అసలైన బలం



కృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న విజయనగర సామ్రాజ్యానికి శత్రువుల బెడద ఎక్కువైంది. రాజధాని నగరాన్ని శత్రువుల బారినుంచి రక్షించుకునేందుకు తగిన సలహాలు ఇవ్వాలని మంత్రులనూ సైన్యాధికారుల్నీ అడిగాడు రాయలు.

నగరంచుట్టూ పదిహేను అడుగుల ఎత్తులో రాళ్లతో ప్రహారీగోడను నిర్మించాలని చాలా మంది సలహా ఇచ్చారు. ఈ ఆలోచన రాజుకూ నచ్చింది. వెంటనే గోడ నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. వేలమంది కష్టపడటంతో భారీ గోడ నిర్మాణం నెల రోజుల్లోనే పూర్తయిపోయింది. ఆ ఎత్తయిన గోడ ముఖద్వారానికి ఇనుప తలుపులు ఏర్పాటుచేశారు.రాతి గోడ గట్టితనం, తలుపుల బలం పరీక్షించడానికి ఓరోజు రాయలు వచ్చాడు.

గోడను ఏనుగుల చేత కుమ్మించి, ఫిరంగి గుళ్లతో కొట్టించాడు సైన్యాధిపతి. కానీ అవిఏమాత్రం చెక్కుచెదరలేదు. రాయలు ఎంతో ఆనందించి... 'ఇకపై మన భద్రతకు లోటులేదు. ఈ గోడనీ ముఖద్వారాన్నీ దాటుకొని శత్రువులు లోపలికి రావడం అసాధ్యం' అని గర్వంగా చెప్పాడు. ఆ మాటలకు అక్కడున్నవారంతా అవునన్నట్లు తలూపారు.తెనాలి రామలింగడు మాత్రం, 'రాజా, అలా అనుకోవడం పొరపాటు' అన్నాడు. 'మీ ఉద్దేశమేమిటి' అని అడిగాడు రాజు.

'సాయంత్రం నాతో పాటు మీరు వస్తే, ఏమిటో చెబుతాను' అని బదులిచ్చాడు రామలింగడు.వారిద్దరూ సాయంత్రం మారువే షాల్లో నగరం బయటకు వెళ్లి బాగా చీకటిపడ్డాక నగర ముఖద్వారం దగ్గరకు వచ్చారు.

అక్కడ కాపలా ఉన్న భటుల నాయకుణ్ని తలుపులు తెరవాలని అడిగారు. 'సైన్యాధికారి అనుమతి లేనిదే, చీకటి పడ్డాక ఎవరూ నగరంలోకి ప్రవేశించడానికి వీల్లేదు' అని చెప్పాడు అతడు. రామలింగడు అతణ్ని పక్కకు తీసుకుపోయి, చేతిలో పది బంగారు నాణేలు పెడుతూ... 'మాకు నగరంలో చాలా ముఖ్యమైన పని ఉంది.

ఎలాగైనా లోపలికి పంపాలని అడిగాడు.ఆ మరుక్షణమే భటుల నాయకుడు, కాపలాదారుల్ని తలుపులు తెరవవలసిందిగా ఆజ్ఞాపించాడు. జరిగింది చూసి ఆశ్చర్య పడుతున్న రాయలుతో...

'రాజా, ఏనుగులకన్నా బలమైనదేమిటో తెలిసిందిగా' అని చెప్పాడు రామలింగడు. అప్పట్నుంచి భటుల ఎంపికలో శారీరక దారుఢ్యంతోపాటు వారి నిజాయితీకీ పరీక్షలు పెట్టడం మొదలుపెట్టాడు రాయలు.