గూఢచారి విక్రమార్కునికి కాళికాదేవి గురించి తెలియజేయుట



విక్రమార్క భూపాలుడు నగరంలోనే గాక, దేశ దేశాలు గావించి ఆయాప్రదేశముల “వింతలు-విశేషాలు" తెలిసికొనివచ్చి విన్నవించుటకు అనేక మంది భటులను నియమించినాడు. వారు ఆయా ప్రాంతాలను సందర్శించి వచ్చి "వింతలు-విశేషాలు" విన్న వించేవారు.

విక్రమార్కుడు వేట ముగించి, తన పరివారంతో నగరానికి బయలు దేరారు. ఆ సమయంలోకి, దేశ దేశాలను సంచరించే భటులు ఇద్దరు ఒక భిల్లునితో ఆటకు వచ్చి, విక్రమార్కుని చూచి యిలా అన్నారు.

"మహారాజా! మేము అనేక దేశాలు చూచాము. మన సామ్రాజ్యానికి చెందిన అనేక ప్రాంతాలను గూడ చూచి వచ్చాము. సర్వత్రా-మేము జూచిన అన్ని ప్రాంతాలలోను-తమను గూర్చి పొగిడేవారే తప్ప, నిందించేవారే మాకు కన్పించలేదు- మేము చూచిన ఒక ప్రదేశంలో ఒక మహాద్భుతమైన విశేషము కనిపించింది. అదేమనగా- వింధ్యారణ్య సమీపమునగల ఒక కీకారణ్యములో ఒక కాళికామాత ఆలయమున్నది. అందు దేవీ విగ్రహం మహాభీకరాకారము గల్గి యున్నది. దేవీ విగ్రహం ముందు ఒక నుయ్యిలా పెద్ద అఘాతం ఉంది. అందుండి పై వరకు అనేక త్రిశూలములు ఉన్నాయి. వానికి సైన ఒక తొట్టె ఉన్నది. ఆ అఘాతముపై గల గట్టుపై నిలిచి. ఎగిరి ఆ తొట్టెను పట్టుకొని ఖండించిన వానికి దేవి ప్రత్యక్షమై కోరిన వరముల నిచ్చునట! అట్టి ప్రకటన గల శిలాఫలకము అందున్నది.

ప్రభూ! ఆ గట్టున నిలబడి, ఎగిరి, తొనందుకొని ఖండించినచో - అట్టివారు తప్పక. ఆ త్రిశూలములపై బడగలరు; శరీరమున దిగిపోగలవు. ఆ త్రిశూలములంత పదునుగల్గి యున్నవి.

అక్కడ ఆ శిలాఫలకముపై ఉన్న వ్రాత చూచి, భయపడి ఎవ్వరు అందుకు సాహసించుటలేదు. ఇప్పటికీ ఎన్నియో సంవత్సరములనుండి అలాగనే యున్నదట : ఈ భిల్లుడు కూడ ఎన్నియో సంవత్సరాల నుండి చూస్తున్నడట : కానీ, ఇంతవరకునూ అట్టి సాహసం ఎవ్వరూ చేయలేదట: మేమా ప్రాంతమను చూచినాము; అది భయమును గల్గించు చున్నది. దేవరవారు చూడదలచుదురేమోనని యీ బిల్లునికూడా తీసుకొని వచ్చినాము. ఆ మార్గమంతయు వీనికి బాగుగా దెలియును. ఇతని సహాయము తోనే మేమా జగన్మాతను చూడటం, మరల సరియైన మార్గమునకు రావడం జరిగింది" అని విన్నవించారు.

వారిమాటలను ఆలకించిన విక్రమార్కథూపాలునికి ఆ విచిత్రమేమిటో చూడాలని ఉత్సాహము కలిగినది. వెంటనే భట్టిని జూచి "సోదరా! నీవు రాజ్యమునకు పోయి నేను వచ్చువరకు రాచకార్యములు చూచుచుండుము. నేను ఆ విచిత్రమేదియో చూచి వచ్చెదను" అని పలికి భట్టిని రాజ్యమునకు పంపించెను. తాను భిల్లుని సాయముతో ఆ కీకారణ్యమునకు బయలుదేరెను.