పాదుషా – భారతం


మహమ్మదీయులు సుమారు రెండు వందలేండ్లు ఢిల్లీని రాజధానిగా చేసికొని పాలించారు. వారిలో కొందరికి హిందువుల పట్ల, హిందూమతం పట్ల గౌరవం. మిగిలిన వారికి ద్వేషం. అలా౦టివారు హిందువులను హింసలు పెడుతూ దేవాలయాలను నాశనం చేసేవారు. శ్రీకృష్ణదేవరాయలు, ఫీదుర్‌షాహీ అనే ఢిల్లీ పాదుషా, ఘోరంగా యుద్ధం చేసి తరవాత సంధిచేసుకున్నారు. ఢిల్లీ పాదుషా – దర్భారు ఉత్సవాలు ఏర్పాటు చేసి సామంతరాజులను వారి పండితులతో సహా ఆహ్వానించగా – రాయలు అష్టదిగ్గజాలను వెంటబెట్టుకుని ఢిల్లీ చేరారు. పాదుషా అందరికీ బహుమానాలిచ్చారు.
రాయల ఆస్థానమందలి కవులను కలుసుకుని, వారి పాండిత్య ప్రతిభను తెలిసికొని, “పాదుషా పక్షంవారిని పాండవులుగానూ శత్రుపక్షంవారిని కౌరవులు గానూ చిత్రీకరిస్తూ పదిరోజులలో భారతాన్ని తిరగ వ్రాయండి -” అని ఆదేశించాడు. రాయలవారికి, వారి పండితులకీ మతిపోయింది. మహాభారతాన్ని మహమ్మదీయుల పరంగా వ్రాయడం వారికిష్టం లేదు, పైగా అలాగ పదిరోజులలో రాయడం అసాధ్యం. అందుచేత వాళ్లు తలపట్టుక్కూర్చునేసరికి, “ఆ భారం నామీద పడెయ్యండి” అన్నాడు రామలింగడు.
వారు బతుకుజీవుడా అనుకుని సరే అన్నారు. పదవరోజు రానే వచ్చేసింది. రామకృష్ణుడు కొన్ని తాళపత్రాలను గ్రంథముగ్గా కట్టి పల్లకీలో ఉంచి మేళతాళాలతో పాదుషా వారి కొలువులో ప్రవేశించి -వారికి సలామ్‌ చేసి- “మహాప్రభో! భారత రచన పూర్తయినట్లే. కాని ఒక సందేహం మిగిలిపోయింది” అన్నాడు. “ఏమది?” అడిగాడు పాదుషా. “మీరు ధర్మరాజు. మీ జనానా (అనగా మీ భార్య) ద్రౌపది. అంతవరకూ చక్కగానే ఉన్నది. కాని భారతంలో ద్రౌపదికి అయిదుగురు భర్తలు కదా? మీరు కాక మీ జనానాకి మిగిలిన నలుగురి భర్తల పేర్లూ తమరు సెలవిచ్చిన తక్షణం గ్రంథములో వ్రాసి తమకు కృతినివ్వగలవాడను” అన్నాడు మహావినయంగా. దాంతో పాదుషాకి విపరీతమయిన కోపం వచ్చింది. “భారతం యింత రంకా! అలాంటి రంకు భారతం మాకొద్దు గాక వద్దు. రాసిందంతా తగల బెట్టెయ్యండి భాయీ, మీకు మంచి నజరానా యిస్తామ్‌” అన్నాడు.
“జీహాం” అంటూ తక్షణం … అక్కడే… వారి కనులముందే ఆ తాటియాకుల కట్టను తగలబెట్టేశాడు రామక్షృష్ణుడు -క్షణం ఆలస్యం చెయ్యకుండా. పాదుషా, అష్టదిగ్గజాలకు పుష్కలంగా బహుమతులిచ్చాడు. రాయలతో సహా అందరూ తిరుగుముఖం పట్టారు – పాదుషా ఆగ్రహానికి గురికాకుండా గండం గట్టెక్కించిన రామలింగడికి కృతజ్ఞతలు తెలిపి.