దుర్యోధనుని అవమానభారం



వైశంపాయనుడు " పాండవులచే రక్షింపబడిన ధుర్యోధనుడు అవమానభారంతో, మితిమీరిన దుఃఖంతో తన సేనలను మరల్చుకుని కొంత దూరం వెళ్ళి విడిది చేసాడు. సుయోధనునికి నిద్ర పట్టలేదు. అతడు కుటీరంలో ఏకాంతంగా దుఃఖిస్తూ ఉండగా కర్ణుడు వెళ్ళి " సుయోధనా! మానవులకు సాధ్యం కాని పని నీవు సాధించావు. గంధర్వులతో యుద్ధం చేసి గెలిచావు. నీవు చూస్తుండగానే గంధర్వులు నన్ను పరిగెత్తించారు. చెదిరిపోయే సేనను గూడా నేను నిలువరించలేక పోయాను.

బాణాల తాకిడితో తీవ్రంగా గాయపడ్డాను. నా రథం కూడా విరిగి పోవడంతో నేను వికర్ణుని రథంపై పక్కకు పోయాను. నీవు అమానుషమైన ఆ యుద్ధంలో గాయపడకుండా నష్టపోకుండా శత్రువులను జయించావని అంతఃపుర స్తీలతో కలిసి వచ్చావని తెలిసి ఆనందించి నిన్ను అభినందిద్దామని వచ్చాను. నీ సోదరులతో కలిసి యుద్ధంలో నీవు ప్రదర్శించిన పరాక్రమం వంటి పరాక్రమం ప్రదర్శించగలవాడు లోకంలో మరొకడు లేడు " అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు కర్ణునికి విషయం తెలియక మాట్లాడుతున్నందుకు చింతించి సిగ్గుతో తలవంచుకుని గద్గద స్వరంతో " కర్ణా! నేను తమ్ములు గంధర్వులతో యుద్ధం చేసాము. చిత్రసేనుడు నన్ను, నా భార్యను పరివార సమేతంగా బంధించి తీసుకు వెళుతున్న సమయంలో మనవాళ్ళు కొందరు ధర్మరాజుని శరణు వేడారు.

ధర్మరాజు తన తమ్ములను పంపాడు. వారు ముందు గంధర్వులకు నచ్చ చెప్పి చూసారు. వారు వినక పోవడంతో యుద్ధం చేసి గంధర్వులను ఓడించారు. అప్పుడు చిత్రసేనుడు మన ఘోషయాత్రలోని మంత్రాంగాని చెప్పాడు. సుఖహీనులైన ద్రౌపదిని, పాండవులను చూడటం కోసమే మనం వచ్చినట్లు చెప్పేశాడు. అప్పుడు నేను సిగ్గుపడి భూమిలోకి కూరుకు పోయినట్లని పించింది. అప్పుడు పాండవులు గంధర్వులకు మంచి మాటలు చెప్పి ఒప్పించగా బందీలమైన మమ్ములను స్త్రీలతో సహా ధర్మరాజు వద్దకు తీసుకువెళ్ళి మన విషయమును ధర్మజుడికి చెప్పి అప్పగించారు ఇంత కన్నా బాధాకర మేముంటుంది? వారు నా నిత్య శత్రువులు.

అయితే వారే నన్ను విడిపించారు. వారే నాకు బ్రతుకు నిచ్చారు. కర్ణా! ఇంత అవమానం జరిగిన తరువాత బ్రతకటం వ్యర్ధం. నన్ను చూసి ప్రజలు నవ్వరా. వారిని ఎలా పాలించగలను. ఇంత కంటే గంధర్వుల చేతిలో మరణించటం మేలు కదా అలాగైతే స్వర్గం ప్రాప్తించేది " అని తిరిగి " నేను ప్రాయోపవేశం చేయుట ఉత్తమం. నా తరువాత దుశ్శాసనుడు మీకు నాయకుడు.ఇప్పటి వరకు శత్రువులను పరభావించి మిత్రులను సత్కరించిన నేను శత్రువులచేత పరాభవాన్ని పొంది నగరానికి రాలేను. పది మందిలో తిరుగలేను, తండ్రి దృతరాష్ట్రునితోను తాత భీష్ముడితోను సంభాషించలేను .

ఇది స్వయంకృతాపరాధం అనుభవించి తీరవలెను. చెడ్డ వాడు సిరి సంపదలను కూర్చ వచ్చును, విద్యలు నేర్వ వచ్చును కాని వాటిని సద్వినియోగం చేయలేరు. నేనూ అంతే. అయ్యో! ఆ పని చేయకుండా వుండాలిసింది. ఇప్పుడు బ్రతుకే సంశయాగ్రస్త మయ్యింది. పరాక్రమంతో శత్రువుల తలలపై,గుండెలపై నిలువగలిగిన నన్ను గంధర్వుడు పట్టుకోవడం ఎంత అవమానం. ఆత్మాభిమానం పోయిన తరువాత ప్రాణాలతో జీవించడం నిరర్ధకం కనుక కర్ణా! ప్రాయోపవేశం చేసి నా ప్రాణాలను త్యజించడం తధ్యం నా మాటకు తిరుగు లేదు " అన్నాడు.