మాతృవేదన



ఆ చెట్టు రంధ్రంలో ఒక ఎలుక నివాసముంటుంది. మాంసపు ముద్దలుగా ఉన్న మేము గనక ఆ రంధ్రంలోనికి వెళ్తే అందులోని ఎలుక చంపి తింటుంది. ఇక్కడే చెట్టుపై ఉంటే అగ్ని కాల్చివేస్తాడు. కాబట్టి ఎలుక చేతిలో నీచమైన చావు పొందేకంటే అగ్ని చేతిలో కాలిపోతే పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి అని తల్లితో చెప్పాడు.

కష్ట సమయంలో అనుమానంతో కూడుకొన్న పని చేయాలి కాని తప్పకుండా జరుగుతుందన్న పనిని చేయకూడదు. ఇక్కడ తప్పకుండా జరిగే పని రంధ్రంలోనికి గనక వెళ్తే ఎలుక చేతిలో చనిపోవడం. అనుమానంతో కూడిన పని గాలి వలన మంటలు తొలగిపోవచ్చు.

అమ్మా నీవు వెళ్ళమన్న చోటికి మేము వెళ్ళము. మాపై ప్రేమను వదలిపెట్టి నీవు వెళ్ళిపో. నీవు గనక బ్రతికి ఉంటే మళ్ళి మాలాంటి సంతానాన్ని పొందవచ్చు. నీ పుణ్యం వల్ల మంటల బారినుండి కలిగే ఆపద తొలగిపోతే నీవు మా వద్దకు వచ్చి పోషింతువు అని తల్లికి నమస్కరించారు. దగ్గరికి వచ్చే మంటలను చూసి ప్రాణభయంతో జరిత ఆకాశంలోకి ఎగిరి వెళ్ళింది.

నలుగురు పక్షి కుమారులు బ్రహ్మముఖాలవలె నాలుగు వేదాలలోన మంత్రాలతో మాకు శరణు ఇమ్మని అగ్నిదేవుడిని ప్రార్థించారు.

అగ్నిదేవుడు మందపాలుడి ప్రార్థనను గుర్తుకుతెచ్చుకొని ఆ నలుగురు పక్షి కుమారులు ఉన్న వృక్షాన్ని కాల్చక వదలివేస్తాడు. (మందపాలుడు జరితను, కుమారులను ఖాండవ వనంలో వదలివెళ్ళేటప్పుడు వారికి ఎలాంటి ఆపద తలపెట్టకుమని అగ్నిదేవుడిని ప్రార్థిస్తాడు.) అగ్నిదేవుడు తన కుమారులను కాల్చక వదలిపెట్టడాన్ని చూసి జరిత సంతోషించి తన కుమారుల దగ్గరికి వచ్చి సుఖంగా ఉంది.