భోగం మేళం - బోడిగుండుకి గాలం



దసరా ఉత్సవాల సందర్భంగా విజయనగరానికి భోగం మేళం వారు కొందరొచ్చారు. వారిలో ఇంకా కన్నెరికం చెయ్యని నెల్లూరి నెరజాణ, మహా అందగత్తె ఒకతే ఉ౦దని తాతాచార్యుల వారికి తెల్సింది. ఎప్పటికైనా ఒక్క పిల్లకి కన్నెరికం చెయ్యాలన్న కోరిక ఆచార్యుల వార్ని చాలాకాలంగా పట్టిపీడిస్తోంది. అయితే వారికి రాజ్యంలో వున్న పరువు ప్రతిష్టలు అడ్డుపడటం వల్ల ఆ కోరిక తీర్చుకోలేకపోయారు.

ఆయన ఆశ్రితుడైన అప్పన్న వారి కోరిక తీర్చడానికి కంకణం కట్టుకుని "అయ్యా... ఈరాత్రి రెండో ఝాము దాటాక మూడోకంటివాడి కంట పడకుండా తమర్ని ఆ నెల్లూరి నెరజాణ ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నాది. ఆ పిల్లకి తమతో కన్నెరికం జరిపించే పూచీ నాది. గుట్టుచప్పుడు కాకుండా పని ముగించేద్దాం. తమరు సిద్ధంగా వుండండి" అని భరోసా ఇచ్చాడు.

ఆ విషయం కూడా ఎలాగో రామకృష్ణుడికి తెల్సిపోయింది.అర్ధరాత్రి రెండోజాము దాటాక ఆచార్యులవారు చందనాదులు పూసుకుని, ఆభరణాలు అలంకరించుకుని, తాంబూలాన్ని నముల్తూ, పరులకంట పడకుండా నెల్లూరి నెరజాణ ఇంటికి చేరుకున్నారు.

అప్పన్న వార్ని లోపలికి పంపుతూ "లోపల ఏర్పాట్లన్నీ చేశాం. భోగంమేళం తమకి స్వాగతం పలుకుతుంది. అనుభవించండి మరి. కోడికూత వేళకి వస్తా" అనేసి వెళ్లిపోయాడు. ఆచార్యులవారు లోపలకి అడుగుపెట్టగానే కొందరు వృద్ధసానులు భోగంమేళాలతో, పాటలతో వారికి స్వాగతం పలికారు. ఆ మాత్రానికే వారు మురిసిపోతుండగా వెనకనుంచి వారి బోడిగుండుకి గాలం పడింది. వారు ఉలిక్కిపడి అంతలోనే అది గాలం కాదు, నెరజాణ విసిరిన పూల వాలుజడ అని గ్రహించారు. అంతలో వారి కళ్లముందు తళుక్కున మెరుపు మెరిసినట్లయింది.

వారు కనురెప్పలు రెపరెపలాడిస్తుండగా అప్సరసలాంటి, మెరుపుతీగ లాంటి నెల్లూరి నెరజాణ వారిముందు వయ్యారంగా ప్రత్యక్షమైంది. ఆచార్యులవారు ఆనందాన్ని పట్టలేక అప్పటికప్పుడే ఆశువుగా ఒక పద్యం చెప్పారు.

"అమ్మోమ్మో.... వయస్సు మీద పడినా అల్లుడుగారూ సరసులేనే అమ్మడూ... నిన్ను చూడగానే పద్యం పలికి నీ అందానికి దాసోహం అన్నఅల్లుడుగారు నీకేం బహుమతిస్తారో అడగవే..." అని విన్పించింది చీకట్లోంచి ఓ మగగొంతు. "ఆ.. అడిగేదేంటీ... చొంగకార్చుకుంటూ నా భోగంమేళానికొచ్చిన యీ బోడిగుండు ఒంటిమీదున్న బంగారం అంతా నాదే... " అంటుంటే ఆచార్యులవారు మైమర్చిపోతూ "అంతా నీదే... అంతా నీదే..." అనేస్తూ ఆ నెరజాణ వెంట శయనమందిరంలోకి ప్రవేశించారు.

ఆ తర్వాతేం జరిగిందో వారికి తెలిస్తే...?