గంగాధరుని కథ



పూర్వం కళింగ దేశమందలి "పువ్వాడ" గ్రామంలో గంగాధరుడు అనే రైతు ఉండేవాడు. అతనికి పాడిపంటలు విశేషంగా ఉండేవి. అందువలన అతని యింట కోళ్ళు కుక్కలు, ఆవులు బర్రెలు ఎక్కువగా ఉండేవి.

గంగాధరునికి యోగులు, యతులు, మునీశ్వరులు అంటే చాల యిష్టం. అట్టివారు తమ గ్రామం వచ్చినప్పుడు గంగాధరుడు వారిని తన యింటికి ఆహ్వానించేవాడు. వారికి సకల సదుపాయాలు చేసి, వారి ఉపదేశాలను వింటుండే వాడు. ఒకసారి ఒక మహాయోగి గంగాధరుని యింటిలో ఉన్నప్పుడు, ఆయనకు చాల గౌరవంతో గంగాధరుడు పూజాదులు నిర్వర్తించి సేవ చేశాడు.

ఆ మహాయోగి గంగాధరుని సేవలకు సంతోషించాడు. తాను వెళ్ళునప్పుడు ఒక దివ్యమంత్రాన్ని గంగాధరునికి ఉపదేశించాడు. ఆ మంత్రప్రభావం ఏమిటంటే, పశువులు గానీ, పక్షలుగానీ, కీటకములుగానీ- ఏమి మాటలాడుకునేది ఆర్థము ఆవుతుంది.

ఆ మహాయోగి మంత్రం ఉపదేశిస్తూ, గంగాధరునికి ఒక హెచ్చరిక చేశాడు. అదేమిటంటే, “నువ్వు ఈ పక్షి కీటకముల సంభాషణ ఎవ్వరికీ చెప్పవద్దు. చెబితే తల పగిలి చచ్చిపోతావు" అని,
తరువాత కొన్ని దినములు అయిపోయాయి. ఒకనాడు గంగాధరుడు పొలం నుండి యింటికి వచ్చాడు. పెరడులో మంచంవేసి ఉంది. విశ్రాంతి కోసం అతడు ఆ మంచంపై కూర్చున్నాడు. భార్యకూడ వచ్చి ఆతని ప్రక్క కూర్చుండి ఏదియో యింటిని గూర్చి చెబుతూ ఉంది.

ఆ సమయంలో ఒక చీమలదండు అటునుంచి వస్తూ మంచం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. వెనుకనున్న చీమలు ముందున్న చీమలను ఉద్దేశించి "ఆగి పోయారేమి? పదండి" అన్నాయి.
ముందున్న చీమలు:-- "ఇక్కడ మంచము అడ్డు వచ్చింది." అని సమాధానం చెప్పాయి.
"మంచన్ని చూచి ఆగిపోయారా? దానిని ఒక్క ఊపుతో ఎగరగొడితే సరి" అన్నాయి; వెనుకనున్న చీమలు.
ముందున్న చీమలు: "అలా చేదామనే అనుకొన్నాము. కాని, మంచంపై ఆలుమగలు కూర్చుండి మాటాడుకొనుచున్నారు; వారికి అపాయము కలుగుతుంది కదా!" అని అన్నాయి.

ఆ మాటలు గంగాధరుడు విన్నాడు. వారి చివరి మాటలతో ఆతడు ఫక్కున నవ్వాడు "ఈ చీమలెంత: వీని బలమెంత? మాకు అపాయం కల్గునని ఊరుకొన్నాయా?" అన్న భావనతో గట్టిగా నవ్వాడు. గంగాధరుని భార్య, భర్తను చూచి - "ఆ నవ్వు ఏమిటి? నా మాటలు మీకంత నవ్వులాటగా ఉందా?" అని - "కారణం చెప్పు' మని మంకుపట్టు పట్టింది.

గంగాధరుడు తాను నవ్విన కారణం చెబితే, మరణిస్తాడు. అందువలన "నీ ప్రశ్నకు నేను నవ్వలేదు. వేరే యింకొక కారణమువల్ల నవ్వు వచ్చింది" అని చెప్పాడు. కానీ, అతని యిల్లాలు తన మంకుపట్టు విడిచిపెట్టలేదు. ఆ సంగతి ఏమిటో చెప్పేవరకూ భోజనంకూడ చేయనని భీష్మించి కూర్చున్నది. మూడు రోజులు గతించాయి. ఆ యిల్లాలు నోట మంచినీళ్ళుకూడా పోసుకోలేదు. "ఆలుమగల మధ్య ఈ రహహ్యలేమిటి? చెప్పాలి: నేను భోజనం చేయాలి" అని మొండిపట్టు పట్టింది.

