మిత్రావసువుచెప్పిన నాగసంతతి కథ



"కశ్యప ప్రజాపతి భార్యలు వినత, కద్రువ అనువారలు, కద్రువకు బుట్టిన వారందరూ నాగరాజులు, వారందరూ లెక్కకు శక్యము గానివారట, -వినత కుమారులు ఇద్దరే. వారు గరుత్మంతుడు; అసురుడు అనువారు,

కద్రువ మోసముతో వినతను తనకు దాసిగా చేసికొన్నదట! అందువలన వినత కుమారుడగు గరుత్మంతుడు కూడ వారికి (ఆ నాగులకు) దాసుడయ్యడు. కొంతకాలానికి గరుత్మంతుడు పెద్దవాడై జరిగినది తెలిసికొని, దేవ -లోకమునకుపోయి ఇంద్రుని జయించి అమృతం సంపాదించి తెచ్చి - కద్రువకు యిచ్చి తన తల్లిని దాస్య విముక్తి నుండి తప్పించినాడు. "అమృతము తెచ్చి యిచ్చిన మీరు దాస్య విముక్తులగుతారు" అని కద్రువ చెప్పినది. కావున గరుత్మంతుడు మాతృ దాస్య విముక్తికి, చాల కష్టపడి - ఇంద్రుని ఓడించి అమృతం తెచ్చి వారికి యిచ్చినాడు.

గరుత్మంతునికి నాగులపై కోపము పోలేదు. చాలకాలం తల్లిని తనను వారు దాసులుగా చేసికొని చాల కష్టపెట్టినారు. ఆ కసితో గరుత్మంతుడు దాస్య విముక్తి కాగానే, నాగులపై విజృంభించి కనబడిన ప్రతి సర్పమును భక్షించుట మొదలు పెట్టాడు. అది ఆది శేషువు భరించలేకపోయాడు. తన వంశము రోజూ గరుత్మంతుని వల్ల నశించిపోంతోదని" విష్ణువుతో మొరబెట్టుకొన్నాడు.

విష్ణువుకు వాహనం గరుత్మంతుడు. అందువల్ల ఆయన గరుత్మంతుని పిలిచి మందలించాడు. రోజుకొక నాగును భక్షించుటకు అజ్ఞనిచ్చాడు. ఆ ఆనతి మేరకు గరుత్మంతుడు ప్రతిరోజూ ఒక సర్పాన్ని యీ మలయగిరిమీద భక్షించుచున్నాడు.ప్రతి రోజు ఒక సర్పం ఈ పర్వతం మీదికి వస్తుండడం, గరుత్మంతుడు భక్షించడం జరుగుతోంది. అలా గరుత్మంతుడు భుజించిన సర్పముల యొక్క ఎముకలే ఆ ఎముకరాశి అని తెలియజేశాడు మిత్రావసువు.

ఆ సమయంలోనే గరుత్మంతునకు ఆహారముగా పంపబడ్డ"శంఖచూడు" డను నాగుపాము అక్కడకు వచ్చాడు. అతని తల్లి కుమారునికై దుఃఖించుచు వచ్చినది. ఆ దృశ్యము కరుణామయుడగు జీమూతవాహనుని కంట బడగానే ఎంతయో బాధపడినాడు. ఆ నాగబాలుడు నొక్కనినై నా బ్రతికించి, అతని తల్లికి పుత్రశోకము లేకండా చేయాలని నిశ్చయించుకొన్నాడు.

మిత్రావసువును యింటికి పొమ్మని చెప్పి, తానొక్కడే అక్కడ వుండి పోయాడు. శంఖచూడుడు (సర్పము) స్నానము చేసి వచ్చుటకు ప్రక్కనున్న నదికి పోయినాడు. జీమూతవాహనుడు శంఖచూడునివలె అక్కడ పడుకున్నాడు. గరుత్మంతుడు వచ్చాడు; తనకు నిత్యమూ వస్తున్న నాగబాలుడే అనుకొని జీమూత వాహనుని ఎత్తుకొనిపోయి- కొండ శిఖరంపై పెట్టుకొని భుజింపసాగాడు.

ఇంతలో స్నానం చేసి వచ్చిన శంఖచూడుడు ఆ దృశ్యము చూచి "ఆగు గరుత్మంతా: అతడు నాగుడు కాడు. నన్ను రక్షింపదలచిన విద్యాధర పుత్రుడు జీమూతవాహనుడు. అతనిని చంపకుము "అని ప్రార్థించెను. గరుత్మంతుడు తన పొరబాటు తెలిసికొన్నాడు. వెంటనే స్వర్గమునకు పోయి అమృతం తెచ్చి జీమూతవాహనుని బ్రతికించినాడు. ఆనాటినుండి గరుత్మంతుడు కూడ తన నియమమును కూడ మానుకొన్నాడు.

మహారాజా: వింటివిగదాః కథ. ఈ కథలో ఎవరు గొప్పవారో చెప్పగలవా? తెలిసికూడ చెప్పక పోయినచో నీతల పగిలిపోగలదు" అని హెచ్చ రించాడు. విక్రమార్కుడు ఆలోచించి "భేతాళాః నీ దృష్టిలో జీమూతవాహనుడు గొప్పగా కన్పించవచ్చును. కానీ, అతని కంటే శంఖచూడుడే గొప్పవాడు. శంఖచూడుడు తన ప్రాణం దక్కినందుకు సంతోషించక, జీమూతవాహనునికై ప్రాకులాడాడు. యదార్ధమును చెప్పాడు. జీమూతవాహనునికి ప్రాణము నిలిపాడు. " అని పలికాడు.

ఈ విధంగా మౌనభంగం కావడంతో భేతాళుడు తుర్రుమని ఎగిరి చెట్టుపైకి చేరాడు. విక్రమార్కుడు తిరిగి భేతాళుడుని బంధించుటకు వృక్షము దిక్కుకు బయలు దేరాడు.
విక్రమార్కుడు మరల భేతాళుడుని తనకైవశము చేసికొన్నాడు. భుజముపై వేసికొని బయలుదేరాడు. తప్పించుకొనే మార్గం తెలిసిన భేతాళుడు మరల ఇంకొక కథనిట్లు ప్రారంభించాడు.