పనికిమాలినవాళ్ళు


ఒక వూళ్లో ఒక బ్రాహ్మణుడు, ఒక కోమటి వున్నారు. వాళ్లిద్దరి యిళ్ళూ ఒకే చోట వున్నాయి. బ్రాహ్మణుడు చాలా బీదవాడు, కోమటి చాలా ధనవంతుడు: బీదవాడైన బ్రాహ్మణునకు భూతదయా ధర్మచింతన వుండేవికాని, ధనవంతుడైన కోమటికి హృదయం లేదు. ధర్మచింతన మచ్చుకైనా లేదు. అతనికున్నదంతా ధనకాంక్ష పరధనాసహరణలోచన.
అంతటి ధనవంతుడు బీదసాదలను ఆదరించకుండా నిర్ణయాపరుడై వుండటం ఇష్టం లేదు. భగవంతుడికి, అతనికేదయినా మంచిబుద్ధి కలిగించాలని ఎంచేరు ఆయన.
ఒకనాటి రాత్రి ఒక వృద్ధ శూద్రుని రూపంలో భగవంతుడు కోమటి మేడదగ్గరకు వెళ్లి తనకారాత్రి భోజనంపెట్టి పోయే ప్రాణం కాపాడవలసిందని శెట్టిని ప్రార్ధించేడు. కాని శెట్టి హృదయం పాషాణం అందుచేత ఇదేమీ పూటకూళ్ళ యిల్లుకాదు. పొమ్మని గద్దించేడు. అతను పోనీ ఈ రాత్రి అక్కడ నిద్రపోవడానికైనా అనుమతించమని కోరాడు. ఆయన, అందుకు కూడా శెట్టి ఒప్పుకొనకుండా, ఇదేమి సత్రంకాదు. పొమ్మని యింటినుండి తరిమివేసాడాయనను.

అంతట ఆ వృద్ధుడు ఆ ప్రక్కనే వున్న బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి తనకేమైనా తినడానికి పెట్టమని కోరేడు. అతను తనకున్న కొద్దిలోనే ఆ వృద్ధిని తృప్తిపరచి, ఆ నాటి రాత్రి అక్కడ విశ్రమించమని కోరేడు ఆ వృద్ధుడు అట్లే విశ్రాంతి తీసుకొని తెల్లవారిన వెంటనే లేచి వెళ్ళిపోయేడు ఆయన ఇల్లు వదిలిపెట్టి వెలుపలికి వెళ్లినంతనే బ్రాహ్మణుని గృహం స్వర్ణమయం అయింది.

అదంతా కనిపెట్టిన శెట్టి, తక్షణం కదలిపోతున్న వృద్ధుణ్ణి దేవుడని గ్రహించి, పరుగు పరుగునపోయి అతని కాళ్ళమీదపడి తన తప్పిదాన్ని క్షమించవలసినదిగా వేడుకున్నాడు . భగవంతుడు అతని కుయుక్తిని గ్రహించి సరే క్షమించేను. నీకేం కావాలో కోరుకో అన్నాడు. కాని అత్యాశాపరుడయిన శెట్టికి ఏం కోరాలో తెలిసింది కాదు. అప్పటికి అతనికేమీ లోపం లేదు. అందుచేత తొందరపడి ఏదైనా కోరడం కన్నా సావకాశంగా ఆలోచించుకుని కోరడం మంచిదనుకున్నాడతను ఆ సంగతి భగవంతునకు తెలియజేశాడు.
అందుకు భగవంతుడు కూడా ఇష్టపడి , శెట్టి అనుకున్న మొదటి మూడు మాటలు సంభవించడానికి వరం ఇచ్చి అంతర్ధానం అయిపోయేడు. తరువాత శెట్టి చాలా దీర్ఘాలోచనతో ఇంటికి బయలుదేరిపోతున్నారు. అప్పుడే తెల్ల వారడం చేత కాకులు కావు కావు మంటూ ఆకాశంలో ఎగురుతున్నాయి..వాటి కూతలు వల్ల అతనికి ఆలోచన తట్టలేదు. అంతలో ఒక కాకి అతని నెత్తిమీద ఎగురుతూ రెట్ట వేసింది.
దానితో అతనికి అరికాలి మంట నెత్తికెక్కింది. పాడు కాకి ఛస్తే బాగుండును అని అన్నారు.
ఆ మాటతో అది గిర గిర తిరిగి క్రిందపడి చచ్చింది. అప్పుడు అతనికి పశ్చాత్తాపం "కలిగింది. అది కాకి చావడం వలన కలుగలేదు. తమ సంపాదించిన మూడు -మాటలలోను ఒకటి నిష్పలమైపోయినందుకు కలిగింది.

