ద్రౌపదికి వరాలు రాజ్యాన్ని తిరిగి పొందటం



పూర్వం ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, సుధన్వుడు అనే బ్రాహ్మణుడు ఒక కన్య కొరకు తగులాడుతూ ప్రహ్లాదుని వద్దకు తీర్పు కోసం వెళ్ళారు. కొడుకు విషయంలో తీర్పు చెప్పటానికి జంకి ప్రహ్లాదుడు కశ్యపుని సలహా అడిగాడు. న్యాయమూర్తి సాక్ష్యాన్ని ధర్మాన్ని అనుసరించి ధర్మ బద్ధమైన తీర్పు చెప్పాలి.

అలా చెయ్యకపోతే న్యాయమూర్తికి సభాసదులకు పాపం వస్తుంది. కనుక కామక్రోధాలకు అతీతంగా తీర్పు చెప్పు " అని కశ్యపుడు చెప్పాడు. ప్రహ్లాదుడు సంతోషించి తన కొడుకు అని ఆలోచించక సుధన్వుడికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. కనుక మనం ఈ నాడు ద్రౌపదికి న్యాయం చేయకుంటే అందరికి పాపం వస్తుంది " అన్నాడు.

దుర్యోధనునికి భయపడి ఎవరూ బదులు చెప్పలేదు. ద్రౌపది సభాసదులను చూసి " నేను పాండవుల ఇల్లాలిని లోకారాధ్యుడైన శ్రీకృష్ణ సోదరిని. ఇలా అవమానింపబడ్డాను. నేను అడిగినదానికి ఎందుకు బదులు చెప్పరు.? నేను దాసినా కాదా చెప్పండి దాని ననుసరించి నేను ప్రవర్తిస్తాను " అన్నది.

ధృతరాష్ట్రునికి సభలో జరిగిన దానిని గురించి చెప్పుచున్న గాంధారిని దుఃఖంతో అడిగింది . భీష్ముడు " అమ్మా! నీ ప్రశ్నకు ధర్మరాజు ఒక్కడే సమాధానం చెప్పగలడు " అని అన్నాడు. కర్ణుడు తరుణీ ! ఐదుగురు భర్తలకన్నా ఒక్క భర్త మేలు కదా ! జూదంలో భార్యను ఓడి పోని వ్యక్తిని భర్తగా ఎంచుకో " అని ఎగతాళి చేసాడు.

సుయోధనుడు "వచ్చి నా తొడపై కూర్చో" అని తన తొడ మీది వస్త్రాన్ని పైకెత్తి చూపాడు. అది చూసి భీముడు " రాజ్య సంపద వలన కలిగిన మదంతో ద్రౌపదిని తొడ మీద కూర్చోమని సైగ చేసిన ఈ దుర్మార్గుని తొడలు నా గదతో విరుగ కొడతాను " అని ముందుకు ఉరికాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఇది తగిన సమయం కాదిని శాంతింప చేసారు. దుర్యోధనుడు " భీమార్జున నకులసహదేవులు నిన్ను పణంగా పెట్టడానికి ధర్మరాజుకు అధికారం లేదని చెపితే దాస్యం నుండి నీకు విముక్తి కలిగిస్తానన్నాడు.

అప్పుడు అర్జునుడు " తమను పణంగా పెట్టినపుడు తాను స్వతంత్రుడే. కానీ తానే ఓడిపోయిన తర్వాత మరెవరి మీద తనకు అధికారం ఉండదని కౌరవులు గ్రహించాలి" అన్నాడు. అప్పటికి చలించిన గాంధారి విదురుని తీసుకుని దృతరాష్ట్రుని వద్దకు వచ్చి ద్రౌపదికి జరిగిన అవమానాన్ని వివరించింది. ధృతరాష్ట్రుడు " సుయోధనా ! పాండవ పట్టమహిషిని ఇలా అవమానించడం తగునా ? నీ కారణంగా పాండవులు దుఃఖితులయ్యారు " అని ద్రౌపదిని పిలిచి " అమ్మా ! ద్రౌపది నా కోడళ్ళలో నీవు గౌరవించతగిన దానివి. నీకు ఏమి వరం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు.

“ద్రౌపది” ముందు నా భర్తను దాశ్యం నుండి విముక్తుని చేయండి " అని అడిగింది. ఇంకో వరం కోరుకో అన్నాడు. " ధర్మరాజు నలుగురు తమ్ములను దాస్యవిముక్తులను చేసి వారి వారి ఆయుధములను ఇప్పించండి " అన్నది. సరే ఇచ్చాను ఇంకో వరం కోరుకోన్నాడు. వైశ్య సతికి ఒక వరం, క్షత్రియ సతికి రెండు వరాలు, క్షత్రియునికి మూడు వరాలు, బ్రాహ్మణుడికి వందవరాలు అని పెద్దలంటారు కనుక ఇక వరాలు కోరరాదు అన్నది. ద్రౌపది ధర్మనిరతికి ధృతరాష్ట్రుడు సంతోషించి పాండవులను పిలిచి జూదంలో పోగొట్టుకున్న రాజ్యాన్ని సమస్త సంపదను తిరిగి ఇచ్చి " నేను బుద్ధి లేక జూదాన్ని ఉపేక్షించాను.

వృద్ధుడను, అల్ప బుద్ధిని మీ తల్లి గాంధారి ముఖం చూసి దుర్యోధనాదులు మీ పట్ల చేసిన అపచారం క్షమించండి . మీరు ఇంద్రప్రస్థానికి వెళ్ళి హాయిగా రాజ్యం చేసుకోండి అని దీవించాడు. ఇంద్రప్రస్థకు బయలుదేరుతున్న పాండవులను చూసి కర్ణుడు నేను మనుస్యులలో అందగత్తెలయిన స్త్రీలను చూసాను గాని వారిలో ఎవ్వరు ఈ విధంగా కార్యాన్ని సాధించలేదు. పాండవుల నావ ఏ ఆధారం లేకుండ మునుగుతుంటే ద్రౌపది వారికి నావయై కాపాడింది" అని ఎద్దేవ చేసాడు.

అది విని భీముడు పాండవులకు స్త్రీ గతి అయిందని, తాను దీనిని సహించలేనని, వారిని ఇప్పుడే సంహరిస్తానని వారి మీదకు పోబోతున్న భీముడిని అర్జునుడు ధర్మరాజు వద్దు. శాంతంగా ఉండమని సముదాయించి ధృతరాష్ట్రుడికి నమస్కరించి ఇంద్రప్రస్థకు బయలుదేరారు.