జమీందారుగారి పడవవాడు


చంద్రగిరి జమీందారుకు పడవ నడిపేవాడు కావాలని ప్రకటన ఇచ్చాడు ఆయనకు దగ్గర్లో వున్న నదిలో సాయంత్రం వేళల్లో పడవ షికారు చేయడమంటే చాలా ఇష్టం. నది కొండ వారగా ఎన్నో మలుపులు తిరుగుతూ చాలా ఉదృతంగా ప్రవహించేది. అందువల్ల పడవా నడిపేవాడు చాలా నేర్పరి అయి వుండాలని ఆయన షరతు పెట్టాడు.
ఆయన చెప్పిన విధంగా దివాన్ చాలామందిని పరీక్షించి చివరకు పోలయ్య జాలయ్య అనే వాళ్లను జమీందారు దగ్గరకు తీసుకొచ్చి అయ్యా! ఈ పోలయ్య పడవ నడపడంలో మంచి నేర్పరేగాక, గజ ఈతగాడు పోతే ఈ జాలయ్యకూడా పడవ నడపడంలో చెప్పుకోదగిన నేర్వరే కానీ అంతపెద్ద ఈతగాడు మాత్రం కాదు అని చెప్పాడు. అందరు ఆ ఇద్దర్నీ రేవు రమ్మని చెప్పి, వాళ్ళు వెళ్ళిపోగానే దివాన్తో జాలయ్యను రేపు రాగానే పన్లోకి తీసుకోండి అని చెప్పాడు.
అందుకు దివాన్ ఆశ్చర్యపోతూ "అయ్యా! అదేమిటి? గజ ఈతగాడు పోలయ్యని కాదని, అంతగా ఈతరాని ఆ జాలయ్యకి పని ఇద్దామనుకుంటున్నారు" అన్నాడు. అమీందారు మందహాసం చేసి "పడవ నడపడంలో ఇద్దరూ నేర్వరులే, ఇక ఈతలో మాత్రం ఆ పోలయ్య ఘటికుడు అలాంటినాడు తగినంత జాగ్రత్తగా వుండడు. కారణమేమిటంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా సునాయాసంగా నదిని ఈదుకు పోగలనన్న ధైర్యం వాడికుంటుంది. జాలయ్యకు అంతగా ఈతరాదు. కనుక పడవ నడపడంలో అతి జాగ్రత్తగా వుంటాడు. అలాంటివాడి చేతిలో వాడి ప్రాణానికే కాదు. నా ప్రాణానికి ముప్పు వుండదు. అవునా?" అని అడిగాను.
"నేనింత దూరం ఆలోచించలేదు. తమరు ఆ ఇద్దర్నీ బాగా అంచనా వేశారు!" అన్నాడు దివాను తృప్తిగా.