చేసేది లేక నెమ్మదిగా వెళ్ళి తోటలో రాతిమీద కూర్చొని ఆలోచించసాగాడు. అతను అంతలో అతని భార్య అతన్ని లోపలకు రావలసిందని కూలి వాడితో కబురు. -పంపింది. కూలివాడు అతని లోపలికి రమ్మన్నాడు కాని తన ఆలోచన తెగేవరకు కదలడానికి ఇష్టంలేక అతను "నేను రాను" అన్నాడు. అంతే అతనా రాతికి తాపడం అయిపోయేడు "అయ్యో! ఎంత చిక్కువచ్చింది" యని బా ధపడ్డాడు అతను.
కానీ, ఆ బాధ తను రాతికి అతుక్కుపోయినందుకు కాకుండా, రెండవ మాటను పాగొట్టుకున్నందుకు పొందేడు.
కొంతసేపటికి అతని భార్య అక్కడకు వచ్చి భర్తను రమ్మని పిలిచింది. అతను మాట్లాడలేదు. పైన చూస్తే కపాలం పేలి పోయేలాగు. గ్రీష్మ భానుని తీవ్రత క్రింద చూస్తే చుర్రునకాలే నేల అలాంటి సమయంలో అతనక్కడ అలాగ కూర్చోవడం ఆమెకు నచ్చలేదు.

అతనికి తనమీద కోపం వచ్చిందేమోనని బ్రతిమాలి పైకి లేవదీయబోయింది. ఆవిడ. కాని లాభంలేకపోయింది. అతను రాతికి తాపడం అయిపోయేడు. అది చూచి ఆవిడ గాభరాపడి ఇదేం ఖర్మంరా దేవుడా అని ఏడవడం మొదలుపెట్టింది.. పలుకరిస్తే పలుకకుండా వుండిపోయిన భర్తను చూసి అవిడ గొల్లుమంది.

కొంతసేపటికి భార్య దుఃఖం చూడలేక జరిగిన చరిత్రనంతటిని చెప్పాడు. అదివిని"అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడయినా ఆ మూడో వరాన్ని మీరు రాతినుండి విడివడటానికి వుపయోగించుకోండి అని కోరింది ఆమె. అతడు వినలేదు. ఇంకా మంచి వరంకోసం ఆలోచిస్తూనే వున్నాడు. ఇంకా కొంతసేపటికి మిట్టమధ్యాహ్నం అయింది. సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చేడు. దానితో అతని బట్టతల సుర్రుమంది. ఇంక వేరే శరణ్యం లేక భార్య చెప్పినట్లుగా ఆ మూడవ వదాన్ని తను రాతినుండి విముక్తి చెందటానికి వుపయోగించుకున్నాడు.
కాకిని చంపడం రాతికి అతుక్కు పోవడం, ఎండలో మలమల మాడిపోవడం -తప్ప దేవుడిచ్చిన మూడువరాలవల్ల ఆ అత్యాశపరుడు పొందిన లాభంలేక పోయింది.
ఇంతకూ భగవద్దర్శమైనా అతనికి దురాశ పోలేదు గదా అనుకుంది అతని భార్య .