కుశికుని కోరిక



రాజు మహానుభావా ! నిన్ను సేవించడం కంటే వేరు వరము ఎందుకు. మీరు మా ఇంటికి వచ్చి నివసించిన రోజులు ఉన్న కాలంలో అనేక అద్భుతాలు జరిగాయి అందుకు కారణం తెలుకోవాలని అనుకుంటాను అని అడిగాడు. చ్యవనుడు రాజా ! ఒక సారి బ్రహ్మదేవుడు దేవతలు మునులు ఉన్న సభలో ఇలా అన్నాడు భృగువంశము కుశికవంశము వాటి లక్షణాలైన బ్రాహ్మణము, క్షాత్రము మారిపోయి వర్ణసంకరం జరుగుతుంది అని చెప్పడం నేను విన్నాను.

భృగువంశానికి వర్ణసంకరం జరగడం సహించలేక నేను కుశికవంశమును నాశనం చేద్దామని మీ వద్దకు వ్రతము నెపముతో వచ్చాను. నేను మిమ్ము పెట్టే కష్టాలు సహించలేక మీరు నన్ను నిందిస్తారని నేను మిమ్ము శపించవచ్చని అనుకున్నాను. కాని మీరు చూపించిన సహనానికి నేను ఆనందించి మీకు వరాలు ఇస్తాను అన్నాను. మీరు వద్దన్నారు.

మీకు స్వర్గం ఎలా ఉంటుందో చూపాను. రాజా ! నీకు క్షాత్రము కంటే బ్రాహ్మణము మీద మక్కువ ఎక్కువ. నీకు మూడో తరంలో ఒక బ్రహ్మతేజోదీప్తుడు జన్మిస్తాడు. ఇక నీకు కావలసిన వరము కోరుకో అన్నాడు. కుశికుడు మహాత్మా ! ఇంతకంటే కావలసిన వరము ఏమిటి ? నా సంతానముకు ధర్మతత్పరత, బ్రాహ్మణత్వము కలిగేలా చూచి అనుగ్రహించు అని వేడుకున్నాడు. చ్యవనుడు రాజా ! నీ కోరిక నెరవేరుతుంది. నీ మనుమడు త్రిలోక పూజితుడు ఔతాడు అని అన్నాడు.

కుశికుడు చ్యవనుడి ముందు ఒక సందేహం వెలిబుచ్చాడు. మునీంద్రా ! నా మనుమడు ఏ ప్రకారంగా బ్రాహ్మణత్వం పొందుతాడో చెప్పండి అని అడిగాడు. చ్యవనుడు రాజా ! నా వంశంలో రుచీకుడు అనే వాడు జన్మిస్తాడు. అతడు నీ కుమారుడు గాధి కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఆ రుచీకుడికి జమదగ్ని అనే కుమారుడు జన్మిస్తాడు. ఆ జమదగ్ని ధనుర్వేదమును కూలంకుశంగా అభ్యసిస్తాడు.

జమదగ్ని కుమారుడైన రాముడు తండ్రి నుండి ధనుర్వేదమును అభ్యసిస్తాడు. ఆ ధనుర్వేదవిద్య సమస్త రాజలోకమును నాశనం చేస్తుంది. ఇది విధివిలాసం. విధివిలాసం వలననే గాధి భార్య, ఋచీకుడి భార్య అనాలోచితంగా చేసిన పనివలన సద్బ్రాహ్మణుడైన ఋచీకుడికి మనుమడిగా క్షాత్ర ధర్మావలంబికుడైన పరశురాముడు జన్మిస్తాడు.

క్షత్రియుడైన కుశికుడికి మనుమడుగా బ్రాహ్మణత్వము అవలంబించిన విశ్వామిత్రుడు జన్మిస్తాడు. ఈ వర్ణసంకరము జనుల చేత శ్లాఘించబడి కీర్తిదాయకమౌతుంది. ఇలా బ్రహ్మవాక్కు ఫలించి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇక నేను తీర్ధయాత్రకు వెడతాను. మీరు సుఖంగా ఉండండి అని పలికి చ్యవనుడు వెళ్ళి పోయాడు. ధర్మనందనా ! ఇది విశ్వామిత్ర పరశురాముల వృత్తాంతము అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.