లక్క ఇల్లు



దుర్యోధనుడు తన కపటోపాయం ప్రకారం కొందరు మంత్రులను పంపి పాండవులకు వారణావతం గురించి ఆసక్తి కలిగేలా చెప్పించాడు. గొప్పగా వర్ణించిన వారణావతం చూడాలన్న కుతూహలం పాండవులలో కలిగింది. ఒకరోజు దృతరాష్ట్రుడు పాండవులను పిలిచి "వారణావతంలో మీ తల్లితో కొంతకాలం విశ్రాంతి తీసుకుని రండి. గంగా నదీ తీరాన ఉన్న ఆ నగరం అత్యంత సుఖప్రథమైన నగరం అని విన్నాను." అన్నాడు. పెద్ద తండ్రి ప్రేమతో చెప్పిన మాటను తిరస్కరించ లేక ధర్మరాజు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల ఆశీర్వాదం తీసుకుని తల్లిని, తమ్ములను వెంట పెట్టుకుని వారణావతం బయలుదేరాడు. ఇది చూసిన దుర్యోధనుడు ఆనంద పడ్డాడు.

దుర్యోధనుడు పురోచనుడు అనే గృహ నిర్మాణ నిపుణుని పిలిచి వారణావతంలో పాండవుల కొరకు లక్క, మట్టి, నెయ్యి, మిశ్రమంతో చేసిన గృహాలను నిర్మించమని చెప్పాడు. వాటిలో పాండవులు ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి ఆగృహాలను తగులపెట్టమని, వారి మరణ వార్త తీసుకువస్తే నీవు జీవితాంతం భోగాలను అనుభవించవచ్చు అని అతనిని ప్రలోభ పెట్టాడు. పురోచనుడు అందుకు అంగీకరించాడు. తల్లితో సహా వారణావతానికి బయలుదేరుతున్న పాండవులను చూసి పౌరులు పాండవుల అడ్డు తొలగించు కోవాలని వారిని వారణావతానికి పంపుతున్నారని గ్రహించారు.

భీష్ముడు మొదలైన వారు అడ్డు చెప్పనందుకు కలత చెందారు. పాండవులు లేని రాజ్యంలో ఉండలేమని భావించి వారి వెంట నడవ సాగారు. విదురుడు మాత్రం మరికొంత దూరం వారి వెంట వెళ్ళి నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పాడు. తరువాత కుంతీ దేవి వద్ద శెలవు తీసుకుని మరలి వెళ్ళాడు. విదురుని మాటలు అర్ధం కాని కుంతీ దేవి విదురుడు ఏమి చెప్పాడు అని ధర్మరాజుని అడిగింది. ధర్మరాజు తల్లితో "అమ్మా విషాగ్నుల వలన అపకారం జరుగవచ్చని అప్రమత్తంగా ఉండమని చెప్పాడు. విదురుని ప్రేమకు కుంతీతో సహా అందరూ ఆనందించారు.

వారణావతం చేరిన పాండవులకు, కుంతీదేవికి వారణావత ప్రజలు ఘనంగా స్వాగతం చెప్పారు. వారికోసం పురోచనుడు నిర్మించిన గృహాలను చూపి ఉండమన్నారు. శిల్పాచారుడైన పురోచనుని పాండవులు తగిన విధంగా పూజించి సత్కరించారు. పుణ్యాహవచనం చేసి గృహప్రవేశం చేసారు. ఆ గృహాన్ని అణువణువు పరిశీలించిన ధర్మరాజుకు అందులో ఏదో కృత్రిమత్వం గోచరించింది. భీముని పిలిచి ఆగోడలను చూపి వాటి నుండి ఏదో వింత వాసన వస్తుందని చెప్పాడు. భీముడు అది చూసి "అన్నయ్యా వీటి నుండి లక్క, తైలం కలిపిన వాసన వస్తుంది. గృహం సమీపంలో ఆయుధాగారం ఉంది. ప్రమాదం పొంచి ఉంది" అని అభిప్రాయం వెలిబుచ్చాడు.

