దురాశ దుఃఖానికి చేటు


రామాపురంలో పూర్వం ఒక నిరుపేద కుటుంబీకుడుండేవాడు. అతడు పిట్టల్ని పెంచి వాటిని వాటి గుడ్లను అమ్ముకుని జీవించేవాడు. అతి కష్టంగా కుటుంబ భారాన్ని నిర్వహించు కొంటున్న అతని దగ్గర ఒక బాతు వుండేది. అది గుడ్లు పెట్టడం ప్రారంభించింది. అవి బంగారు గుడ్లు. దానితో అతని అదృష్టం మారింది. రోజుకొక బంగారు గ్రుడ్డు పెడుతూ వుండడం వల్ల -అతనికి క్రమక్రమంగా సిరిసంపదలు పెరగసాగాయి.
ఇలా కొంతకాలం జరిగిందో లేదో అతనిలో ఆశాలు అధికమయ్యాయి. రోజు రోజు గ్రుడ్డుకోసం వేచి వుండే కన్నా దాని కడుపులో గ్రుడ్లనీ ఒక్కసారే తీసుకొని వాటితో అనంతకోటి సిరిసంపదలుగల శ్రీమంతుడై సుఖభోగాలనుభవించాలని కీర్తిని, పేరుని సంపాదించాలని అతనికి దురాశ కలిగింది.
ఒకనాడు బాతును చేరదీసి పట్టుకుని, దురాశ కొద్దీ కత్తితో దాని కడుపు కోశాడు. బంగారు గ్రుడ్లకోసం దాని కడుపంతా గాలించాడు. ఒక్క గ్రుడ్డు కూడా దొరకలేదు. ఆ బాతు మాత్రం చచ్చిపోయింది. ఆ నాటి నుండి బంగారపు గ్రుడ్లు లేవు. మళ్ళీ అతని పరిస్థితులు పూర్వపు దరిద్రపు స్థితికే దిగజారిపోయాయి. ఉన్నదాన్ని ఆనందంగా అనుభవించలేకపోగా అతడి దురాశ దుఃఖానికి చేటయ్యింది.