెన్నెల, సూర్యునిలో తేజం నిక్షిప్తమై, స్వభావ సిద్ధమూ ఉన్నట్లే శివుడిలో శక్తి కూడా స్వభావ సిద్ధయై విరాజిల్లుతుంది. శివునిలో ఇ కారమే శక్తి అయి ఉంది. శివుడు ఎల్లకాలం ఒకే రూపానికి ప్రతీక అయితే, శక్తి పరిణామ తత్త్వమై భాసిల్లుతూ ఉంటుంది.

శివుడు అజన్ముడు, ఆత్మ అయితే... శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తిని బలంగా ఉంచుతుంది. ఇదే అర్థనారీశ్వరుని రహస్యం