నల్ల కుక్క తెల్ల ఆవు



శ్రీకృష్ణదేవరాయలకు చిరకాలంగా క్షురకర్మ(మంగలిపని), చేసే మంగలి ఉండేవాడు. అతను విశ్వాసపాత్రుడే కాక తన పనిలో చాలా నిపుణుడు కలవాడు కూడా. అతను సదాచార పరాయణుడు. క్షరకుడయినా నిరంతర నిష్టాగరిష్టుడూ, దైవభక్తి పరాయణుడూ.అతని విశ్వాసమునకూ శీలమునకూ చాలా సంతోషించిన రాయల వారొకనాడు – “మంత్రీ! నీకేంకావాలో కోరుకో” అన్నారు. (మంగలిని మంత్రి అని కూడా అంటారు గౌరవంగా)

అప్పుడతను చేతులు జోడించి -ప్రభూ! తమరికి తెలియనిదేమున్నది? నేను చిన్నప్పటినుంచీ నిష్టానియమాలు పాటిస్తూ వచ్చినవాడిని. ఎలాగయినా నన్ను బ్రాహ్మణునిగా చేయించండి, చాలు. నాకు బంగారంమీదా డబ్బుమీదా ఆశాలేదు, కోరికాలేదు – బ్రాహ్మణ్యం మీద తప్ప” అని విన్నవించుకున్నాడు. తీవ్రమయిన కోరిక ప్రభావంలో అతను యుక్తాయుక్తాలు మరచి అటువంటి గడ్డుకోరిక కోరగా – కవీ, పండితుడూ అయిన రాజు కూడా -క్షవర కళ్యాణం చేయించుకున్న ఆనంద సుఖాలలో మైమరచి కాబోలు, సాధ్యాసాధ్యాలను మరచి ” “సరే అలాగే” అనేశారు.

రాజపురోహితులకు కబురు వెళ్లింది. వారు వచ్చారు. “ఈ క్షురకుని బ్రాహ్మణునిగా చేయండి” ఆజ్ఞాపించారు రాయలు. అది అసాధ్యమని వారికి తెలుసు. కాని – రాజాజ్జని కాదంటే దండన తప్పదుకదా అన్న ప్రాణభయం కొద్దీ – అయిష్టంగానే… విధిలేక తలూపారు. అతనిని వారు నదీతీరానికి తీసుకెళ్లి ప్రతిరోజూ హోమాలూ, జపాలూ, మంత్రోచ్చ్భారణలూ చేయసాగారు. ఈ సంగతి ఎవరి చెవిన పడకూడదో వారికే తెలిసింది. అంతే రామలింగడు కూడా ఓ నల్ల కుక్కని రోజూ నది ఒడ్డుకి తీసుకెళ్లి… దానిని మాటిమాటికీ నీళ్లలో ముంచుతూ… ఓం ప్రీం హ్రీం అంటూ రాజపురోహితులకి పోటీగా అన్నట్లు బిగ్గరగా బీజాక్షరాలు పఠించడం మొదలుపెట్టాడు. ఒకవైపు క్షురకుడిని సంస్మరించ ప్రయత్నించే రాజపురోహితులు మరొకవైపు వారికి కొద్దిదూరంలోనే కుక్కని సంస్కరించ ప్రయత్నించే తెనాలి రామలింగడు.

ఒక రోజు క్షురకుడు ఎంతవరకూ విప్రుడయ్యాడో చూద్దామని రాయలవారు అక్కడికి విచ్చేవారు. అప్పటికి- ఇటు రాజపురోహితులూ, అటు రామలింగడూ బిగ్గరగా మహాహడావిడి పడిపోతూ మంత్రోచ్చారణ చేసేస్తున్నారు. వీరు క్షురకుణీ, రామలింగడు నల్ల కుక్కనీ మాటిమాటికీ నదీజలాల్లో ముంచితీస్తున్నారు. రాయలు – రామలింగడి వద్దకు వచ్చి “ఏం చేస్తున్నావ్‌ రామకృష్ణా?” అని ప్రశ్నించారు, నవ్వుని బిగబట్టుకుని.

“ఈ నల్లకుక్కని తెల్ల ఆవుని చేయాలని ప్రయత్నిస్తున్నాను ప్రభూ…” అన్నాడు అతివినయంగా. “కుక్క కుక్కయేకాని గోవెలా కాగలదు? నీకు పిచ్చికాని ఎత్తలేదు కద రామకృష్ణా?” నవ్వారాయన.

నిర్ఫీతికి నిర్మాగమాటానికీ పేరుపడిన రామకృష్ణుడు – “ప్రభువులైన మీకే పిచ్చెక్కినప్పుడు నాకూ పిచ్చెక్కినట్లే మరి” అన్నాడు నిస్సంకోచంగా.

“రామలింగా!” గద్దించాడు రాయలు.

“బెను ప్రభూ. మంగలిని బ్రాహ్మణునిగా చేయడం సాధ్యమయినప్పుడు, కుక్కని గోవుగా చేయడం ఎందుకు సాధ్యపడదని నేను ప్రయత్నించుచున్నాను. యథా రాజా తథా ప్రజాః (రాజుని బట్టే ప్రజలు) కదా?” ఆ ఎత్తిపొడుపుతో రాజుకి జ్ఞానోదయమయింది.

తన తొందరపాటూ తెలివితక్కువతనమూ తెలిసివచ్చాయి. రామలింగడు తనకి సున్నితంగానూ పరోక్షమార్గంలోనూ బుద్ధి చెప్పడానికేి ఇలా చేశాడని గ్రహించి,

క్షురకుడిని బ్రాహ్మణునిగా మార్చే కార్యక్రమాన్ని ఆపుచేయించాడు.