గర్వం


మగధను పాలించే రవివర్మ చాలా ధైర్యవంతుడు ఎంతో పరాక్రమవంతుడు అందువల్ల రాజులో కాస్త గర్వం చోటు చేసుకుంది. ఆ కారణంగా తనంతటివాడు మరొకడు లేడను కొంటున్న రాజుకు, తన వెంట తోడు ఎవరూ లేకుండా ఒంటరిగానే అడవికెళ్ళి జంతువుల్ని వేటాడే అలవాటుంది!
"మీరు మాటి మాటికీ ఎవర్నీ వెంటబెట్టుకోకుండా ఒంటరిగా అడవికెళ్ళడం మంచిదికాదు. మనకి శత్రువులున్నారన్న సంగతి మీకు తెలుసుకదా..! కాలం ఎప్పుడూ ఒకే విధంగా వుండదు" అన్నాడు మంత్రి రాజుతో కానీ రాజు వినలేదు.
కొన్నాళ్లు గడిచాయి.యథాప్రకారంగా అడవికెళ్ళి వేటాడుతున్న రవివర్మకి అనుకోకుండా ఆపద వచ్చిపడింది. ముసుగు వేషాల్లో వున్న ఇద్దరు వ్యక్తులు రాజును అమాంతంగా పట్టుకుని ఓ చెట్టుకు బందించి తళ తళ మెరిసే కత్తుల్ని బైటకు తీసి "నిన్ను ఇక్కడే చంపాలా? లేక మా రాజ్యానికి ఈడ్చుకువెళ్ళి చంపాలా?" అన్నారు.
వారు శత్రురాజ్యానికి సంబంధించినవారని రవివర్మకి పూర్తిగా తెలిసి ప్రాణం పోయినంతపనైంది. గతంలో మంత్రి చెబుతూ వచ్చిన మంచి నూటలు రాజుకి గుర్తొచ్చాయి. ఒంటరివాడైన తనను ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? ఇలా ఆలోచిస్తున్న రవివర్మకు తమ ముసుగు వేషాల్ని తొలగించిన తన మంత్రి, సైన్యాధిపతిని చూసి ఆశ్రర్యపడ్డాడు.
"మహారాజా! మీ మనసు మార్చడానికే మేమిలా కావాలనే చేశాం. క్షమించండి." అన్నారు -మంత్రి, సైన్యాధిపతిఅప్పుడు రవివర్మకు వారిలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలసింది . తనలో వున్న ఆ కాస్త -గర్వం తగ్గిపోయింది. అప్పట్నుంచి రవివర్మ తనకు తోడుగా కొందరు భటుల్ని వెంటబెట్టుకుని వేటకి వెళ్ళసాగాడు.