కీచక వధ



కీచకుడు వెళ్ళగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళింది. అక్కడ భీమునితో నేను నాపని పూర్తి చేసాను. ఇక మీ పని మీరు పూర్తి చెయ్యండి. ఈ రాత్రికి కీచకుని చంపాలి ఎలా చంపుతారో చెప్పండి అన్నది. భీముడు ద్రౌపదితో ద్రౌపదీ! నీవు కీచకుడు ఏమి మాట్లాడుకున్నారో చెప్పు అని అడిగాడు. ద్రౌపది జరిగినది చెప్పగానే అది విన్న భీముడు ఆహ్లాదం పొందాడు.

భీముడు ద్రౌపదీ ! ఇక చాలు ఆ కీచకుని మీద పగ తీర్చుకుంటాను కాని అతడు చెప్పినట్లు ఒంటరిగా వస్తాడా! లేక బుద్ధిహీనుడై అందరికి చెప్తాడా? అయినా ఎందుకు చెబుతాడులే. వాడు నర్తనశాలకు తప్పక వస్తాడు. నిశ్చలంగా పడుకున్న నన్ను తడిమి చూస్తాడు. నీవు కాదని తెలిసుకుంటాడు. నేను ఒడిసి పట్టుకుని వాడి అంతు చూస్తాను. వాడు నా చేతిలో హతం కావడం నిశ్చయం ద్రౌపదీ! ఇక నీవు నిశ్చింతగా ఉండు అన్నాడు.

భీముని ఆవేశం చూసి ద్రౌపది భయపడింది. కోపావేశంలో గుట్టు బయటపడి అజ్ఞాతవాస భంగం ఔతుందేమో అనుకున్నది. ద్రౌపది భీమసేనా! కోపావేశంలో గుట్టు రట్టు చేయకు ధర్మరాజాదులు అజ్ఞాతవాస భంగానికి మనమే కారణమని నిందిస్తారు. కార్యాన్ని అతి గుప్తంగా పూర్తి చేయాలి అన్నది.

భీమసేనుడు ద్రౌపదీ !వాడు ఎదిరించి నిలబడితే ఇది రహస్యంగా చేయాలని గుర్తుంటుందా. అయినా నీవు చెప్పినట్లు రహస్యంగా చంపడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ద్రౌపది సుధేష్ణ నా కొరకు వెతుకుతుంటుంది నేను పోయి వస్తాను అని వెళ్ళి పోయింది.

కీచకుడు మనసు పరి పరి విధాల తపిస్తుంది అతడు మనసులో అయ్యో ! ఎంతకీ రాత్రి కాదేమి. మాలిని వస్తుందో రాదో, వచ్చినా ఏమంటుందో, రాత్రిలోగా మనసు మారుతుందేమో, ఆమెకు అయిదుగురు గంధర్వులు భర్తలుగా ఉన్న మాట నిజమేనా, మాలిని వచ్చే వేళకు సుధేష్ణ ఏదైనా పని చెప్తుందేమో అనుకున్నాడు. మరలా మాలిని ఎందుకు రాదులే అంత కఠినాత్మురాలా . ఆమె వచ్చే ముందు నేనే ఆమెను తీసుకురావచ్చు కదా అనుకున్నాడు.

కీచకుడు ఉద్యానవనంలో విహరిస్తూ అస్తమించనందుకు సూర్యుని నిందించాడు. తన కోసం బ్రహ్మ రాత్రి రాకుండా పగలే ఉంచాడని అనుమానపడ్డాడు. ఎట్టకేలకు సూర్యుడు అస్తమించాడు. చంద్రోదయం అయింది ద్రౌపది కూడా సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది. చంద్రుడు కూడా అస్తమించాడు. బాగా పొద్దు పోగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళి సమయం ఆసన్నమయినదని భీమసేనుని తొందర పెట్టింది. భీముడు ఒక చీరని తలపాగాలా చుట్టుకుని నర్తనశాలకు బయలుదేరాడు. ద్రౌపది అతనిని అనుసరించింది.

