దేవకాంత పూలదండ



ఒక రోజు ఆకాశ మార్గాన పోతున్న దేవకాంత మెడలోని పూలదండ దేవశర్మ తలమీద పడింది . దేవశర్మ దానిని భార్యకు ఇచ్చాడు. ఆ సమయంలో రుచి అక్క భర్త అయిన చిత్రరధుడు దేవశర్మను, రుచిని తమ ఇంట్లో జరిగే ఉత్సవానికి రమ్మని ఆహ్వానించాడు. చిత్రరధుడి ఇంటికి పోతూ రుచి ఆ దండను అలంకరించుకుని వెళ్ళింది.

ఆ పరిమళముకు ఆకర్షింపబడిన ఆమె సోదరి ఆదండ గురించి సోదరిని అడుగగా ఆమె ఆ పూలు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అటువంటి పూలను తన సోదరికి తెచ్చి ఇవ్వమని కోరింది. దేవశర్మ విపులుడిని పిలిచి ఆ పుష్పములు ఎక్కడ ఉంటాయో వెతికి పట్టుకు రమ్మని చెప్పాడు. విపులుడు తన యోగశక్తితో ఆ పుష్పములు ఉన్న ప్రదేశం తెలుసుకుని ఆ పూలను తీసుకుని వస్తూ మార్గమధ్యంలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన విన్నాడు.

ఆ స్త్రీ నాది తప్పు అయిన విపులుడికి పరలోకములో పట్టినగతి నాకు పడుతుంది అన్నది. అతడు అది విని ఇంకా ముందుకు సాగాడు అక్కడ ఆరుగురు జూదరులు ఆడుతూ మధ్యలో కలహించి నాది తప్పయితే పరలోకములో విపులుడికి పట్టినగతి నాకు పడుతుంది అని అన్నాడు. ఈ మాటలు విన్న విపులుడు తాను చేసిన తప్పేమిటి ఒక వేళ తాను గురువుగారు లేని సమయంలో ఆమె శరీరంలో ప్రవేశించిన విషయం గురువుగారికి చెప్ప లేదు కదా ! అందు వలన నాకు పాపం వచ్చింది ఏమో అని తర్కించుకుంటూ గురువుగారిని చేరి ఆ పూలను గురువుగారికి సమర్పించాడు.

విపులుడు ఒంటరిగా ఉన్న సమయంలో గురువుగారు విపులుడితో విపులా నీవు వచ్చు మార్గములో ఇద్దరు స్త్రీ పురుషులు ఆరుగురు జూదరులు కనిపించారు కదా వారు ఎవరో తెలుసా అని అడిగాడు. విపులుడు వారు ఎవరో తెలియదని చెప్పాడు. గురువు నీవు నా భార్యను రక్షించడానికి నా భార్య శరీరంలో ప్రవేశించావు. అది పాపమని వారనుకున్నారు నిజంగా అది పాపమని నేను అనుకుంటే నేను నీకు శాపం ఇచ్చేవాడిని కాని వరాలు ఎందుకు ఇస్తాను ? ఆ స్త్రీ పురుషులు పగలు రాత్రి. ఆ జూదరులు ఆరు ఋతువులు అని చెప్పాడు.

గురువుగారి ఔదార్యానికి శిష్యుడు ఆశ్చర్య పోయాడు. గురువు గారు ఇంకా విపులుడితో రాత్రి పగలు ఆరు ఋతువులు మనుష్యులు చేసే మంచి పనులు చెడ్డ పనులు గమనిస్తుంటారు. కనుక మనం ఎవరికి తెలియకుండా తప్పు చేయవచ్చని అనుకోవడం పొరబాటు. నీవు ఒక స్త్రీని రక్షించడానికి విజ్ఞతతో చేసిన పని మంచిదే కాని తప్పు కాదు ఇలా చేసి నా గౌరవం కాపాడావు. అందుకని ఆ విషయం నాకు చెప్పక దాచడం పాపము కాదు అని చెప్పాడు.

అని చెప్పి భీష్ముడు ధర్మనందనా ! స్త్రీల గురించి నీకు చెప్పాను. స్త్రీలలో అనేక విధములు ఉంటారు. అందులో మంచి వారు కులస్త్రీలు ఉంటారు. వారి వలనే ఈ భూమి క్రమం తప్పక పరిభ్రమిస్తుంది. పాతివ్రత్యం పాటించే స్త్రీ దైవం వంటిది. మానవుడికి ధర్మము, సుఖము, పేరు ప్రతిష్ఠలు మంచి భార్య వలన లభిస్తాయి అనడంలో ఏ విధమైన సందేహం లేదు అని చెప్పాడు.