చిలక చాతుర్యం


భువనగిరి రాజ్యాన్ని విజయవర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆయనకు శిల్ప కళంటే ప్రాణం. తన రాజ్యంలోని గొప్ప గొప్ప శిల్పులచేత అద్భుతమైన శిల్పాలు చెక్కించి, వాటిని వివిద ప్రదేశాలలో అమర్చి ఆనందించేవాడు. అంతేకాదు ప్రతీ ఏడూ శిల్ప విద్యలో అత్యంత నైపుణ్యం ప్రదర్శించిన శిల్పిని ఘనంగా సత్కరించేవాడు. ప్రతి సంవత్సరం లాగే, ఆ సంవత్సరం కూడా శిల్పకళా పోటీలను ఏర్పాటు చేశాడు. విజయవర్మ ప్రకటనను చూసి చాలామంది శిల్పులు తమ శిల్పాలను పోటికి తెచ్చాడు.
రకరకాల పరీక్షల తర్వాత మూడు శబ్దాలు మాత్రం చివరిస్థాయి వరకూ వచ్చాయి. ఆ మూడింటిలో ఏది గొప్ప శిల్పమో రాజుగారికి అంతుపట్టలేదు. సమస్య తేలక పోవడంతో రాజు మంత్రి సహాయాన్ని కోరాడు. మంత్రి ముందుగా ఆ శిల్పాలను చూడాలని కోరడంతో, రాజు తాను ఎంపిక చేసిన మూడు శిల్పాలను ఉంచిన ఉద్యానవనంలోకి మంత్రిని తీసుకెళ్ళి చూపించాడు. మూడు శిల్పాలను చూసిన మంత్రిగారిని నోటమాట రాలేదు.
ఏది ఉత్తమ కళాఖండమో తేల్చడం సాధారణమైన విషయం కాదు ఒక శిల్పానికి మించింది మరోటి ఎలా తేల్చడం? మంత్రి ఆలోచిస్తుండగా ఒక చిలక వచ్చి ఒక శిల్పం మీద వాలింది. వెంటనే మంత్రిగారికి ఒక ఆలోచన వచ్చింది. 'మహారాజా ఈ మూడో శిల్పమే అత్యద్భుతమైన శిల్పం' అన్నాడు. మంత్రి మాటలతో తన బరువు తీరిందని రాజు సంతోషించాడు. కానీ మంత్రి మూడో శిల్పమే గొప్పదని ఎలా చెప్పగలిగాడో రాజుకు అర్ధంకాలేదు. ఆ విషయాన్నే మంత్రిని అడిగాడు. దానికి మంత్రి 'మహారాజా! ఇందులో నా గొప్పతనం ఏమీలేదు. అంతా చిలక గొప్పతనమే చిలక మూడో శిల్పంపైన వాలడంతో నేను దాన్నే గొప్పదిగా మీకు చెప్పాను.
మూడో శిల్పమైన యువతి చేతిలో ఉన్న చిలక బొమ్మను నిజమైన చిలకగా భావించి ఈ చిలక దాని దగ్గరకు చేరింది. మనుషులనే కాకుండా పక్షులను కూడా మైమరిపించగలిగిన శిల్పం అత్యద్భుతమైందని నా ఉద్దేశం అని మంత్రి వివరించి చెప్పడంతో రాజు సంతోషించాడు. మూడో శిల్పమే గొప్పదని ప్రకటించాడు అనంతరం ఆ శిల్పాన్ని చెక్కిన శిల్పిని ఘనంగా సత్కరించాడు.