నూతుల పెళ్ళి


శ్రీకృష్ణదేవరాయలు కర్నాటక దేశాన్ని పాలించే కాలంలో ఉత్తర హిందూ దేశాన్నంతటినీ మహమ్మదీయులు పరిపాలించేవారు. ఆనాటి ఢిల్లీ పాదుషా ఎంతో ధనము ఖర్చు చేసి ఒక బావిని తవ్వించాడు. అది చాలా అందంగా నిర్మించబడింది.

హిందువులు – దేవాలయం కట్టించినా నూతిని తవ్వించినా ప్రతిష్ట అనే కార్యక్రమం జరుపుతారు. ఐతే – ఢిల్లీపాదుషా తాను అత్యంత సుందరంగా నిర్మించిన బావికి పెళ్లిచేయాలని తలపెట్టాడు. ముహూర్తం పెట్టించి – తమ సామంత రాజులందరికీ యిలా ఆహ్వానాలు పంపాడు.

“మేము నిర్మించిన ఈ దిగుడుబావికి పెండ్లి చేయుచున్నాము. కనుక మీ దేశములోని బావులన్నిటినీ ఆ పెండ్లికి పంపించండి”. ఆ ఆహ్వాన లేఖనందుకున్న రాయలుకి ఆశ్చర్యంతో మతిపోయింది. అక్కడ బావికి పెండ్లి! ఇక్కడ నుంచి బావులు వెళ్లడం – ఏమిటిది? ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. ఢిల్లీ పాదుషానుంచి వచ్చింది. తిమ్మరుసును సలహా అడిగారు ఏంచేయాలని. ఆయనేమీ ఉపాయం చెప్పలేకపోయాడు. అప్పుడు రామకృష్ణుడికి కబురంపి “ఈ ఆహ్వానానికేం చేయాలో తోచక బెంగతో భోజనం కూడా సయించడం లేదు” అంటూ లేఖని చూపించారు.

చదివి – “ఓస్‌! ఇంతేకదా? అని తేలిగ్గా తీసి పారేస్తూ” దీనికి జవాబు, నేను చెబుతాను. ఇలా రాయించండి” అంటూ చెప్పసాగాడు. “……పాదుషావారందించిన అహ్వన పత్రిక అందింది. ఎంతో ఆనందించినాము. మీ ఆజ్ఞ ప్రకారం మా దేశంలోని బావులన్నిటికీ తమ సందేశం వినిపించినాము. ఐతే… మీ బావులు స్వయముగా ఆహ్వానము వ్రాసి పంపలేదని అవన్నియు కోపగించినట్లున్నవి.
అందుచేత మీ బావులలో కనీసమొకటయినను స్వయముగా ఏతెంచి మా బావులకి నచ్చజెప్పి వాటన్నిటినీ వెంటబెట్టుకు వెళ్లవచ్చును. వాటితోపాటు మేమున్నూ బయలుదేరి రాగలవారము..” అలా రాసి పాదుషావారికి పంపారు.
ఆ లేఖ చూసి, “ఏమిటీ! మా దిగుడు బావులు వాళ్ల దేశమేగి వారి బావుల్ని తీసుకు రావాలా! ఇది అసాధ్యం కదా. మనం వారికి పరీక్షపెడుతూ వ్రాసిన ఆహ్వానానికి వారు ఎంత చమత్కారంగా బదులిచ్చారు! భేష్‌.” అని మనసులో మెచ్చుకుని – ఈసారి రాయలవారికి సవ్యమయిన ఆహ్వానం పంపిస్తూ వారి తెలివితేటల నభినందించాడు.


రాయలు ఆ గండం గట్టెక్కించినందుకు రామకృష్ణుడికి బహుమానాలిచ్చాడు.