మూర్ఖులు


అనగా అనగా ఓ మహారాజా వారుండేవారు. అవంతి పురాధీశ్వరులైన ఆ రాజశేఖరులకు అంతువులన్నా, అంతువుల వేటన్నా ఎంతో ప్రీతి. అడవిలోకి వెళ్ళి కౄరమృగాలను వేటాడు తుండేవారు. సాధు జంతువుల్ని తెచ్చి పెంచుతుండేవాడు. ఇలా వుండగా వారికో కోతి దొరికింది. అది యెంతో ముచ్చటగా వుండడం వలన దాన్ని పట్టి తెచ్చి రాజధానిలో ఎంతో శ్రద్ధగా పెంచసాగారు. అది కూడా ఎంతో చురుకైనది కావడం వల్ల, తోటి మనిషి లాగనే వ్యవహరిస్తూండడం వల్ల, రాజుగారు ముచ్చటపడి దానికి ఖడ్గవిద్య నేర్పించారు. అది చాలా. సులువుగా విద్యను నేర్చుకున్నది.

రాజుగారికి ఆ కోతి అన్నా దాని ఖడ్గ విద్యానైపుణ్యమన్నా ఎంతో మోజు పెరిగింది. ఈ వార్త దేశ దేశాలకు ఎగబ్రాకింది. ఎక్కడెక్కడివారో వచ్చి దానిని, దాని విద్యను చూచి వెడుతుండేవారు. అంతేకాదు. రాజుగారు దానితో యుద్ధం చేసి గెలిచినవారిని సత్కరిస్తానని ప్రకటించారు.

తమ శక్తియుక్తులన్నీ చూపించారేగాని ఆ కోతిని ఎవ్వరూ గెలవలేకపోయారు. రాజుగారి ఆనందానికి. అంతులేదు. తాను ముచ్చటపడి పెంచుకుంటున్న కోతి దేశ దేశాల వీరుల్ని ఓడించి మహానీర విక్రమ సంపన్నమయినదిగా కీర్తి పొందడంతో ఎంతగానో ఆనందించాడు. దానిని మరింత ప్రేమగా ఆదరణతో చూస్తుండేవాడు ఆ కోతికి కూడా రాజుగారన్నా వారితోటి సాంగత్యమన్నా ఎంతో ఇష్టత యేర్పడింది.

ఈ విధంగా రాజుగారు ,కోతి ఒకరికొకరు అత్యంత ఆప్తులయ్యారు దానితో రాజుగారు ఆ కోతిని తన అంగరక్షకులలో ఒకదానిగా చేసుకున్నారు. ఆనాటినుండి ఆ కోతి ఇరువది నాలుగు గంటలూ రాజుగారితోనే వుండి వారిని సంరక్షిస్తూండేవి. అలవాటు ప్రకారం రాజుగారు వేటకు వెడుతూ ఆనాడు తనవెంట తన కోతిని కూడా తీసుకువెళ్ళారు. కోతి రాజుగారు కలసి వేటాడి అలసిపోయారు.

రాజుగారు విశ్రాంతి తీసుకుంటూ కోతిని పిలిచి తాగ్రత్తగా చూస్తుండమని చెప్పి -నిద్రపోయారు . కోతి కనురెప్ప వెయ్యకుండా కాపలా కాస్తోంది. రాజుగారు గాఢనిద్రలో వున్నారు. అంతలో ఒక ఈగవచ్చి రాజుగారి వక్షస్థలం మీద వాలింది. అది చూచింది కోతి, రాజావారి మీద వాలిన ఈగమీద దానికి అంతులేని కోపం వచ్చింది. కత్తితీసి ఆ ఈగను ఒక్క వేటు వేసింది ఆ దెబ్బకు ఈగ చచ్చిపోగా, రాజుగారి శరీరం రెండు ముక్కలుగా తెగిపడింది. యెంత నైపుణ్యం నేర్పిస్తేనేం. మంచీ చెడూ ఆలోచించుకోలేని కోతివంటి మూర్ఖుల విద్య ముప్పునే కలిగిస్తుంది. విద్యతో పాటు వివేకం కూడా వుండాలి.