నంద గోపాలుని కథ



విక్రమార్క భూపాలా: నేను చెప్పేది ఆలకించి నా అనుమానం తీర్చు. పూర్వం ఒక గ్రామంలో ధనపాలుడనే శ్రీమంతుడుండేవాడు. అతనికి ధనగర్వం చాలా ఉండేది. తానే ఆ గ్రామానికి ధనవంతుడగుటవల్ల లోకంలోనే తనకంటె గొప్పవాడు లేడని భ్రమించేవాడు. అంతేకాదు, తాను ఏమన్నను గ్రామవాసులందరూ "" తనని మెచ్చాలని కూడ భావించేవాడు.

ఇట్టి గర్వముతో అతడు “చిన్నా పెద్దా" అను తారతమ్యంలేకుండా అందరినీ ఏదో విధంగా అవమానించేవాడు. కవినిగాని, పండితునిగాని, గాయకుని గాని మర్యాదగా చూడక.. ఆక్షేపించేవాడు. వారువాడ "గ్రామానికి అతడే చాల ధనవంతుడు కాబట్టి- అతని శ్రీమంతానికి భయపడి- ఏమీ అనేవారు కారు. ధనపాలుడు ఎక్కడికి వెళ్ళినా, పల్లకినెక్కి వెళ్లేవాడు. కారణ మేమంటే అతనికి ఒక కాలు లేదు; కర్రకాలు ఆధారంగా యింట్లో నడిచేవాడు.

ఒకనాడు ధనపాలుడు పల్లకీ మీద ప్రక్క గ్రామానికి బయలుదేరాడు. గ్రామం చివర ఒక పచ్చని పచ్చిక మైదానం ఉంది. అక్కడ ఒక గొల్ల పిల్లవాడు ఆవుల మందను, గొర్రెలను మేపుకుంటున్నాడు వాని పేరు నందగోపాలుడు. పశువులు దూరంగా మేత మేస్తున్నవి. గొర్రెలు మేకలు ఆ పిల్ల వానికి సమీపమందే గడ్డి మేస్తున్నాయి. నందగోపాలుడు ఒక చెట్టుక్రింద కూర్చుండి హాయిగా పాడుకుంటున్నాడు.

"దినుల మాణి నాయనా: శ్రీ రమణా:" అని ఎంతో శ్రావ్యంగా వినిపించే ఆ పాటలు విని, ధనపాలకుడు పల్లకిని ఆపించి. పాట సొంతంగా ఆలకించాడు; ఎంతో ఆనందంతో పరవశమైపోయాడు.
తరువాత నందగోపాలుని పిలిచి "రేపు మా గృహానికి రారా అబ్బాయీ: మంచిగా పాడినావు. ఇంటిలోని వారుకూడ ఆనందిస్తారు, నీకు మంచి యినాము యిస్తా"నని అన్నాడు ధనపాలుడు.

మరునాడు నందగోపాలుడు.. తనకున్న మంచి దుస్తులలో మంచిదానిని ఎన్నుకొని - ఆ వస్త్రములను గట్టుకొని శ్రీమంతుని యింటికి వెళ్ళాడు. అప్పటికే శ్రీమంతుని భవనంలో ఒక హాలులో చాలామంది కూర్చుని యున్నారు. నందగోపాలుడు వారందరను చూచి మొదట భయపడినాడుగాని, తరువాత దైర్యము తెచ్చుకొన్నాడు. శ్రీమంతునికీ, సభలోని వారందరికీ సమస్కరించాడు. ధనపాలుని ఆజ్ఞతో నందగోపాలుడు తనకు వచ్చిన పాటల నన్నిటినీ శ్రావ్యముగా - లయ బద్ధంగా పాడినాడు; అందరూ చాల సంతోషించారు.

శ్రీమంతుడు చాల ఆనందించాడు; ఒక పళ్ళెంలో బట్టలు, రూపాయలు మొదలైనవి ఉంచి ఆ పిల్లవానికి బహూకరించాడు. పిల్లవాడు ఆనందంతో స్వీకరించాడు. శ్రీమంతుడు ఆ ధనపాలునికి తన అలవాటు పోలేదు. ఆతడు నంద గోపాలుని చూచి "నిన్ను ఎంత చక్కగా వరించిందిరా: ఆ సరస్వతీదేవి: ఆ సరస్వతికి కన్నులులేవురా: ఉంటే ని వంటి నిర్భాగ్యుని వరించకుండా ఉండేది" అన్నాడు.

నందగోపాలుని హృదయం చివుక్కునుంది. ఆనందమంతా మాయమై పోయింది. ఆ స్థానంలో కోపం బయలుదేరింది. "దొరగారు చెప్పిన మాటలు నిజమో కాదో తెలియదుగాని, లక్ష్మీదేవి మాత్రం పూర్తిగా గ్రుడ్డిదిదొరా" అన్నాడు.
"అదెలారా?" అని ప్రశ్నించాడు శ్రీమంతుడు.
గ్రుడ్డిది. కాకపోతే మీ వంటి కుంటివాని యింట ఉంటుందా దొరా?" అని అన్నాడు నందగోపాలుడు నవ్వుతూ, నందగోపాలుని మాటలువిని అక్కడ ఉన్న వారందరూ "పక్కన" నవ్వారు. శ్రీమంతుడు సిగ్గుచే తలవంచుకొన్నాడు. ధనపాలుడు ఆనాటి నుండి తన అలవాటును మానుకొన్నాడు కూడ.

"విక్రమార్క భూపాలా: వింటివిగదాః శ్రీమంతుడు పదిమంది ధనవంతులముందు- నందగోపాలుని గౌరవించాడు: గౌరవాన్ని పాటిఁచకుండా నందగోపాలడు శ్రీమంతుని అవమానించాడు. ఇది నందగోపాలుని అవివేకము కాదా?" అని ప్రశ్నించాడు భేతాళుడు.

వెంటనే విక్రమార్కుడు "కాదు. ధనగర్వమువల్ల విర్రవీగేవారి కందరకూ తగిన నీతి బోధించాడు, గొలపిల్ల వాడైనా "అభిమానం గలవారన్ని కుటుంబాలలోనూ ఉంటారు." అను సత్యాన్ని గూడ వెల్లడిచేశాడు నందగోపాలుడు. అని సమాధానమిచ్చాడు.

ఈ విధంగా నియమం భంగమైనందుల్ల బేతాళుడు తిరిగి వృక్షంపైకి చేరాడు. విక్రమార్కుడు మరల బేతాళుని బంధించుటకై వెనుకకు బయలు చేరాడు. విక్రమార్కుడు విసుగుచెందక మరల వృక్షం చేరుకొన్నాడు; భేతాళుని బంధించి భుజముపై వేసుకొని, ఆశ్రమానికి బయలుదేరాడు. విక్రమార్కుని సహనం పరీక్షింప గోరిన భేతాళుడు యింకొక కథనిట్లు ప్రారంభించినాడు.