బద్దకిస్టు



రామకృష్ణుడు పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. పుట్టింది గుంటూరులో. కొన్నాళ్లకే తండ్రి మరణించడంతో తల్లి ఎంతో కష్టమ్మీద రామకృష్ణను పెంచుతుంటుంది. రామకృష్ణ సోమరిపోతు. ఎప్పుడూ నిద్రపోవాలని చూస్తుంటాడు. తినమని పండు ఇస్తే దాని తొక్క తీయాలి కదా అని బద్దకించి అలాగే చేతిలో పెట్టుకొని నిద్రపోతాడు.

స్కూల్కి వెళితే గురువు చెప్పే పాఠాల మీద ఎంత మాత్రమూ ఆసక్తి ఉండదు. తల్లికి రామకృష్ణ పెంపకం చాలా తలనొప్పిగా ఉంటుంది. నదిలో స్నానం చేసి రమ్మని తల్లి పోరితే వెళ్లి అక్కడి బండరాళ్ల మీద పడుకొని నిద్రపోతుంటాడు.

నది దగ్గర జపం చేసుకుంటున్న ఒక సాధువు రామకృష్ణ పడుకుని ఉండడం చూసి ఓ రోజు విసుక్కుంటాడు 'కాళీమాత గుడికి వెళ్లి పడుకోపో.. నా జపానికి విఘాతం కలిగించకు' అని కోప్పడతాడు. విధిలేక రామకృష్ణ అమ్మవారి గుడికి వెళతాడు. ఆకలేస్తే తనకు కావల్సిన ప్రసాదాన్ని తినేసి అక్కడే పడుకుంటాడు. కలలో దేవత ప్రత్యక్షమై ధనం, జ్ఞానం ఉన్న రెండు గిన్నెల నిండా ప్రసాదం ఇస్తుంది తినమని.

అవి తిన్న రామకృష్ణుడు నిద్రలేచి అమ్మవారి వైపుగా చూస్తాడు. ఆమె పాదాల వద్ద గిన్నెలోని ప్రసాదాన్ని సేవించి, దండం పెట్టుకొని పరుగున ఇంటికి చేరుకుంటాడు. మరుసటి రోజు పొద్దున్నే రామకృష్ణుడు పడుకొని లేకపోవడం చూసిన తల్లి ఆశ్చర్యపోతుంది.

ఎక్కడా కనిపించకపోవడంతో నది దగ్గరకు వెళుతుంది. కొడుకు కనిపించడు. అక్కడే ఉన్న సాధువుని అడుగుతుంది తన కొడుకు గురించి. 'రామకృష్ణుడు బ్రహ్మముహూర్తంలోనే వచ్చి నదీ స్నానం చేసి వెళ్లాడు' అని చెబుతాడు.

తల్లి ఆశ్చర్యపోతూ ఇంటికి చేరుకుంటుంది. రామకృష్ణుడు పూజ చేస్తూ కనిపిస్తాడు. ఆకలేస్తుందని, పాఠశాలకు వెళ్లాలని ఏదైనా తినడానికి ఇమ్మని తల్లిని త్వరపెడతాడు. ఆవుకు మేత తెచ్చి వేస్తాడు.

తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తాడు. ఖాళీ సమయం ఉంటే పాఠాలు వల్లెవేస్తుంటాడు. గురువును మెప్పించిన శిష్యుడు అవుతాడు. తల్లి ఆనందంతో కొడుకును చూసుకొని మురిసిపోతుంది.