దమయంతిని అడవిలో వదిలి పోతున్న నలుడు



ఒకరోజు అడవిలో నలుని తొడమీద తల పెట్టుకుని, దమయంతి నిద్రపోతూ ఉంది. అమెను చూసి నలుడు "ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతోంది. నా వెంట ఉండటమే ఈమె కష్టాలకు కారణం. నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖ పడుతుంది" అని మనసులో అనుకుని, తాను ధరించిన చీరభాగాన్ని చింపి, పైన వేసుకుని ఆమెను వదలలేక వదలలేక విడిచి వెళ్ళాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండచిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది.

ఆ కేకలు విని ఒక కిరాతకుడు తన కత్తితో ఆ కొండచిలువను చంపి, దమయంతిని రక్షించాడు. ఆ కిరాతకుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకుని, ఆమెను తాకబోవగా, దమయంతి అతనిని భస్మం చేసింది.భర్తను తలుచుకుంటూ అడవిలో దారీతెన్నూ లేకుండా ప్రయాణిస్తూ ఉండగా, ఆమెకు ఒక మునిపల్లె కనపడింది.

అక్కడ ఆమె మునిశ్రేష్టులను చూసింది. మునులు దమయంతిని చూసి "అమ్మా! నీవు ఎవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?" అని అడిగారు. సమాధానంగా దమయంతి "మునిపుంగవులారా! నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు. నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించలేను" అని అడిగింది.

మునులు "అమ్మా! నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది. చింత పడకుము" అని చెప్పి, వెళ్ళారు. దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూసి చూసారు. కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేసారు. కొందరు ఆమెకు మొక్కారు. వారిలో ఉన్న వ్యాపారి ఆమె గురించి తెలుసుకుని "అమ్మా! నేను నలుని చూడలేదు, కానీ మేము ఛేది దేశానికి వెళుతున్నాము" అన్నాడు.

దమయంతి వారితో "నేను కూడా మీ వెంట వస్తాను" అన్నది. ఆ వ్యాపారి ఆమెను తమ వెంట తీసుకు వెళ్ళాడు. వారు అడవి మార్గంలో రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కివేసింది. వారిలో చాలామంది మరణించడం చూసి, దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోదిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకు వెళ్ళారు.

ఛేదిదేశ రాజధాని సుబాహుపురం చేరింది. ఒళ్ళంతా దుమ్ముతో వీధిలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో "అమ్మా! నిన్ను చూస్తుంటే రాజకళ ఉట్టి పడుతుంది. నీవు ఎవరు?" అని అడిగింది. దమయంతి "అమ్మా! నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు.

అతనిని వెతుకుతూ తిరుగుతున్నాను" అని చెప్పింది. రాజమాత "అమ్మా! ఇకనుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు. నీకు ఏ లోటూ రాకుండా నేను చూస్తాను. నీ భర్తను వెతికిస్తాను" అని చెప్పింది. దమయంతి అందుకు అంగీకరించి "అలాగే ఉంటాను, కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలీ తినను, పరులకు కాళ్ళుపట్టను, పరపురుషులతో మాట్లాడను. కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడు తాను" అని చెప్పింది.

రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి అక్కడే ఉండిపోయింది.