ఇంద్రుడు కర్ణుని కవచకుండలములు కోరుట



ఒక రోజు బ్రాహ్మణ వేషధారియై ఇంద్రుడు కర్ణుని వద్దకు వచ్చాడు. ఆ సమయంలో కర్ణుడు సూర్యోపాసన చేసి బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు " భిక్షాందేహి " అన్నాడు. కర్ణుడు "మీకు ఏమి కావాలో కోరుకోండి " అని అడిగాడు. ఇంద్రుడు " నీవు సత్యవ్రతుడవైతే నాకు నీ కవచ కుండలాలు కోసి ఇమ్ము " అన్నాడు. కర్ణునికి విషయం అర్ధం అయింది. కర్ణుడు "బ్రాహ్మణోత్తమా! ఎందుకు పనికి రాని ఈ కవచకుండలాలు నీ కెందుకు వాటికి బదులుగా ధనం, బంగారం, మణి మాణిక్యాలు కోరుకో " అన్నాడు. ఇంద్రుడు తనకు కవచ కుండలాలు మాత్రమే కావాలని పట్టుబట్టాడు. కర్ణుడు " బ్రాహ్మణోత్తమా! కవచం నా శరీరంతో పుట్టింది.

కుండలాలు అమృతం నుండి పుట్టినవి. అవి ఉండగా నన్నెవరు చంపలేరు. ఇవి లేకపోతే శత్రువులు నా మీదకు తేలికగా వస్తారు. కాబట్టి వాటిని ఇవ్వలేను. ఓ విప్రుడా! పోనీ నా ఈ విశాల సామ్రాజ్యాన్ని ఇస్తాను తీసుకో " అన్నాడు. అందుకు దేవేంద్రుడు అంగీకరించ లేదు. అంత కర్ణుడు నవ్వి" దేవా! నిన్ను నేను గుర్తుపట్టాను. నీవు దేవేంద్రుడవు మేము దేవతలైన మిమ్ము వరం అడగాలి కాని మీరు వచ్చి నన్ను యాచించటం తగునా. వింతగా ఉందే " అన్నాడు. దేవేంద్రుడు " కర్ణా! నీకు నీ తండ్రి సూర్యుడు అన్ని విషయములు చెప్పి ఉంటాడు. అందుకనే నన్ను గుర్తించావు. నేను కోరిన కవచ కుండలాలు నాకు ఇవ్వు. బదులుగా నా వజ్రమును తప్ప మరేది కావాలన్నా ఇస్తాను కోరుకో" అన్నాడు.

కర్ణుడు "దేవా! బదులుగా నాకు నీ వద్ద ఉన్న సకల శక్తి సంపన్న మైన శక్తి అనే ఆయుధాన్ని ప్రసాదించి కవచ కుండలాలను గ్రహించండి " అన్నాడు. ఇంద్రుడు శక్తిని ఇవ్వడం గురించి ముహూర్త కాలం ఆలోచించి " కర్ణా! నీకు శక్తిని సంతోషంగా ఇస్తాను. అయితే ఒక్క నియమం. యుద్ధ సమయంలో నేను శత్రువులపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించిన అది శత్రు సంహారం చేసిన తరువాత నాదగ్గరకు వస్తుంది. కానీ నీవు నీ శత్రువుపై ఆ శక్తి ఆయుధాన్ని ప్రయోగించగానే అది ఆ ఒక్కడిని మాత్రమే చంపి మళ్ళీ నా దగ్గరకు వస్తుంది.

కనుక దానిని నీవు ఒకసారి మాత్రమే ప్రయోగించగలవు. ఈ నియమానికి అంగీకరించి శక్తి ఆయుధాన్ని తీసుకో " అన్నాడు. కర్ణుడు " దేవేంద్రా! నన్ను ఎప్పడూ భయపెడుతూ రణరంగంలో ప్రతాపాన్ని ప్రదర్శిచే ఒకే ఒక్క శత్రువు వున్నాడు. అతనిని చంపాలను కుంటున్నాను. ఈ శక్తి ఆయుధం అతనిని వధించిన చాలు " అన్నాడు. ఇంద్రుడు నవ్వి " కర్ణా! నీ మనోరథం నాకు తెలియును. నీవు అర్జునుని చంపాలని అనుకుంటున్నావు. కాని కృష్ణుడు అర్జునిని పక్కన ఉన్నంత కాలం నీవు ఏమీ చేయలేవు " అన్నాడు.

"అయినా సరే ఒక్కరినే చంపగల ఆ అమోఘశక్తిని నా కిమ్ము" అని కర్ణుడు "దేవా! కవచ కుండలములు చీల్చి ఇచ్చిన నా శరీరం వికృతం అవుతుంది కదా ఎలా? " అన్నాడు. ఇంద్రుడు " కర్ణా! నీకు ఆ చింత లేదు. నీకు గాయం కూడా కాదు. నీ శరీరం నీ తండ్రి సూర్యునిలా ప్రకాశిస్తుంది " అని వరం ఇచ్చి" కర్ణా! నీ దగ్గర మరొక ఆయుధం ఉన్నప్పుడు, ప్రాణసంకట స్థితి లేనపుడు ఈ అమోఘ శక్తి ని ప్రయోగిస్తే అది ప్రయోగించిన వాడి మీదనే పడుతుంది కాబట్టి ఏమరుపాటుతో వుండు" అని చెప్పి కవచ కుండలాలను తీసుకుని దేవేంద్రుడు దేవలోకం వెళ్ళాడు. ఈ వృత్తాంతం తెలిసి పాండవులు ఆనందించారు కౌరవులు దుఃఖించారు. జనమేజయా ఈవిధంగా ఇంద్రుడు మాయోపాయంతో కర్ణుని కవచ కుండలాలు సంగ్రహించాడు " అని వైశంపాయనుడు జనమే జయునకు చెప్పాడు