భేతాళుడు చెప్పిన ఆఖరికథ



పూర్వం ద్రవిడ దేశంలో గల ఒక నగరాన్ని దయాకరుడను రాజు పాలించేవాడు. అతడు చాల సున్నిత హృదయం గలవాడు; ప్రజలను చాల దయతో పరిపాలించేవాడు; అతని పేరుకూడ అందుకు సార్ధకమైంది.
అతని మెత్తదనం గమనించి శత్రురాజులు ఆ నగరాన్ని ఆక్రమించారు, దయాకరుడు అహింసాపరుడు కావడంవల్ల ప్రజానష్టాన్ని సహించలేక రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోయాడు.

ఆతని వెంట భార్య రత్నావతి, క్షమార్తె సుగుణావతి మాత్రమే యున్నారు. అడవిలో ఒకచోట చిన్న పర్ణశాల వేసుకొని ఉంటున్నారు. అయినా, వారికి శత్రుభయం తప్పలేదు. శత్రురాజులు దయాకరుని ఉనికి తెలిసికొని ... ఒక అర్థరాత్రి వచ్చి దయాకరుని చంపివేశారు. పాపము, భార్యయైన రత్నావతి కుమార్తెయగు సుగుణావతి ఎట్లో తప్పించుకొన్నారు. కంటికి కనిపించని మార్గాన్ని బట్టి ముందుకు ప్రయాణం సాగించారు.

ఆ మార్గం వెంబడే-ఆ యిద్దరు స్త్రీలు వెళ్ళిన కొంచెం సేపటికే- ఆ సమీపమునగల ఒక నగరాధిపతి, ఆతని కుమారుడు గుర్రములపై వచ్చుచు, ఆ స్త్రీలయొక్క పాదగుర్తులను చూశారు.
ఆ రాజు యిలా అన్నాడు. “కుమారా: ఈ పాదముదలు చూడగా, శుభలక్షణములు గల స్త్రీల పాదములవలె గన్పించుచున్నవి. ఇట్టివారిని పొందినవారు అదృష్టవంతులగుతారని సాముద్రికము తెల్పుచున్నది" అని. రాజకుమారుడు తండ్రిమాటలు విని, ఆలోచించి యిలా అన్నాడు: "తండ్రీ! ఈ పాదముద్రలు కొన్ని పెద్దవిగాను, కొన్ని చిన్నవిగాను ఉన్నవి. మనము వీటి ననుసరించి వెడదాము: వారిని కలుసుకుంటాము. మా అమ్మ ఎట్లాగూ లేదు కాబట్టి మీరు పెద్ద పాదములు గల స్త్రీని పెండ్లాడి, నాకు తల్లిని చేయుడు, నేను చిన్న పాదములు గల చిన్న దానిని పెండ్లాడి మీకు కోడలుగా చేస్తాను" అని.

వారు యీ విధముగా నిర్ణయము చేసికొని, బయలుదేరి వారిని కలుసుకున్నారు, తీరా చూసేసరికి పెద్దపాదములు గలది రాజకుమార్తెయగు సుగుణావతి; చిన్న పాదములుగలది రత్నావతి. అయినను, వారు తమ మొదట నిర్ణయం ప్రకారం సుగుణావతిని మహారాజు, రత్నావతిని రాజకుమారుడును పెండ్లి చేసి కొన్నారు. ఆ రత్నావతి, సుగుణావతులు కూడ తమ పరిస్థితికి వేరే గత్యంతరం లేక అందుకు సమ్మతించారు.
కొంతకాలానికి మహారాజుకు సుగుణావతి వలన ఒక కుమారుడు, రాజకుమారునికి రత్నావతి వలన ఒక కుమారుడును పుట్టారు. "మహారాజా: విక్రమార్కా: విన్నావుకదా కథ, ఆ విధముగా జన్మించిన ఆ యిరువురు బాలురు ఏయే వరుసలతో పిల్చుకుంటారో చెప్పవయ్యా! రాజా:" అన్నాడు. భేతాళుడు.

విక్రమార్కునికి ఎంత ఆలోచించినను, వారి వరుసను నిర్ణయించలేక, పోయాడు. సమాధానం చెప్పలేదు. తిన్నగా సన్యాసి ఆశ్రమానికి బయలు చేరాడు.