గూని మందు


మంత్రులు సేనాధిపతులు మొదలయిన ముఖ్యులతో కూర్చుని -శత్రురాజులమీద దండెత్తే విషయంలో రహస్యఆలోచనలు చేస్తున్నారు కృష్ణదేవరాయలు. వారి అనుమతి తీసుకోకుండాఅక్కడికి ప్రవేశించాడు రామలింగడు. వెళ్ళి ఊరుకోకుండా పరిహాసం ఆడబోయాడు. అతిముఖ్యమయిన విషయం మాట్లాడుతూండగా రావడం; వచ్చి పరిహాస ప్రసంగం చేయబోవడం – రాయలకి పట్టలేని కోపం తెప్పించింది.

“సమయమూ సందర్భమూ. లేకుండా …. పిలవని పేరంటానికి వచ్చి….పరిహాస ప్రసంగం చేయబోయిన యితన్ని తీసుకుపోయి గొయ్యితవ్వి కంఠం వరకూ పాతిపెట్టి ఒకరోజుంచి మర్నాడు ఏనుగుతో తొక్కించండి అని భటులను ఆజ్ఞాపించాడు. రామకృష్ణుడికి రాయలటువంటి కఠినమయిన శిక్షవిధించడం అక్కడివారందరికీ బాధకలిగించింది, కాని చాలా కోపంగా ఉన్న రాయలవారికీ ఆ సమయంలో నచ్చజెప్పి అతన్ని కాపాడడానికెవరికీ సాహసం చాలక పోయింది.

రాజాజ్జను జవదాటలేక భటులు రామకృష్ణుని ఊరి చివరకు తీసుకుపోయి గొయ్యి తవ్వి కంఠమువరకూ మట్టికప్పి వెళ్లిపోయారు. ఏనుగుచేత తొక్కించడం మర్నాడు కదా.

రామకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. ఈ గండం నుంచి ఎలా బయట పడడమా అని బుర్రకి పని కల్పించాడు. కొంతసేపయ్యే సరికి ఒక చాకలి చెరువులో ఉతికిన బట్టలమూటను వీపున పెట్టుకుని ఆ తోవన వస్తూ తల మాత్రమే కనిపిస్తున్న మనిషిని, చూసి మొదట భయపడిపోయాడు. కొంచెంసేపు చూసేసరికి ఆ మెడా దాని మీద తలా రామలింగడిదని గుర్తించాడు.

అప్పుడు అతనికి ఆశ్చర్యమేసింది. అతనికి దగ్గరగా వెళ్లి -“అయ్యా!. తమరు తెనాలిరామకృష్ణ కవిగారు కదా? అని అడిగాడు వినయంగా. “ఔను అన్నాడతను నిదానంగా. మనసులో మాత్రం “చిక్కాడు” అని సంతోషిస్తూ. తమ లాంటి వారికి పెద్ద కష్టమెందుకొచ్చిందయ్యా? మిమ్మల్నిలా పాతి పెట్టింది ఎవరు? ఎందుకు? ఆరాలు తీశాడు ఆ గూని చాకలి. “నన్నెవరూ పాతిపెట్టలేదు, ఇది వైద్య విధానం.

కొన్నాళ్ళనుండి నాకు ‘గూని’ వచ్చి సరిగా నడవలేక పోతూంటే వైద్యుడి దగ్గరకెళ్లి చికిత్స అడిగాను. ఆ వైద్యుడు నా సమస్య విని ఇలా రెండు మూడు రోజులు చేస్తే ఎంతటి గూనయినా నయమౌతుందన్నాడు. అందుకని నేనే నన్నిలా పాతిపెట్టించుకున్నాను” అన్నాడు నిబ్బరంగా. ఆ మాటలకి చాకలి మొహం ఆనందంతో ఉబ్బి చాటంతయింది. రామలింగడికి చేతులెత్తి దణ్ణంపెడతూ-“బాబూ! నేను కూడా కొన్నాళ్లనుంచి గూనితో బాధపడుతున్నవాడినే కావాలంటే చూడండి అని తన గూని చూపించి “ఈ గూనివల్ల పనిపొట్లు చేసుకోవడం కష్టంగా ఉంది. పైగా నన్ను నలుగురూ నవ్వుతూ గూనిగూనని వెక్కిరిస్తున్నారు. మీ ‘గూని’ నయమయితే నేను కూడా ఇలా చేస్తాను బాబూ” అన్నాడు.

నాగూని పోయిందో లేదో నన్నుపైకి తియ్యకుండా ఎలా తెలుస్తుంది? ముందు నన్ను బయటకి తియ్యి. నా గూని పోయిందో లేదో చూద్దువుగాని నా గూని పోతే నేను నీకు సహాయం చేస్తాను. అన్నాడు రామలింగడు. ఆ గూని చాకలి గోతిలోని మట్టిని తీసి పక్కకి పోశాడు. రామలింగడు గోతిలోంచి పైకొచ్చి నిటారుగా నిలబడ్డాడు. అతనిని అలా చూసిన చాకలి ఆనందానికీ ఆశ్చర్యానికీ అవధుల్లేవు. “భలే! సిత్రంగా ఉందే తమగూని మాయమైపోయింది.

మీరుచేసినట్లే నేనూ చేస్తాను. నా గూని పోతుంది. నేను గోతిలో నిలబడతాను. తమరు నా కంఠం వరకూ మట్టివేసి గొయ్యి పూద్చండి. ఇలా అడుగుతున్నానని కోపగించుకోకండి,పెద్దలు అంటూ బతిమాలాడు. సరే అని అతన్ని గోతిలోకి దిగమని…. మట్టికప్పి తనదారిన తానుపోయాడు రామలింగడు. ఆ చాకలి అమాయకత్వానికి నవ్వుకున్నాడు.