ఇద్దరూ నర్తనశాలను చేరుకున్నారు. నర్తనశాలలో ఒక పక్కగా ఉత్తర పడుకునే పాన్పు మీద భీముడు పడుకున్నాడు. ద్రౌపది పక్కనే కనపడకుండా దాక్కున్నది. ఇంతలో కీచకుడు మధ్యం సేవించి మత్తుగా అక్కడకు వచ్చాడు. మాలిని అప్పటికే అక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాడు. మంచంలో పడుకున్న భీముని చూసి పిచ్చివాడై తన చేతిని ఆ శయ్య పై వేసాడు.

భీమునికి పట్టరాని కోపం వచ్చింది. కీచకుడు భీమునిపై చేయి వేసి మాలినీ! నీ కోసం ఎన్నో కానుకలు తెచ్చాను. ఇంత వరకు నా కోసం వచ్చే స్త్రీలు నాకు కానుకలు సమర్పించే వారు. నన్ను చూసిన స్త్రీలు మరొకరిని కన్నెత్తి చూడరు. నా కోసమే తపిస్తారు. అలాంటిది నేను నీకోసం తపిస్తున్నాను అన్నాడు కీచకుడు.

భీముడు కూడా స్త్రీ సహజమైన గొంతుతో మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు కాని అసలు నా వంటి స్త్రీ మీకు దొరుకునా. నా శరీరానికి నీశరీరం తగిలినప్పుడు కలిగే అనుభూతి తెలుసుకుంటావులే. నన్ను తాకిన నీకు మరొకరిని తాకే పని ఉండదులే . నన్ను తాకిన ఫలితం అనుభవిస్తావులే అని తటాలున పైకి లేచాడు. కీచకుని తల పట్టుకుని వంచాడు. కీచకుడు మాలిని భర్త గంధర్వుడు వచ్చాడు అనుకున్నాడు. భీముని పట్టు విడిపించుకుని కింద పడవేసి మోకాళ్ళతో అదిమాడు.

ఇరువురి మధ్య భయంకర యుద్ధం సాగింది. ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు. ఇరువురిలో కొంత భయం ఉంది పరువు పోతుందని కీచకుడు అజ్ఞాతవాస భంగం ఔతుందేమోనని భీముడు మౌనంగా యుద్ధం చేస్తున్నారు. క్రమంగా కీచకుని బలంతగ్గి పోయింది భీముని బలం ద్విగుణీకృతం అయింది. ఆ విషయం గ్రహించిన భీముడు కీచకుని ఉదరభాగంలో భయంకరంగా పొడిచాడు. ఆ దెబ్బకు కీచకుడు విలవిలా తన్నుకున్నాడు. కీచకుని దారుణంగా చంపాలనుకున్న భీముడు కీచకుని తలని, కాళ్ళను, చేతులను మొండెంలోకి జొనిపి నేల మీద వేసి పొర్లించి నలిపి మాంసం ముద్దగా చేసాడు. కీచకుడు మరణించాడు.

భీముడు ద్రౌపదిని పిలిచి కీచకుని శవాన్ని చూపించాడు. ద్రౌపది ఆనందంగా చూసింది. ఆమె మనసులో కీచకా! ఇందుకా ఈ సుఖం పొందటానికా ఇంతగా ఆరాట పడ్డావు అనుకున్నది. భీముడు ద్రౌపదీ! నీ మాట నెరవేర్చాను ఆనందమేగా. నిన్ను ఎవరైనా దుర్బుద్ధితో చూస్తే వారికి నా బుజబలంతో ఇలాంటి మరణాన్ని ప్రసాదిస్తానని తెలుసుకున్నావా. నీ మనసు శాంతించింది కదా అన్నాడు.

ద్రౌపది ఆనందంతో నిన్న కొలువులో కీచకుడు నన్ను అవమానించినప్పుడు నీవు చూపిన నిగ్రహం మెచ్చతగినది. ఈ నాడు ఇలా మరొకరి సాయం లేక కీచకుని వధించిన నీ శౌర్యం కొనియాడ నా తరమా భీమసేనా అన్నది. ద్రౌపది మాటలకు భీముడు పొంగిపోయాడు. అతనిలో వివేకం మేలుకొంది. ద్రౌపదీ ఇక నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు వెళుతున్నాను అని చెప్పి వడివడిగా వంటశాలవైపు వెళ్ళాడు.