విదురుడు చెప్పిన విషాగ్నులు ఇవే నని వారికి అర్ధం అయింది. భీముడు ఆవేశపడి "అన్నయ్యా మనం ఇప్పటి వరకూ ఉన్న పాత ఇంటిలో ఉండి పురోచనుని ఇంటినీ తగులపెడదాము" అన్నాడు. దర్మరాజు భీమునితో "భీమా తొందరపడకు. విషయం మనకు తెలిసింది కనుక అప్రమత్తంగా ఉందాము. మనకు ఈ విషయం తెలిసిందని తెలిస్తే దుర్యోధనుడు పురోచనుడు వేరే ఉపాయం పన్నుతారు. అది మనకు తెలిసే అవకాశం రాక పోవచ్చు కనుక ఏమీ తెలియనట్లు ఉందాము" అన్నాడు. పురోచనుడు పాండవుల సేవ నిమిత్తం ఒక బోయ వనితను నియమించాడు. ఆమెకు ఐదుగురు కొడుకులు. వారంతా పాండవుల కదలికలను ఎప్పటికప్పుడు పురోచనునిని చేరవేస్తున్నాడు.

హస్థినలో దుర్యోధనుని కుతంత్రం తెలుసుకున్న విదురుడు ఒక మనిషిని పాండవుల వద్దకు పంపాడు. విదురుడు చెప్పిన సంకేతం చెప్పి తనను పరిచయం చేసుకున్నాడు. అతడు ధర్మరాజుతో "ధర్మ నందనా రాబోవు కృష్ణ చతుర్ధశి నాడు పురోచనుడు లక్క ఇంటిని తగుల పెట్టకలడు. కాబట్టి ఈ గృహం నుండి సొరంగ మార్గం త్రవ్వమని విదురుడు నన్ను పంపాడు" అన్నాడు. ధర్మరాజు విదురుని దూరదృష్టికి ఆశ్చర్య పడి ఆ ఖనకుడికి అనుమతి ఇచ్చాడు. ఖనకుడు లక్క ఇంటి నుండి వెలుపలికి బిల మార్గం ఏర్పాటు చేసాడు. భీముడు దానిని పరిశీలించి తృప్తి పడ్డాడు.

కృష్ణ చతుర్ధశి నాడు కుంతీదేవి వారణావతంలోని ముత్తైదువలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణలిచ్చి సత్కరించింది. ఆ రోజు రాత్రి బోయ వనిత కొడుకులతో కల్లు సేవించింది అందరూ మత్తుగా నిద్రలోకి జారుకున్నారు. తరువాత భీముడు తల్లిని సోదరులను సొరంగ మార్గంలో పంపించి ముందుగా పురోచనుని ఇంటికి నిప్పు పెట్టి ఆ తరువాత తాము నివసించిన ఇంటికి నిప్పు పెట్టి ఆఖరుగా ఆయుధాగారానికి నిప్పు పెట్టి ఖనకుడికి తాము క్షేమంగా ఉన్నామని చెప్పాడు. ఆ తరువాత తాను కూడా సొరంగ మార్గం ద్వారా అన్న తమ్ములను, తల్లిని కలుసుకున్నాడు. వడి వడిగా నడుస్తూ వెళుతున్న వారు భీముని వేగాన్ని మిగిలిన వారు అందుకోలేక పోయారు.

భీముడు తల్లిని వీపు మీద ఎక్కించుకుని ధర్మరాజుని, అర్జునిని చెరిఒక భుజంపై ఎక్కించుకుని నకుల, సహదేవులను రెండు చేతులతో ఎత్తుకుని వడి వడిగా నడిచాడు]. తెల్లవారగానే వారణావత ప్రజలకు లక్క ఇల్లు తగలబడిన విషయం తెలిసింది. దృతరాష్ట్రుని కుయుక్తికి ప్రజలు ఎంతగానో అతనిని నిందించారు. అందరూ వచ్చి బూడిదకుప్పలలోని బోయ వనితను ఆమె కుమారుల శవాలను చూసి కుంతీదేవి పాండవులనుకుని భోరున విలపించారు. ఖనకుడు జనంలో చేరి పోయాడు. బూడిద కుప్పలను తొలగిస్తున్నట్లు నటిస్తూ తాను త్రవ్విన సొరంగ మార్గంలో పోసి దానిని కనపడకుండా చేసాడు. వెంటనే హస్థినా పురానికి వెళ్ళి విదురునికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారని చెప్పాడు.

భీష్ముడు, కృపుడు, ద్రోణుడు ఎంతో దుఃఖించారు. వారితో చేరి విదురుడు దుఃఖిస్తున్నట్లు నటించాడు.