గంగాధరునికి ఏమీ తోచలేదు. "అదేమిటో చెప్పబడదటయ్యా" అని బంధువులు—కూడ గంగాధరునే మందలించసాగారు. "అసలు సంగతి చెబితే మరణం తప్పదు; ఈ సంగతి వీళ్ళకు ఏమి తెలుస్తుంది." అని సరిపెట్టుకున్నాడు. గాని, భార్యను చూచి బాధపడసాగాడు.
నాల్గవరోజు ఉదయం గంగాధరుడు ముఖం కడుగుకొనుచున్నాడు. సమీపంలో ఒక కోడిపుంజు చలచిత్తముతో కంటికి కనిపించిన ప్రతి ఆడకోడి తోను సరసాలాడుచు సంతోషంతో తిరుగుతూ ఉంది.

అది చూచి ఆ యింటిలోని కుక్క, కోడితో యిలా అంది. "ఏమి టోయ్: నీ ఆనందం! మన యజమాని మూడు రోజులనుండి విచారంగా ఉన్నాడు. పెళ్ళాం తిండి తినడంలేదని, అదేమీ నీవు పట్టించుకోవడమే లేదు. నీ సంతోషమే నీది. అతని సుఖము చూడాలి మనం, కాని యజమాని విచారంగా ఉంటే, మనం యిలా కులకడం మంచిది కాదు" అని హితబోధ చేసింది.

ఆ మాటలు విన్న కోడిపుంజుకు పౌరుషం వచ్చింది. "ఎందుకు మంచిది కాదు: యజమాని చేతకానివాడైనప్పుడు మనమెందుకు జాలి పడాలి; మగవాడై పుట్టాడు; ఆడదానివలె బాధపడుతున్నాడు. మగవానికి ఆడదానికి చెప్ప రాని విషయాలు ఎన్నో ఉంటాయి. అవి ఆమె ఎందుకు అడగాలి? ఈయన ఎందుకు ఊరుకోవాలి? అవి నీకు చెప్పరానివని భయంతో చెప్పినప్పుడు, వినని ఆ యిల్లాలు-నాలుగు అంటించితే మరల ఆ మాట అడుగుతుందా? ఆడదానిని నెత్తి మీదకు ఎక్కించుకొంటే యిలాగే బాధపడాలి. పురుషత్వం లేని వాళ్ళగతి చూస్తూ. మనం సానుభూతితో మసలడమే మంచిది కాదు" అని సమాధానమిచ్చి తన సంబరంలో మునిగిపోయింది.

గంగాధరుడు ఆ మాటలు విన్నాడు. "నిజమే" అనుకొన్నాడు. కోడి పుంజు చెప్పినట్లే చేశాడు. ఆ యిల్లాలు తన జన్మలో ఆ నవ్వుగురించి అడగనేలేదు .

"విన్నావా మహారాజా: గంగాధరుని కథ. పాపము: కోడిపుంజువలన ఆ యింటి యజమానురాలు అనవసరంగా తన్నులు తినవలసి వచ్చింది" అన్నాడు. భేతాళుడు. "అనవసరం కాదు; అవసరమే, ఆడదానికి అంతమంకు పట్టు పనికి రాదు. ఎందుకు చెబుతున్నారో విని, నిదానంగా ఆలోచించుకోవాలి. యుక్తా యుక్తములు గమనించలేని వారందరూ యిలాగే అవమానం చెందుతారు" అన్నాడు. విక్రమార్కుడు.

విక్రమార్కుని మాటలతో నియమభంగమైనందున భేతాళుడు ఎగిరి పోయాడు చెట్టుమీదికి. విసుగు చెందంకుడా విక్రమార్కుడు వృక్షము దిక్కుకు మరల తన ప్రయాణం సాగించాడు.

పట్టు వదలి పెట్టకుండా, తిరిగి విక్రమార్కుడు వెనుకకు వచ్చి భేతాళుని బంధించి, తిరిగి సన్యాసి వద్దకు బయలుదేరెను. భేతాళుడు మరియొక కథ ప్రారంభించెను.