మాయలేడి



రావణుడు " మారీచా నీవు మాయలేడి రూపం ధరించి సీతను ప్రలోభ పెట్టు. సీత ఆ లేడిని కావాలని కోరుతుంది. రాముడు బంగారు లేడి కోసం వెళ్ళినప్పుడు నేను సీతను అపహరిస్తాను. సీతా వియోగంతో రాముడు పరితపిస్తాడు " అన్నాడు. రావణాసురుని ఆదేశం మేరకు మారీచుడు బంగారు లేడి రూపంలో ఆశ్రమ సమీపంలో తిరుగుతున్నాడు. విధి ప్రేరితయై సీత బంగారు లేడిని తెమ్మని రాముని కోరింది.

రాముడు సీత రక్షణను లక్ష్మణునుకి అందించి బంగారు లేడి కోసం వెళ్ళాడు. అందినట్లే అందుతూ ఆలేడి రాముని అడవిలో చాలా దూరం తీసుకు వెళ్ళింది. అప్పటికి రాముడు యదార్ధం గ్రహించి శరం సంధించి మారీచుని కొట్టాడు. మారీచుడు " హా సీతా, హా లక్ష్మణా " అని రాముని కంఠాన్ని అనుకరిస్తూ ప్రాణాలు వదిలాడు. ఆ అరుపులు విన్న సీత " లక్ష్మణా! మీ అన్నయ్య ఆపదలో ఉన్నట్లున్నాడు. నీవు వెళ్ళి రక్షించు " అన్నది. లక్ష్మణుడు " అమ్మా! సీతా మా అన్నయ్య పరాక్రమ వంతుడు. భయపడకుము మా అన్నయ్య శత్రుసంహారం చేసి రాగలడు " అన్నాడు. సీతకు కోపం వచ్చింది.

ఆ ఆవేశంలో లక్ష్మణుని పై అనుమానం వచ్చింది. "లక్ష్మణా! నీ తలపు అర్ధం అయింది నీకు నా మీద ఆశ ఉంది. నేను చావనైనా చస్తాను కాని నీకు దక్కను " అని కఠోరంగా పలికింది. ఆ మాటలు భరించలేని లక్ష్మణుడు విల్లంబులు పట్టుకుని రాముడు వెళ్ళిన మార్గంలో వెళ్ళాడు.అవకాశం కోసం చూస్తున్న రావణుడు సన్యాసి వేషంలో అక్కడికి వచ్చాడు. మార్గాయాసంతో అలసినట్లు కనిపిస్తున్న రావణుని చూసి అతిథి సత్కారాలు చేసింది.

సీతను చూసిన రావణుడు మోహవివశుడై " సుందరీ! నా పేరు రావణుడు, దానవ నాయకుడను నా రాజధాని లంక. నీవు నన్ను భర్తగా వరించి భోగాలు అనుభవించు. రాజ్యాన్ని కోల్పోయి అడవుల వెంట తిరుగుతున్న రామునితో ఏమి సుఖపడతావు. వేరు ఆలోచించక నన్ను వరించు " అన్నాడు. సీత " అయ్యా! మీరు ఇలా మాట్లాడటం తగునా! సూర్యచంద్రులు తేజం కోల్పోయినా, ఆకాశం నేల కూలినా, సముద్రములు ఇంకి పోయినా, భూమి బద్దలు అయినా నేను నా భర్త రాముని తప్ప అన్యుని తలవను " అన్నది.

రావణుడు సీతను బలవంతంగా పట్టుకుని ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు సీత పెద్దగా కేకలు వేస్తూ " దేవతలారా ! నేను జనక మహారాజు కూతురిని, రాముని భార్యను. ఈ రావణుడు నన్ను బలవంతంగా ఎత్తుకు పోతున్నాడు. మీకు నమస్కరిస్తాను నన్ను కాపాడండి " అని రోదించింది. ఆ అరుపులు జటాయువు అనే పక్షి విని రావణుని అడ్డగించాడు.

" ఓరి రావణా! ఈమెను ఎందుకు బలవంతంగా ఎత్తుకుపోతున్నావు. ఈమెను విడవకున్న నిన్ను సంహరిస్తున్నాను " అన్నాడు. జటాయువుకు రావణునికి మధ్య పోరు ఘోరంగా జరిగింది. జటాయువు తన ముక్కుతో, గోళ్ళతో రావణుని గాయ పరచింది.

రావణుడు జటాయువు రెక్కలు ఖండించాడు. జటాయువు నేల కూలాడు. రావణుడు సీతను ఎత్తుకు పోతున్నాడు. సీత ఇక తనను రక్షించే వారు లేరని అనుకుంటున్న సమయంలో ఋష్యమూక పర్వతంపై ఉన్న వానరములను చూసి తన ఆభరణములు చీర కొంగున మూటకట్టి పడవేసింది. రావణుడు సీతను లంకకు తీసుకు వెళ్ళాడు. సీతను అశోకవనంలో ఉంచి రక్షణగా రాక్షస స్త్రీలను కాపలా ఉంచారు.