ముగ్ధ సంగయ్య కథ



కళ్యాణ కటకంలో ముగ్ధ సంగయ్య అనే భక్తుడున్నాడు. అతడు ప్రపంచ జ్ఞానం లేని అమాయకుడు. కొంత మంది వేశ్యల ఇంటికి పోతుంటే చూచి అది కూడా రాత్రి చేసే శివపూజలో ఒక భాగమనుకొని తానూ వేశ్య ఇంటికి పోతానని చెప్పాడు బసవన్నకు. బసవన్న చిరునవ్వు నవ్వి ముగ్ధ సంగనికి సర్వాలంకారాలు చేయించి పంపాడు.

సంగడు ఒక వేశ్య ఇంటికి పోయాడు. ఆమె సంగణ్ణి ఆదరంతో ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులిచ్చింది. ముగ్ధ సంగడు జీవితంలో ఎన్నడూ వేశ్యలను చూచి ఎరుగడు. అందుకని ఆమెను చూచి ‘విభూతి పూసుకో శివ పూజ మొదలుపెడదాము’ అన్నాడు- ఆమె ఎవరో యోగినిగా భావించి.

‘మేము పచ్చ విభూతి పూస్తాము. ఇది మా సంప్రదాయం’ అని పసుపును చూపించిందామె నవ్వి.

‘రుద్రాక్షల దండ ఏదీ?’ అని అడిగాడు ముగ్ధ సంగయ్య. ‘మేము పాల సముద్రంలో పుట్టిన తెల్ల రుద్రాక్షలు వాడుతాము’ అని తన ముత్యాల దండ చూపింది. ‘యోగీశ్వరీ! నీ జటాజూటమేదీ?’ అన్నాడు సంగయ్య.

‘సగం శివ పూజా ప్రసాద కుసుమాల కోసం ఉంచి మిగిలిన సగమూ జడలుగా అల్లాను’ అని తన వాలుజడలను చూపింది వేశ్య! ‘కచ్చడం కట్టావా?’ అని అడిగాడు సంగయ్య.

‘కచ్చడమేమిటి? ఇదుగో సర్వాంగ కచ్చడం’ అని తన చీరె చూపింది వేశ్య! ‘మీ సంప్రదాయమేమిటి? మీ గురువెవరు?’ అని ప్రశ్నించాడు సంగయ్య. ‘మాది గౌరీ సంప్రదాయం. శివుడు తపస్సు చేసేటప్పుడు హిమాలయాలలో పార్వతి శివుణ్ణి గెల్చిందే ఆమె సంప్రదాయమిది. శక్తి స్వరూపిణి అయిన జగదేక సుందరి మాకు గురువు’ అని చెప్పింది వేశ్య.

ముగ్ధ సంగడు ఇదంతా నిజమేనని నమ్మాడు. ఆమె పడక గది పూజా మందిర మనుకున్నాడు. హంసతూలికాతల్పం, శివ సింహాసనమని భావించాడు. అక్కడి నృత్య, వాద్య, కేళికలన్నీ పూజాక్రమం కాబోలుననుకున్నాడు. మరునాడు వచ్చి అందరికీ ‘రాత్రి నేనొక వింత యోగినిని చూచాను.

అలాంటి యోగిని ఎక్కడా లేదు’ అని చెప్పగా విని అంతా నవ్వి ముగ్ధ సంగయ్యను ఆటలు పట్టించారు.