కష్టార్జితం కానిది


ఒక పాల వ్యాపారస్తుడు ఆరోగ్య శాఖ వారి అజాగ్రత్త వల్ల పాలలో నీటిని అధికంగా కలిపి డబ్బు బాగా సంపాదించేడు. అక్కడితో అతనికి ఆశ తీరలేదు. యింకా గేదెలను కాని వాటి పాల మీద ఇంకా అధిక లాభాలు తియ్యాలని ఊహించి, పన్నెండు వందల రూపాయలు సంచిలో వేసుకొని, పశువుల సంతకు బయలుదేరెను.

ఆనాడు ఎండ చాలా తీవ్రంగా వుండటం వల్ల అతను చాలా అలసిపోయి ఒక చెరువు గట్టున వున్న చెట్టు క్రింద నిద్రపోయెను. నిద్రపోయేముందు రూపాయల సంచిని తలక్రింద పెట్టుకుని పడుకున్నాడు.
అంతలో ఎక్కడనుంచో ఒక కొండముచ్చు అక్కడకు వచ్చి అతని తలక్రింద వున్న సంచిలో ఏదో తిను బండారము వుందనుకుని, దాన్ని లాక్కుని ఒక్క దూకున చెట్టు మీదకెక్కి చిటారు కొమ్మమీద కూర్చున్నది.
దానితో ఆయనకి నిద్రాభంగం కలిగి, సంచిని కొండముచ్చు పట్టుకొనడం చూచి లబోదిబోమని గోలపెట్టసాగాడు. కానీ, ఆ లోపలే అది సంచిని విప్పి, లోపలనున్న రూపాయలను ఒక్కొక్క దానినీ గట్టుమీద పడవేయడం మొదలు పెట్టింది.
పాలవాడికి, పాలలో నీరు జోరుగా కలపడం తప్ప చెట్టెక్కడం నీటిలో ఈదడం రాదు. కనుక పెయ్యమ్మలాగ నోరు తెరుచుకుని దాన్ని చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపటికీ కొండముచ్చు తన పని పూర్తి చేసుకుని ఇంకొక చెట్టుమీదకి ఎగిరి పోయింది.
పాలవాడు గట్టుమీదనున్న రూపాయలను ప్రోగుచేసుకుని లెక్క పెట్టుకొనగా అని నాలుగు వందలు మాత్రమే వున్నాయి.

అప్పుడు, ఒక నేరు చిక్కని పాలలో రెండు శేర్లు నీళ్ళు కలిపి అమ్మిన కారణంగా కూడగట్టిన పన్నెండు వందల రూపాయల్లో ఎనిమిది వందలు నీటి పాలైపోయినా, పాల సొమ్ము మాత్రమే తనకు దక్కినదని నీటి డబ్బు నీటికే దక్కివదని అనుకుని పుసూరుమంటూ తిరుగుముఖం పట్టాడు.